ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా పలు వివాదాలు టాలీవుడ్‌ను షేక్ చేశాయి. తారలు, సినీ ప్రముఖుల మధ్య తలెత్తిన ఈ వివాదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మాటాల తూటాలను పేల్చేలా చేశాయి. ఇంతకీ ఆ కాంట్రవర్సీస్ ఏంటి? అందుకు కారణమైన నటీనటులు ఎవరు? తదితర అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
నందమూరి బాలకృష్ణ
ఈ ఏడాది ప్రారంభంలో ‘వీరసింహారెడ్డి’ చిత్ర ప్రమోషన్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అక్కినేని తొక్కినేని’ అంటూ నోరు జారారు. ఇది అక్కినేని అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. నాగచైతన్య, అఖిల్ సైతం ఈ అంశంపై ట్విటర్ (X) వేదికగా స్పందించారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుపై జూ.ఎన్టీఆర్ స్పందించకపోవడం పైనా బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఐ డోంట్ కేర్’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు కూడా వివాదం అయ్యాయి.
సమంత vs చిట్టిబాబు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మయోసిటిస్ (Myositis) వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ‘శాకుంతలం’ సినిమా విడుదల సందర్భంగా దీనిపై నిర్మాత చిట్టిబాబు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సామ్‌కు వచ్చిన వ్యాధి సాధారణమైనదేదని వ్యాఖ్యానించారు. సినిమా విడుదలకు ముందు ఆమె సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. అయితే దీనిపై సమంత పరోక్షంగా స్పందించింది. కొందరికి చెవుల్లో జుట్టు పెరగడానికి కారణం టెస్టోస్టిరాన్ అని చిట్టిబాబును ఉద్దేశిస్తూ కౌంటర్ ఇచ్చింది.
విష్ణు vs మనోజ్
మంచు బ్రదర్స్ అయిన విష్ణు, మనోజ్ మధ్య గొడవలు ఈ ఏడాది తారా స్థాయికి చేరినట్లు కనిపించాయి. మనోజ్ పెళ్ళికి కూడా విష్ణు రాలేదు. వివాహం జరిగిన కొద్దిరోజులకు విష్ణు తన మనుషుల మీద దాడి చేస్తున్నాడని మనోజ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అది క్షణాల్లో వైరల్ అయ్యింది. వెంటనే ఆ వీడియో డిలీట్ చేశాడు. అప్పటి వరకు వచ్చిన పుకార్లకు ఆ వీడియో బలం చేకూర్చింది. అయితే రియాలిటీ షో కోసం చేసిన ఫ్రాంక్ అని విష్ణు నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ జనాలు నమ్మలేదు. కారణం విష్ణు ఇప్పటివరకూ ఎలాంటి రియాలిటీ షో చేయకపోవడమే.
పవన్ vs అంబటి
పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన చిత్రం ‘బ్రో’ (Bro). ఈ సినిమాలో 30 ఇయర్స్ పృథ్వీ ఓ పాత్ర పోషించాడు. ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైంది. ఆ పాత్రను తనను ఉద్దేశించే పెట్టారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ప్రెస్‌మీట్‌లు పెట్టి మరి పవన్‌పై విమర్శలు గుప్పించారు. అయితే ఆ పాత్ర ఎవరినీ ఉద్దేశించి పెట్టలేదని చిత్ర నిర్మాత, నటుడు పృథ్వీ స్పష్టం చేశారు.
విజయ్ దేవరకొండ vs అనసూయ
అనసూయ భరద్వాజ్- విజయ్ దేవరకొండల వివాదం కూడా ఈ ఏడాది టాలీవుడ్‌ని షేక్ చేసింది. ‘ఖుషి’ చిత్ర పోస్టర్‌పై ‘ది విజయ్ దేవరకొండ’ అని రాయడాన్ని ఆమె పరోక్షంగా ఎగతాళి చేశారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. విజయ్‌ని ఉద్దేశపూర్వకంగానే తాను టార్గెట్ చేశానని అనసూయ స్పష్టం చేసింది. విజయ్ వద్ద పనిచేసే వ్యక్తి డబ్బులు ఇచ్చి నాపై దుష్ప్రచారం చేయించాడని ఆమె ఆరోపించింది. విజయ్ ప్రమేయం లేకుండా ఇది జరగదని చెప్పింది. అందుకే తాను విజయ్‌పై విమర్శలు చేసినట్లు వివరించింది.
దిల్‌రాజు vs సి.కళ్యాణ్
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు దిల్ రాజు – సి.కళ్యాణ్ మధ్య మాటల యుద్దానికి దారి తీశాయి. చిన్న నిర్మాతలను తొక్కేస్తూ వాళ్ళను దిల్ రాజు ఎదగనీయడం లేదని సి. కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు దిల్ రాజుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సి కళ్యాణ్ వీడియో బైట్ సైతం విడుదల చేశారు. ఇది అప్పట్లో చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. కాగా ఈ ఎన్నికల్లో దిల్‌రాజు ప్యానెల్ విజయం సాధించింది.
బలగం స్టోరీ వివాదం
ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్ర కథ తనదేనంటూ జర్నలిస్ట్ గడ్డం సతీష్ ఆరోపణలు చేశారు. వేణు తన స్టోరీని కాపీ చేశాడని ఆరోపించారు. అయితే వేణు ఈ కామెంట్స్ ఖండించారు. తన సొంత అనుభవాలతో రాసుకున్న కథ అని సమాధానం ఇచ్చారు. కోర్టులో తేల్చుకోమని సవాలు సైతం విసిరారు.
పుష్ప నటుడు అరెస్టు
పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ ఫ్రెండ్‌గా నటించి పాపులర్ అయిన జగదీష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసే ఓ యువతి ఆత్మహత్య కేసులో అతడ్ని డిసెంబర్ 6న పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను తన దారికి తెచ్చుకోవడం కోసం ఫొటోలతో బెదిరించినట్లు పోలీసుల వద్ద జగదీష్ అంగీకరించాడు. ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని తాను ఊహించలేదని చెప్పుకొచ్చాడు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!