ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యూచరిక్ మైథాలజీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ సినిమాలోని భారీ సెట్స్, హాలీవుడ్ స్థాయి వీఎఫ్‌ఎక్స్ వర్క్స్‌పై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. విజువల్ వండర్‌గా తెరకెక్కించారంటూ చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’ చిత్రం కూడా ‘కల్కి’ బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ విషయంలో డార్లింగ్ ప్రభాస్‌ను మెగాస్టార్ ఫాలో అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
‘కల్కి’ బాటలో ‘విశ్వంభర’!
ప్రభాస్ హీరోగా రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఏకంగా 16 భారీ సెట్లు వేయించారు. సీజీ వర్క్ అని తెలియకుండా ఈ సెట్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆడియన్స్‌కు అద్భుతమైన ఐ ఫీస్ట్‌ను అందించాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ టీమ్ కూడా ‘కల్కి’ వ్యూహాన్నే అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వశిష్ట ఈ మూవీ కోసం కొత్త లోకాన్నే సృష్టించేందుకు యత్నిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 8 భారీ సెట్స్ వేశారని టాక్. మరో 4 సెట్స్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఈ అద్భుతమైన సెట్స్ వేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సెటప్‌ను నిర్మిస్తున్నారు.
కల్కి తర్వాత విశ్వంభరే టాప్!
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం తర్వాత ఆ స్థాయిలో భారీ ఎత్తున సెట్లు వేసిన చిత్రం విశ్వంభరేనని ఫిల్మ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం కూడా కల్కి స్థాయిలో విజువల్ ట్రీట్‌ను ఇవ్వడం ఖాయమని అంచనా వేస్తున్నాయి. అటు మెగాస్టార్ చిరంజీవి సైతం కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. హీరో ప్రభాస్ తరహాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన అలరిస్తాడని చెబుతున్నారు. ఈ చిత్రం కోసం జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోను మెగాస్టార్ చిరు స్వయంగా పంచుకున్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ‘విశ్వంభర’ కోసం చిరు ఎంత డెడికేషన్‌తో పనిచేస్తున్నారో అర్థమవుతోంది. ఇక ఈ మూవీలో చిరుకి జోడీగా త్రిష నటిస్తోంది.
మెగాస్టార్ అసంతృప్తి
లేటెస్ట్ బజ్ ప్రకారం ‘విశ్వంభర’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ జరిగిన షూటింగ్ ఫుటేజీని తాజాగా చిరు పరిశీలించినట్లు సమాచారం. అంతా బాగానే ఉన్న కొన్ని సీన్లపై చిరు అభ్యంతరం వ్యక్తం చేస్తినట్లు తెలుస్తోంది. కథ నుంచి ఆ సన్నివేశాలు డీవియేట్ అవుతున్నట్లు ఆయన భావించారట. దర్శకుడు వశిష్టకు కొన్ని మార్పులను సైతం సూచించినట్లు సమాచారం. దీంతో ఆయా సన్నివేశాలకు సంబంధించి రీషూట్ జరిగే అవకాశమున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే సంక్రాంతి కానుకగా ‘విశ్వంభర’ను తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రీ షూటింగ్ ప్రభావంతో విడుదల తేదీలో ఏమైనా మార్పులు వస్తాయా అన్న అనుమానం కలుగుతోంది.
విలన్‌గా బాలీవుడ్ నటుడు
‘విశ్వంభర’లో చిరుకు విలన్‌గా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటిస్తున్నాడు. అతడు గతంలో నాగార్జున, నాని నటించిన ‘దేవదాస్’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో అలరించాడు. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడు విశ్వంభరలో నటిస్తున్నాడు. వాస్తవంగా ఈ చిత్రంలో విలన్‌గా నటించే ఛాన్స్ మొదట రానా దగ్గుబాటికి దక్కింది. తను నటించే మరో చిత్రంలోని పాత్రకు కాస్త దగ్గరగా ఉండటంతో ‘విశ్వంభర’కు నో చెప్పాడని సమాచారం. ఇక కునాల్ కపూర్‌తో ఇప్పటికే కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారట. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇందులో త్రిషతో పాటు ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.