హైదరాబాద్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది బిర్యానీనే. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాదీ బిర్యానీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఫుడ్ లవర్స్‌కి నిజంగా హైదరాబాద్ ఒక స్వర్గధామం. మన హైదరాబాద్‌లో దొరకని వంటకం అంటూ ఉండదు. స్ట్రీట్ ఫుడ్ నుంచి ఇంటర్నేషనల్ క్యూసిన్స్ వరకు.. అన్ని రకాల డిష్‌లను హైదరాబాద్‌లో ట్రై చేయొచ్చు. అయితే, హైదరాబాద్ వారసత్వాన్ని, సంప్రదాయాన్ని తెలియజేసే వంటకాలు నగరంలో విస్తృతంగా ఉన్నాయి. ఇవి వేటికవే స్పెషల్. మీరు హైదరాబాద్‌లో ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ ఫుడ్స్‌ని ట్రై చేయాల్సిందే.
పాయా
హైదరాబాద్ ఓల్డ్ సిటీ ‘పాయా’కి ఎంతో ఫేమస్. మటన్ పాయా, పాయా నహరి వంటి రకాలు ఉన్నప్పటికీ దాదాపు అన్నింటి రుచి ఒకే విధంగా ఉంటుంది. అసలు, సిసలైన పాయాను తినాలంటే చార్మినార్కి వెళ్లాల్సిందే. అది కూడా తెల్లవారు జామున 3 గంటల నుంచే ఓపెన్ అవుతుంది. చార్మినార్ పరిసరాల్లోని నాయబ్ హోటల్, షాదాబ్ హోటల్ ఇక్కడ ఫేమస్. మటన్ పాయాలో బ్రెడ్ పెట్టుకుని తింటుంటే మైమరిచిపోవాల్సిందే.
బన్ మస్కా
హైదరాబాద్‌లో బన్ మస్కాకి ప్రత్యేక అభిమానులు ఉంటారు. బన్ని దోరగా కాల్చి బటర్‌తో తింటే మామూలుగా ఉండదు. మలైని బాగా కలిపితే వచ్చే క్రీమ్‌ని బన్ మధ్యలో పెట్టిస్తారు. నగరంలోని ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో బన్ మస్కాని తినొచ్చు. కేఫ్ నీలోఫర్, మంగళ్‌హాట్ వంటి చోట్ల బన్ మస్కా ఎంతో ఫేమస్. ఎప్పుడు వెళ్లినా ఇక్కడ దొరుకుతుంది.
బిర్యానీ
బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరంలోని ఏ మూలకు వెళ్లినా ఈ ఫుడ్ దొరుకుతుంది. ఈ మధ్య కూకట్పల్లి ప్రాంతంలో బిర్యానీ రెస్టారెంట్లు తెగ పుట్టుకొచ్చాయి. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు వెలిశాయి. మెహ్ఫిల్, బావర్చి, మెరిడియన్ వంటి రెస్టారెంట్లలో బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. వీధి వీధినా బిర్యానీ దొరుకుతుంది.
హలీం
రంజాన్ పర్వదిన రోజుల్లోనే హలీం దొరికేది. కానీ, కొన్ని రెస్టారెంట్లు ఏడాది పొడవునా హలీంను ఫుడ్ లవర్స్‌కి అందిస్తున్నాయి. మటన్, చికెన్ హలీంలు నోరూరిస్తాయి. ఆరోగ్య పరంగానూ హలీం ఎంతో మేలు చేస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రముఖ రెస్టారెంట్లలో హలీంని ట్రై చేయొచ్చు. రంజాన్ మాసంలో వీధుల్లోనూ దొరుకుతుంది.
మండీ
ఫుడ్ లవర్స్‌ని ఆకట్టుకునే మరో వంటకం మండీ. చికెన్, మటన్, ఫిష్ మండీలు ఉంటాయి. ప్రధానంగా మండీలో స్టాండర్డ్, ఖబ్సా అనే రెండు రకాలుంటాయి. ఖబ్సాలో రైస్ రంగు, టేస్ట్ వేరుగా ఉంటుంది. మూసాపేటలోని అరేబియన్ మండీకి ఫుడ్ లవర్స్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. మిగతా చోట్ల కూడా మండీ రుచికరంగానే ఉంటుంది.
పత్తర్ కా గోష్ట్
ఇది కాస్త వెరైటీగా ఉంటుంది. గొర్రె మాంసాన్ని ముక్కలుగా చేసి రాయిపై కాల్చుతారు. అందుకే దీనికి పత్తర్ కా గోష్ట్ అనే పేరు వచ్చిందని ఫుడ్ లవర్స్ చెబుతుంటుంటారు. చార్మినార్ పరిసరాల్లో ఇది లభిస్తుంది. అటు వైపు వెళ్లినప్పుడు తప్పక ట్రై చేయండి.
షవర్మా
నాన్ వెజ్ లవర్స్ బాగా ఇష్టపడే ఫుడ్ ఇది. మాంసాన్ని కాల్చి దానిని ఓ చపాతిలో పెట్టి రోల్స్‌గా చేసిస్తారు. వెజిటేరియన్ షవర్మాలు కూడా ఉంటాయి. బీఫ్, చికెన్ షవర్మాలను ఎక్కువగా తింటుంటారు. నగరంలో ఎక్కడైనా వీటిని తినొచ్చు. మాదాపూర్, మెహిదీపట్నం, కూకట్పల్లి, ఖార్కానా వంటి చోట్ల ఇది బాగుంటుందని చెబుతుంటారు.
పునుగులు
తక్కువ ఖర్చుతో ఎక్కువ సంతృప్తినిచ్చే స్ట్రీట్ ఫుడ్ ఇది. చిన్న సైజులో చేసే బజ్జీల్లాంటివి. వీటితో పల్లి చట్నీ కలుపుకుని తింటే ఆ టేస్టే వేరు. వీధుల్లోని తోపుడు బండ్ల వద్ద చౌకగా లభిస్తుంటుంది.
ఇంకా..
డబల్ కా మీటా, ఆలూ సమోసా, మిర్చీలు, పానీ పూరీ, దోస, కబాబ్, చికెన్ 65, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్స్.. ఇలా ఎన్నో రకాలు లాలాజలాన్ని ఊరిస్తాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!