నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, సదా, సుదర్శన్, రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, సుమన్, అపర్ణా దాస్ తదితరులు
రచన – దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్. రెడ్డి
సినిమాటోగ్రఫీ: డడ్లీ
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
విడుదల తేదీ: నవంబర్ 24, 2023
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమా ‘ఉప్పెన’ (Uppen Movie)తో బ్లాక్బాస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన చిత్రాలు ఆ స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తాజాగా నటించిన ‘ఆదికేశవ’ మూవీపై వైష్ణవ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో మాస్ లుక్‌లో వైష్ణవ్ కనిపించాడు. మరి, ‘ఆదికేశవ’తో ఆయన విజయం అందుకున్నారా? లేదా?. వైష్ణవ్-శ్రీలీల జోడీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
బాలు (వైష్ణవ్ తేజ్) తల్లిచాటు బిడ్డగా గారాబంగా పెరుగుతాడు. కానీ, కళ్లముందు అన్యాయం జరిగితే అసలు సహించడు. ఎంతటివాళ్లనైనా ఎదిరించే మనస్తత్వం అతడిది. తల్లిదండ్రుల బలవంతంతో కాస్మోటిక్ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు. కంపెనీ సీఈవో చిత్రావతి(శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో రాయలసీమలోని బ్రహ్మసముద్రం ప్రాంతం నుంచి వచ్చిన ఓ పెద్దాయన బాలుకు అసలైన కుటుంబం వేరే ఉందని చెబుతాడు. అతడి అసలు పేరు రుద్ర కాళేశ్వర్‌రెడ్డి అని తెలియజేస్తాడు. ఇంతకీ బాలు ఎవరు? బ్రహ్మ సముద్రం వెళ్లాక అక్కడ ఏం జరిగింది? ఆ ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న చెంగారెడ్డి (జోజు జార్జ్)ని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా సాగిందంటే
ప్రథమార్థం మెుత్తం సరదా సరదాగా కాలక్షేపంగా సాగిపోతుంది. హైదరాబాద్‌లో స్నేహం, ప్రేమ, కుటుంబ సన్నివేశాలు కనిపిస్తాయి. విరామం సమయానికి కథ మలుపు తిరుగుతుంది. ద్వితీయార్థం కథంతా సీమలో చెంగారెడ్డితో ఢీ కొట్టడంతో సాగిపోతుంది. హీరో హీరోయిన్ కలవగానే ఓ పాట, విలన్ హీరో ఎదురుపడగానే ఓ ఫైట్ అన్నట్లు సినిమా సాగిపోతుంది.
ఎవరెలా చేశారంటే
వైష్ణవ్‌తేజ్ మరోమారు మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. ప్రథమార్థంలో లవర్ బాయ్‌గా సరదాగా ఉండే పాత్రలో ఆకట్టుకున్నాడు. ద్వితీయార్థంలో రుద్రకాళేశ్వర్‌రెడ్డిగా వీరోచితాన్ని ప్రదర్శించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక శ్రీలీలకు నటన పరంగా పెద్దగా స్కోప్ లేదు. కానీ డ్యాన్సుల్లో మాత్రం ఎప్పటిలాగే ఇరగదీసింది. హీరో తల్లి పాత్రలో రాధిక మెప్పించారు. విలన్‌గా జోజు జార్జ్ క్రూరంగా కనిపించినా ఆ పాత్ర ప్రభావం తక్కువే. ఇక అపర్ణాదాస్, సుమన్, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సుదర్శన్ అక్కడక్కడా నవ్వించాడు
డైరెక్షన్ ఎలా ఉందంటే?
కథలో ప్రేమ, కుటుంబ బంధాలు, డ్రామా, రాజకీయం తదితర అంశాలు పుష్కలంగా ఉన్నా వాటిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్. రెడ్డి తడబడ్డాడు. ఒకట్రెండు మలుపులు తప్ప కథలో కానీ, కథనంలో కానీ కొత్తదనమేమీ కనిపించదు. పాత రోజుల్లో వచ్చిన ఫ్యాక్షన్ సినిమాల్లాగే డైరెక్టర్ కథను చెప్పినట్లు అనిపిస్తుంది. భావోద్వేగాలతో కట్టిపడేసే సీన్లు, తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి ఎక్కడా కనిపించదు. రచనలో బలం లేకపోయిన దర్శకుడి మేకింగ్ మాత్రం బాగుంది.
టెక్నికల్‌గా
సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. డడ్లీ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. జీవీ ప్రకాశ్ పాటలు గుర్తుపెట్టుకునేలా లేవు. కానీ, నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాకు సంబంధించిన మిగతా విభాగాలు అన్నీ మంచి పనితీరునే కనబరిచాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- వైష్ణవ్‌తేజ్ నటన
- మలుపులు
- నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
- రొటీన్ కథ, కథనం
- పండని భావోద్వేగాలు
Celebrities Featured Articles Political Figure
Revanth Reddy: ‘బన్నీ బౌన్సర్ల వల్లే తొక్కిసలాట’.. సీఎం రేవంత్ సంచలన నిజాలు