• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Manjummel Boys Telugu Review: తెలుగులోకి వచ్చేసిన మలయాళం బ్లాక్‌బాస్టర్‌.. ఇక్కడ కూడా హిట్‌ కొట్టినట్లేనా?

    న‌టీన‌టులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మ‌రియ‌న్‌, లాల్ జూనియ‌ర్ త‌దిత‌రులు

    ద‌ర్శ‌క‌త్వం: చిదంబ‌రం

    సంగీతం:  సుశిన్  శ్యామ్‌

    ఛాయాగ్ర‌హ‌ణం: షైజు ఖలీద్

    నిర్మాణ సంస్థ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌ (తెలుగు డబ్బింగ్‌)

    విడుద‌ల తేదీ: 06-04-2024

    ఇటీవల మలయాళంలో విడుదలై సెన్సేషన్‌ సృష్టించిన చిత్రం ‘మంజుమ్మ‌ల్ బాయ్స్’ (Manjummel Boys Telugu Review). రూ.20కోట్ల ప‌రిమిత బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ఏకంగా రూ.200కోట్ల పైచిలుకు వ‌సూళ్లు రాబ‌ట్టి అక్కడ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో ఆ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. అదే పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఇక్క‌డ కూడా భారీ కలెక్షన్స్‌ రాబట్టనుందా? అసలు ఈ చిత్ర కథేంటి? ఇప్పుడు పరిశీలిద్దాం. 

    కథేంటి

    కేర‌ళ‌లోని కొచ్చికి చెందిన కుట్ట‌న్ (షౌబిన్ షాహిర్‌), సుభాష్ (శ్రీనాథ్ భాషి)తో పాటు వారి స్నేహితులంద‌రూ మంజుమ్మ‌ల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేష‌న్ నడుపుతుంటారు. వీరంతా క‌లిసి ఓసారి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్ చూడ‌టానికి వెళ్తారు. అక్క‌డ వారంతా స‌ర‌దాగా గ‌డుపుతుండ‌గా అనుకోకుండా సుభాష్.. 150 అడుగులకు పైగా లోతున్న అతి ప్ర‌మాద‌క‌ర‌మైన డెవిల్స్ కిచెన్ లోయ‌లోకి ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? పోలీసులు వాళ్ల‌పై తిర‌గ‌బ‌డ‌టానికి కార‌ణ‌మేంటి? పోలీసులు, ఫైర్ సిబ్బంది కాకుండా సుభాష్‌ను ర‌క్షించేందుకు కుట్ట‌న్ మాత్ర‌మే లోయ‌లోకి ఎందుకు దిగాడు? వాళ్లిద్ద‌రూ ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డారా? లేదా? అన్న‌ది కథ.

    ఎవరెలా చేశారంటే

    కుట్ట‌న్‌గా షౌబిన్ షాహిర్‌తో పాటు మిగిలిన మిత్ర బృంద‌మంతా స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. అహ్లాదకరమైన సన్నివేశాల్లోనూ.. ఉత్కంఠభరిత సీన్లలోనూ చక్కగా నటించి ఒదిగిపోయారు. ఓ నిజమైన స్నేహితుల బృందాన్ని తెరపై చూస్తున్నామన్న ఫీలింగ్‌ ఆడియన్స్‌లో కల్పించడంలో వారంతా సక్సెస్‌ అయ్యారు. ఇక లోయలో చిక్కుకున్నప్పుడు షాబిన్‌ షాహిర్‌, సుభాష్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ ఓ దశలో ఇదంతా నిజమేమోనన్న భావనను కలిగిస్తుంది. తెర కనిపించిన ప్రతీ ఒక్కరు తమ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. 

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే?

    2006లో గుణ కేవ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు చిదంబరం ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా చూస్తున్నంత సేపూ ఆ ఇరుకు లోయ‌.. క‌టిక చీక‌ట్ల మ‌ధ్య తామే చిక్కుకున్నమన్న ఫీలింగ్‌ ఆడియన్స్‌లో కలిగేలా దర్శకుడు క‌థ‌ను న‌డిపించాడు. విరామం వ‌ర‌కు అస‌లు క‌థ మొద‌లు కాకున్నా.. మంజుమ్మ‌ల్ గ్యాంగ్ చేసే అల్లరితో డైరెక్టర్‌ ఎక్కడా బోర్‌ కొట్టనివ్వలేదు. సుభాష్.. లోయలో ప‌డిన త‌ర్వాత నుంచి క‌థ ఉత్కంఠభరితంగా మారుతుంది. సుభాష్‌ను ర‌క్షించేందుకు కుట్ట‌న్ లోయ‌లోకి దిగే ఎపిసోడ్‌ను ఆద్యంతం ఆసక్తికరంగా డైరెక్టర్‌ తెరకెక్కించారు. సుభాష్‌ను కుట్ట‌న్ చేరుకున్న‌ప్పుడు ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్ష‌కుల్ని ఉలిక్కిప‌డేలా చేస్తుంది. అయితే అక్కడక్కడ కొన్ని సీన్లు మరి సాగదీతలా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే సీన్స్‌ యూత్‌కు మినహా మిగిలిన వయసుల వారికి అంతగా కనెక్ట్‌ కాకపోవచ్చు. చివరిగా చక్కటి ముగింపుతో డైరెక్టర్‌ చిదంబరం అంద‌రి మ‌న‌సుల్ని బ‌రువెక్కించేలా చేశారు. 

    టెక్నికల్‌గా 

    సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. డైరెక్టర్‌, నటీనటుల తర్వాత ఎక్కువ క్రెడిట్‌ సినిమాటోగ్రాఫర్‌ షైజు ఖలీద్‌కు ఇవ్వాల్సిందే. కేవ్‌ సెటప్‌ను తన కెమెరాతో అద్భుతంగా చూపించాడు. నిజంగా ఒక కేవ్‌లో ఉన్నామన్న ఫీలింగ్‌ను తన కెమెరా పనితనంతో ఆడియన్స్‌లో  కలిగించాడు. అలాగే నేపథ్యం సంగీతం కూడా సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. భావోద్వేగ సన్నివేశాలను బీజీఎం చాలా బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • కథ
    • ఉత్కంఠరేపే సెకండాఫ్‌
    • సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్‌ సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌ 

    • నెమ్మదిగా సాగే కథనం

    Telugu.yousay.tv Rating : 3.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv