అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం సర్వత్రా బ్లాక్‌బాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. అయితే అదే సమయంలో ‘పుష్ప 2’ను పలు వివాదాలు చుట్టు ముట్టాయి. ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడం రాష్ట్రంలో తీవ్ర చర్చకు కారణమైంది. ఈ దుర్ఘటనపై హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు వివిధ సెక్షన్ల కింద అల్లు అర్జున్, పుష్ప2 టీం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. దీంతో త్వరలో అల్లు అర్జున్‌ను అరెస్టు (Allu Arjun Arrest) చేస్తారా? అన్న అనుమానం ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ఇండస్ట్రీలో మెుదలైంది.
కేసుకు కారణాలు ఇవే!
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun)పై కేసు పెట్టినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజరుపై సైతం సెక్షన్ 105, 118 (1) కింద కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రీమియర్స్ సందర్భంగా భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఈ కేసు పెట్టినట్లు తెలిపారు. సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం తమకు లేదని డీసీపీ తెలిపారు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా సమాచారం ఇవ్వలేదని చెప్పారు. సమాచారం ఇవ్వకపోగా పబ్లిక్‌ను అదుపుచేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ అక్షాంశ్ యాదవ్ స్పష్టం చేశారు.
సెక్షన్స్ ఏం చెబుతున్నాయి?
అల్లు అర్జున్‌పై నమోదు చేసిన 105, 118(1)r/w3(5) BNS సెక్షన్స్ లీగల్‌గా చాలా స్ట్రాంగ్ అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సెక్షన్ 105ను ప్రాణ నష్టం కేసు లేదా హత్య కింత పరిగణిస్తారని తెలిపారు. హత్య చేయాలనే ఉద్దేశం లేకపోయినా ప్రాణం పోవడంలో పరోక్షంగా అతడి ప్రమేయం ఉన్నందున ఈ సెక్షన్‌కు బన్నీ బాథ్యత వహించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మరో సెక్షన్ 118(1) ‘నేరాన్ని ప్రేరేపించారు’ అని అర్థం వస్తుందని తెలియజేస్తున్నారు. నేరం జరిగిన తర్వాత దాన్ని దాయడం, అసలు అక్కడ ఏమీ జరగలేదనేలా చేయడానికి ప్రయత్నించడం, జరిగిన దుర్ఘటనను తేలిగ్గా తీసుకోవడం అనే ఉద్దేశాలున్నట్లుగా ఈ సెక్షన్ చెబుతుందని అంటున్నారు. దీనికింద నిందితుడికి మరణ శిక్ష, యావజ్జీవిత ఖైదు విధించే అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేస్తున్నారు. కేసుల తీవ్రతను బట్టి ఇది ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. తొక్కిసలాట ఘటన పరిగణలోకి తీసుకొని నేరం రుజువైతే 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల వరకూ శిక్ష పడుతుందని చెబుతున్నారు.
బన్నీ అరెస్టు తప్పదా?
చిక్కడపల్లి పోలీసులు అల్లుఅర్జున్‌ను అరెస్టు (Allu Arjun Arrest) చేసే అవకాశం లేకపోలేదని నేర విభాగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలోనే సంధ్యా థియేటర్ వద్ద భారీ రద్దీ ఏర్పడింది. అయితే తన రాకకు సంబంధించి బన్నీ ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే ఈ కేసు నుంచి అతడు బయటపడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ వెళ్లినట్లైతే అతడికి చిక్కులు తప్పవని చెబుతున్నారు. బన్నీ ముందస్తు సమాచారం ఇచ్చాడా? లేదా? అన్నదానిపై పోలీసులు కూడా ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. థియేటర్ యాజమాన్యం మాత్రమే తమకు ఇన్‌ఫర్మేషన్ ఇవ్వలేదని డీసీపీ ప్రకటించారు. థియేటర్ నిర్వాహకులకు బన్నీ చెప్పి ఉండి, వారు మాత్రం నిర్లక్ష్యం వహించి ఉంటే మాత్రం బన్నీ సేఫయ్యే ఛాన్సెస్ ఉన్నాయని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో పోలీసులకు సైతం సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత బన్నీకి లేదా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మెుత్తం మీద ఈ కేసుపై చిక్కడపల్లి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నందున అరెస్టులకు సంబంధించి త్వరలోనే క్లారిటీ రానుంది.
రూ.25 లక్షల సాయం
‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన దుర్ఘటనపై అల్లు అర్జున్ (Allu Arjun Arrest) స్పందించారు. స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో బాధించిందని బన్నీ తెలిపారు. ఇద్దరు పిల్లల తల్లి రేవతి చనిపోయిందని తెలియగానే తనతో పాటు మూవీ టీమ్ అంతా షాకైందని చెప్పారు. ఫ్యాన్స్‌తో సినిమా చూడటమనేది గత 20 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందని బన్నీ అన్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలా జరగలేదని, ఈ ఘటనతో తమని ఎంతగానో కలిచివేసిందని చెప్పారు. తన తరపున బాధిత కుటుంబానికి రూ.25 లక్షల సాయం అందించనున్నట్లు చెప్పారు. మృతురాలి ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!