నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. సింహా, లెజెండ్, అఖండ.. సినిమాలతో వీరు హ్యాట్రిక్ కొట్టారు. ఈ మూడింట్లోనూ కామన్‌గా పొలిటికల్ టచ్ ఉంటుంది. నాటి వర్తమాన రాజకీయ పరిస్థితులకు అనువదించుకుని వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్.. ఈ సినిమాల్లో ఎన్నో ఉన్నాయి. అయితే, మరోసారి వీరి కాంబో రిపీట్ కానుంది. అఖండ పార్ట్ 2 కోసం ప్లాన్ చేస్తున్నారట. ఈ సారి పొలిటికల్ డోజ్ మరింత పెంచనున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి.
స్టోరీ ఇదేనట..
రాష్ట్రంలోని ప్రముఖ హిందూ దేవాలయాల్లోని పరిస్థితుల చుట్టూ సినిమా కథ ఉంటుందని టాక్. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న దాడులు, అధికార యంత్రాంగం ప్రవర్తనా తీరును ఎండగట్టేందుకు బాలయ్య రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఓ అన్య మతస్థుడు అధికారంలో ఉంటే రాష్ట్రంలోని ఆలయాల దుస్థితి ఎలా ఉంటుంది? వీటిని రక్షించడానికి కథానాయకుడు ఎలాంటి పోరాటం చేశాడనే అంశం ఆధారంగా చిత్రం తెరకెక్కనుందట. ప్యూర్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తూనే మాస్ ఎలివేషన్స్‌ని హైలైట్ చేయనున్నట్లు సమాచారం.
ఎన్నికల నేపథ్యంలో..
రాజకీయాలే లక్ష్యంగా అఖండ పార్ట్ 2 రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా విడుదలను కూడా పక్కాగా ప్లాన్ చేశారట. సరిగ్గా ఏపీ ఎన్నికల ముందే సినిమాను రిలీజ్ చేయాలని బాలయ్య పట్టుదలతో ఉన్నట్లు టాక్. ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికార పార్టీ విధానాలను సినిమా ద్వారా ఎండగట్టాలని చూస్తున్నారట. ఎన్నికల ప్రచారానికి ఈ సినిమాను ఓ ఆయుధంలా వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి, ఈ సినిమాకు బాలయ్య పుట్టినరోజు నాడు శ్రీకారం చుట్టునున్నట్లు టాక్. జూన్ 10న పూజా కార్యక్రమాలు జరుపుకోనున్నట్లు సమాచారం.
లెజెండ్ కూడా..
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన రెండో సినిమా ‘లెజెండ్’. ఈ సినిమా 2014 మార్చి 24న విడుదలైంది. సరిగ్గా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ మూవీని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కూడా రాజకీయ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఇదే నేపథ్యంలో కొనసాగుతుంది. ఇందులోని డైలాగులు కూడా పొలిటికల్ టచ్‌తో ఉన్నాయి. నాడు ఈ సినిమా ఎలక్షన్లకు కలిసొచ్చింది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరగ్గా బాలయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ సెంటిమెంట్‌ని మరోసారి వర్కౌట్ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రతిపక్ష పార్టీగా ఉంది.
అఖండ టీంతోనే..
అఖండ పార్ట్ 2 సినిమాలో కూడా దాదాపు అదే టీం పనిచేయనుంది. ఈ సినిమాకు సంగీతం పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఎస్.ఎస్.థమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్‌లో దద్దరిల్లింది. దీంతో పార్ట్ 2కి సైతం థమన్‌నే కొనసాగించనున్నారట. ఇతర టెక్నికల్ టీం కూడా మరోసారి కలిసి పనిచేయనుంది.
వరుస సినిమాలు..
ఓ వైపు ఎమ్మెల్యేగా కొనసాగుతూనే బాలయ్య వరుస సినిమాలను చేస్తున్నారు. ఇటీవల వీరసింహారెడ్డితో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. పక్కా తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ అనంతరం బోయపాటితో అఖండ2 కు బాలయ్య రెడీ కానున్నారు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ సినిమాకు మేకప్ వేసుకోనున్నట్లు సమాచారం.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!