విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star).. గత శుక్రవారం విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. ట్రైలర్, టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన మూవీ టీమ్.. వినూత్నమైన ప్రమోషన్స్‌తో మరింత హైప్ క్రియేట్ చేసింది. కానీ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా ఈ సినిమాపై ట్రోల్స్, నెగిటివిటీ మెుదలైంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురైంది. అసలు సినిమా ఇలా ఎవరైనా తీస్తారా? అంటూ విమర్శలు సైతం వచ్చాయి. ఓ వైపు ఫ్యామిలీ స్టార్ బాగుందంటూ చూసినవారు చెబుతుంటే.. నెట్టింట మాత్రం ఇంత నెగిటివిటీ రావడానికి కారణమేంటి? కావాలనే ఈ సినిమాపై నెగిటివిటీని రుద్దుతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
ఆడియన్స్ ఏమంటున్నారు?
ఫ్యామిలీ స్టార్ సినిమాను చూసిన వారంతా సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉందంటూ స్పష్టం చేస్తున్నారు. బయట ఎందుకు అంతలా ట్రోల్స్, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూన్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ యావరేజ్ కూడా కాదని ఒకటికి రెండుసార్లు చూడాల్సిన సినిమా అంటూ కొందరు యువకులు చెప్పడం విశేషం.
విజయ్‌కు ముందే తెలుసా?
‘ఫ్యామిలీ స్టార్’ గురించి ఇద్దరు యూట్యూబ్ రివ్యూవర్లు మాట్లాడుకున్న వీడియోను విజయ్ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇందులో ఓ రివ్యూవర్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్ సినిమాపై హేట్ లేదని చెప్పాడు. అయితే విజయ్ దేవరకొండపై మాత్రం బాగా వ్యతిరేకత ఉందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా నిర్మాత దిల్ రాజుతో చెప్పినట్లు రివ్యూవర్ అన్నాడు. ‘నాతో సినిమా చేస్తే ఓ బ్యాచ్ రెడీ అవుతది.. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ దిల్‌రాజ్‌తో విజయ్ అన్నాడట. అలాంటి బ్యాచ్‌లు కూడా ఉంటాయా? అని అప్పుడు దిల్ రాజు కూడా షాకైనట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విజయ్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
మెుదటి నుంచి విజయ్ దేవరకొండకు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున యాంటి ఫ్యాన్స్ ఉంటున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక్క సినిమాతో స్టార్ హీరో స్థాయికి చేరడం.. కొంత మంది స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు మింగుడు పడలేదన్నది వాస్తవం. అయితే విజయ్ సహజమైన ప్రవర్తన, మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూల్లో… అతడు మాట్లాడే పద్దతి, ఉన్నది ఉన్నట్లు చెప్పే తీరు, కొన్ని అంశాలపై స్పష్టంగా మాట్లాడటం కొందరికి నచ్చలేదన్నిది వాస్తవం. పలు సందర్భాల్లో విజయ్ క్లిప్పులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ చేసిన సందర్భాలు అనేకం. కారణం ఏదైనా విజయ్ నుంచి ఏ సినిమా రిలీజైనా దాన్ని టార్గెట్ చేస్తూ సినిమాను వెనక్కిలాగటానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈసారి ‘ఫ్యామిలీ స్టార్’కు విజయ్‌పై ఉన్న నెగిటివిటీతో పాటు.. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు పరుశురామ్‌పై ఉన్న హేట్ కూడా తోడైనట్లు కనిపిస్తోంది. అందుకే సినిమా బాగున్నా ఈ స్థాయిలో ట్రోల్స్, నెగిటివ్స్ బయటకు వస్తున్నాయి.
దిల్ రాజుపై నెగిటివిటీ
దిల్ రాజు విషయానికి వస్తే.. గత సంక్రాంతి నుంచి ఆయనపై ట్రోల్ మెుదలయ్యాయి. తమిళ స్టార్ విజయ్‌తో చేసిన ‘వారసుడు’ చిత్రాన్ని గతేడాది సంక్రాంతికి దిల్ రాజు రిలీజ్ చేశారు. చిరు (వాల్తేరు వీరయ్య), బాలయ్య (వీరసింహా రెడ్డి)లకు పోటీగా ఈ సినిమాను తీసుకురావడం కొందరికి నచ్చలేదు. ఈ సంక్రాంతికి ‘హనుమాన్’ విషయంలోనూ దిల్ రాజుపై విమర్శలు వచ్చాయి. చిన్న సినిమాలు వెనక్కి తగ్గాలంటూ ఇన్‌డైరెక్ట్‌గా హనుమాన్‌కు ఆయన సూచించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అటు డైరెక్టర్ పరుశురామ్.. విజయ్‌తో ‘గీతా గోవిందం’ తర్వాత గీతా ఆర్ట్స్‌తో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే సడెన్‌గా దిల్ రాజు నిర్మాణంలో ‘ఫ్యామిలీ స్టార్’ చేయడం కూడా ఒక సెక్షన్‌లో ఆయనపై వ్యతిరేకత రావాడనికి కారణమైంది. ఈ ముగ్గురిపై ఉన్న వ్యతిరేకతే ‘ఫ్యామిలీ స్టార్’పై పెద్ద ఎత్తున ట్రోల్స్, నెగిటివిటీ రావడానికి కారణమై ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఫేక్ రివ్యూస్
కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని పీఆర్ టీమ్స్ పనిగట్టుకుని సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే నెగిటివిటిని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టాయి. సినిమా బాగోలేదని, ఈ సినిమా 90mm రాడ్ అంటూ ఘోరంగా ట్రోల్స్ చేశాయి. ఈ ట్రోల్స్ ప్రేక్షకులపై ప్రభావం చూపాయి. ఫలితంగా సినిమా వసూళ్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అయితే అమెరికా, ఇతర దేశాల్లో మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో 500K డాలర్లను రాబట్టింది.
రిలీజ్‌కు ముందే ట్రోల్స్!
వాస్తవానికి ‘ఫ్యామిలీ స్టార్’ థియేటర్లలోకి రాకముందే ట్రోల్స్ మెుదలయ్యాయి. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కొందరు ఈ సినిమాను టార్గెట్ చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథ అని చెప్పి.. హీరో ఎలా రిచ్ కాస్ట్యూమ్స్ ధరిస్తాడని.. బ్రాండెండ్ షూస్ ఎలా వేస్తారని విమర్శించడం మెుదలు పెట్టారు. మీడియా సమావేశంలోనూ కొందరు విలేఖర్లు ఇదే విధమైన ప్రశ్నలు వేయడంతో నిర్మాత దిల్ రాజు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మిడిల్ క్లాస్ అబ్బాయిని సూపర్ మ్యాన్‌గా చూపించారు? అంటూ ప్రశ్నలు వేయగా.. ‘హీరో అన్నాక హీరో పని చేయాలి కదా. హీరో ఒక 20 మందిని కొడతాడు. రియల్ లైఫ్‌లో కొట్టగలుగుతామా? యాక్షన్ సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్లే కదా. అది సినిమా.. మనం కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఎందుకు? ఎమోషన్‌కి కనెక్ట్ అయితే లాజిక్స్ ఉండవు’ దిల్ రాజు బదులిచ్చారు.
‘గుడ్ మూవీని చంపే ప్రయత్నం చేస్తున్నారు’
తొలిరోజు నుంచి సినిమాపై వచ్చిన నెగిటివిటీని తగ్గించేందుకు నిర్మాత దిల్‌రాజు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఓ థియేటర్ వద్దకు వెళ్లి సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్‌ను మైక్ పెట్టి స్వయంగా ప్రశ్నలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా సినిమా చూసిన ఓ ఆడియన్ మాట్లాడుతూ.. తనకు సినిమా చాలా బాగా నచ్చిందని దిల్‌రాజుతో అన్నారు. మంచి సినిమాను కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నెగిటివ్ రివ్యూలు ఇస్తున్న వారిపై మీరు యాక్షన్ తీసుకోవాలని దిల్‌రాజుకు సూచించారు.
అయితే దిల్ రాజు దీనిపై స్పందిస్తూ.. కేరళలో సినిమా విడుదలైన మూడు రోజుల వరకు రివ్యూస్ ఇవ్వకూడదని అక్కడి కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇక్కడ కూడా అలాంటి చట్టం ఏదైన వస్తే కానీ ఇండస్ట్రీకి మంచి జరగదు అంటూ చెప్పుకొచ్చారు. మేము మంచి సినిమానే తీశాం. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి… కానీ రివ్యూల పేరుతో మీ అభిప్రాయాలను ప్రేక్షకుల మీద రుద్దొద్దు అంటూ చురకలు అంటించారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!