టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఒకరు. ఈ స్టార్ హీరో మంచి మనసు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు తమిళ ఆడియన్స్ కూడా మహేష్ గురించి తెగ పొగిడేస్తున్నారు. మహేష్ చేసిన ఓ పనికి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మహేష్ లాంటి జీరో ఇగో హీరోను ఇప్పటివరకూ చూడలేదంటూ ఆకాశానికెత్తుతున్నారు. అసలు మహేష్ బాబు ఏం చేశారు? కోలీవుడ్ ఫ్యాన్స్ ఎందుకు ఆ స్థాయిలో మెచ్చుకుంటున్నారు? ఈ కథనంలో చూద్దాం.
‘రాయన్’పై మహేష్ రివ్యూ..!
ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’ (Raayan) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా చూసిన మహేష్ బాబు ఎక్స్ వేదికగా ‘రాయన్’ టీమ్‌ను అభినందించాడు. ధనుష్ సహా ప్రధాన తారాగణం యాక్టింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘అద్భుతమైన దర్శకత్వంతో పాటు మంచి నటనతో ధనుష్ అదరగొట్టారు. ఎస్‌జే సూర్య, ప్రకాశ్‌రాజ్, సందీప్ కిషన్‌లు ఉత్తమంగా నటించారు. చిత్రంలో ఉన్న ప్రతిఒక్కరూ వందశాతం మంచి నటన కనబరిచారు. మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం మరో అద్భుతం. ‘రాయన్’ కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చాడు. అటు మహేష్ బాబు పోస్టుపై నటుడు సందీప్ కిషన్ (Sundeep Kishan) స్పందించాడు. సూపర్ స్టార్‌కు ధన్యవాదాలు చెప్పాడు.
‘జీరో ఈగో’ అంటూ ప్రశంసలు
కోలీవుడ్ హీరో ధనుష్ నటన, డైరెక్షన్ స్కిల్స్‌ను మహేష్ బాబు మెచ్చుకోవడంపై తమిళ ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పక్క ఇండస్ట్రీ నుంచి తమిళ సినిమాను మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కోలీవుడ్‌లో ఎంతో మంది స్టార్స్ ఉన్నప్పటికీ సినిమా గురించి ఒక్కరు మాట్లడలేదని కామెంట్స్ చేస్తున్నారు. ‘జీరో ఈగో’తో మహేష్ చేసిన ప్రశంసలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ మంచి మనసు ఏంటో ఈ పోస్టుతో తమకు అర్థమైందని తమిళ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. అటు మహేష్ – ధనుష్ కాంబోలో ఓ సినిమా పడితే రికార్డ్స్ బద్దలేనని అభిప్రాయపడుతున్నారు. అటు తమిళ నటి అపర్ణ బాలమురళి కూడా మహేష్ పోస్టుకు ధన్యవాదాలు తెలిపారు.
కొత్త సినిమాపై రివ్యూ ఇవ్వాల్సిందే!
మహేష్ ఓ సినిమాకు రివ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఆయన తనకు నచ్చిన కొత్త సినిమాల గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉన్నారు. ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ‘పై కూడా మహేష్ ఈ విధంగానే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటనకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫ్యూచరిక్ విజన్‌కు హ్యాట్యాఫ్ అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. అలాగే ‘హరోం హర’, ‘భజేవాయు వేగం’ , ‘ప్రేమలు’ తదితర చిత్రాలపై ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహేష్ లాంటి స్టార్ హీరో ఒక సినిమాను ప్రశంసించారంటే ఆ మూవీలో ఏదోక ప్రత్యేకత ఉండే ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. మహేష్ రివ్యూ ఇచ్చాడంటే ఆ సినిమా కచ్చితంగా బాగుంటుందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
‘SSMB29’తో బిజీ బిజీ
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ‘SSMB29‘ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకధీరుడు రాజమౌళి బిజీ బిజీగా గడుపుతున్నారు. అటు మహేష్ సైతం ఈ సినిమా కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. లాంగ్ హెయిర్‌తో ముఖాన గడ్డంతో హాలీవుడ్ హీరోగా మారిపోయాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ను జర్మనీలో స్టార్ చేయనున్నట్లు సమాచారం. అటు ఈ మూవీకి ‘ఆజానుబాహుడు’, ‘మహారాజ్’, ‘GOLD’ టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మహేష్ బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న మూవీకి సంబంధించి ఏదోక అప్‌డేట్ ఉండొచ్చని అంటున్నారు.