టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కుటుంబాల్లో ‘మెగా ఫ్యామిలీ’ (Mega Family) ఒకటి. మెగాస్టార్ చిరంజీవి ఈ ఫ్యామిలీకి మూల పురుషుడు కాగా ఆయన తర్వాత ఎంతో మంది హీరోలు టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అలా వచ్చిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా వచ్చినా అది టాలీవుడ్‌లో సెన్సేషనే అని చెప్పవచ్చు. అటువంటిది చిరు, పవన్, చరణ్ కలిసి ఒక మల్టీస్టారర్ తీస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే ఎంతో బాగుంది కదూ..! అయితే ఇది త్వరలోనే నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ దిశగా డైరెక్టర్ హరీష్ శంకర్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
‘అదే అతి పెద్ద పాన్ ఇండియా’..
మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో హరీష్ శంకర్ (Harish Shankar) ఒకరు. ఆయన పవన్ కల్యాణ్ భక్తుడిగా తనను తాను ప్రకటించుకున్నారు. అటువంటి హరీశ్ శంకర్ తన ‘మిస్టర్ బచ్చన్‘ సినిమా ప్రమోషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పాన్ ఇండియా చిత్రం ఎందుకు తీయలేదు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘పాన్ ఇండియా కోసం అని కథ రాయలేం. ‘పుష్ప’ పాన్ ఇండియా సినిమా అని తీయలేదు. ‘కాంతార’ పాన్ ఇండియా కోసం చేయలేదు. వాళ్ళ మట్టి కథను చెప్పారు. పాన్ ఇండియా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. సహజసిద్ధంగా అలా జరగాలి. కల్యాణ్ గారు, రామ్ చరణ్, చిరంజీవి ఈ ముగ్గురి కోసం ఒక లైన్ ఎప్పటి నుంచో వర్కవుట్ చేస్తున్నాను. చేస్తే అన్ని పాన్ ఇండియాల కంటే అదే పాన్ ఇండియా అవుతుంది’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారిపోయింది. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
గతంలోనే స్పెషల్ క్యామియోలు!
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ గతంలోనే ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటించారు. ఇందులో చరణ్ ఓ స్పెషల్ క్యామియోతో అలరించాడు. అంతకుముందు ‘బ్రూస్‌లీ’ ‘మగధీర’ చిత్రాల్లో కుమారుడి కోసం మెగాస్టార్ ఒక చిన్న క్యామియో ఇచ్చారు. మరోవైపు చిరంజీవి, పవన్ కల్యాణ్ సైతం రెండు సినిమాల్లో కలిసి నటించారు. ‘శంకర్‌దాదా MBBS’ మూవీలోని ఓ స్పెషల్ సాంగ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మెరిశారు. అలాగే ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా క్లైమాక్స్‌లోనూ అన్న చిరుతో కలిసి పవన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే చిరు, పవన్, చరణ్ ముగ్గురు కలిసి ఇప్పటివరకూ ఒక్కసారి కూడా నటించలేదు. క్యామియోలు తప్ప కలిసి ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో నటించలేదు. దీంతో మెగా మల్టీస్టారర్ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
మెగా ఫ్యామిలీతో అనుబంధం
దర్శకుడు హరీష్ శంకర్‌కు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. పవన్ కల్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీకి వీర విధేయుడన్న పేరు ఈ మాస్ డైరెక్టర్‌కు ఉంది. మెగా ఆడియన్స్ పల్స్ గురించి హరీష్ శంకర్‌కు బాగా తెలుసు. ఆయన ఇప్పటికే నలుగురు మెగా హీరోలతో పని చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh), అల్లు అర్జున్‌తో ‘దువ్వాడ జగన్నాథం’ (Duvvada Jagannadham), వరుణ్‌తేజ్‌తో ‘గద్దలకొండ గణేష్’ (Gaddalakonda Ganesh), సాయి ధరమ్ తేజ్‌తో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ (Subrahmanya For Sale) చిత్రాలు తెరెకెక్కించారు. అందులో మెగా హీరోలను చూపించిన తీరు ఫ్యాన్స్‌ను ఎంతగానో మెప్పించింది. దీంతో అతడి డైరెక్షన్‌లో మల్టీస్టారర్ వస్తే ఇక బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యి త్వరలోనే పట్టాలెక్కాలని కోరుకుంటున్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్ గుర్తుండిపోతుంది’
పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీ అయిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. దీంతో ఆ చిత్రాన్ని పక్కన పెట్టి రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ (Mr.Bachchan) సినిమాను సైతం హరీష్ శంకర్ రూపొందించారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి హరీష్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఆయన వీలును బట్టి సినిమా పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఈ చిత్రం చాలా ఏళ్ల పాటు అభిమానులకు గుర్తుండిపోతుందని భరోసా ఇచ్చారు. పవన్ కల్యాణ్ సినిమా అంటే ఏది ఆశించి థియేటర్లకు వస్తోరో ఆ అంశాలన్నీ సంపూర్ణంగా ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఉంటాయని చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి