• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Odisha Train Tragedy: చావును ధిక్కరించిన సుల్తాన్.. కొన ఊపిరితో ఉన్న కొడుకుకి ప్రాణం పోసిన తండ్రి.. మృత్యువు మెడలు వంచి మరీ..!

    ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన గత 20 ఏళ్లలో పెను విషాదంగా మిగిలిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఘటనలో 275 మంది ప్రయాణికులు మృతి చెందారు. వెయ్యి మందికి పైగా  గాయపడ్డారు. ప్రమాదంతో ఎందరో చిన్నారులు అనాథలయ్యారు. మరెందరో తల్లిదండ్రులు ఒంటరి వారయ్యారు. తమ కుమారులు, కుమార్తెలను సంతోషంగా రైలు ఎక్కించిన కొద్ది గంటల్లోనే ప్రమాద వార్త తెలియడంతో ఎక్కడికక్కడ కుప్పకూలిపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో తమ వారు ఉండకూడదని ప్రార్థించిన వారెందరో. అలా ఓ వ్యక్తి కూడా గట్టిగా నమ్మాడు. తన కుమారుడు చనిపోడంటూ బలంగా విశ్వసించాడు. చివరికి తను నమ్మిన మాటే నిజమైంది. చావు బతుకుల్లో ఉన్న కుమారుడిని గుర్తించి తిరిగి ప్రాణం పోశాడో తండ్రి. 

    కోల్‌కతాకు చెందిన హేలరాం మాలిక్ హౌరా ఏరియాలో ఓ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. తన కుమారుడు విశ్వజిత్ మాలిక్‌(24)ని శుక్రవారం (ప్రమాదం జరిగిన రోజు) షాలిమార్ స్టేషన్లో చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కించి తిరుగు పయనమయ్యాడు. ఇంటికి వెళ్లిన కొన్ని గంటలకే ఒడిశాలో రైలుకు ప్రమాదం జరిగినట్లు వార్త అందింది. తన కొడుకును కూడా అదే ట్రైన్‌లో పంపించిన విషయం గుర్తొచ్చి నిర్ఘాంతపోయాడు. ఇతరులు అంతా విశ్వజిత్ చనిపోయాడని చెబుతూ ఉన్నారు. కానీ, వాటిని హేలరాం పట్టించుకోలేదు. గుండె నిబ్బరం చేసుకున్నాడు. తన కొడుకు బతికే ఉన్నాడన్న ఆత్మ స్థైర్యాన్ని కొనితెచ్చుకున్నాడు. ఏదైతే ఏంటని కొడుకు క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వెంటనే విశ్వజిత్‌కు ఫోన్ చేశాడు. 

    ఫోన్ రింగ్ అవుతోంది. అలా మూడు, నాలుగు రింగ్‌లు అవుతున్న కొద్దీ హేలరాంకు లోలోపల ఆందోళన పెరిగిపోతోంది. చివరికి అవతల ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. కానీ, అప్పటికే విశ్వజిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. నొప్పిని భరించలేక విలవిల లాడుతున్నాడు, నెమ్మదిగా స్పృహ కోల్పోతున్నాడన్న విషయాన్ని హేలరాం అర్థం చేసుకున్నాడు. వెంటనే మరో మారు ఆలోచించకుండా ఒడిశాకు బయల్దేరాడు. తన వెంట బావమరిదిని తీసుకుని ఓ అంబులెన్స్ కట్టుకుని హౌరా నుంచి అదే రాత్రి పయనమయ్యాడు. ఇలా 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. అప్పటికే సహాయక చర్యలు మొదలయ్యాయి. దీంతో తన కొడుకుని ఏదైనా ఆసుపత్రిలో చేర్పించారేమోనని దారి వెంట ఉన్న హాస్పిటల్స్‌లలో ఆరా తీసుకుంటూ వచ్చాడు. ఎక్కడా సమాచారం లేదు. రైలు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను బహానాగ ఉన్నత పాఠశాలలో భద్రపరిచారు. ఏ ఆసుపత్రిలో లేకపోతే ఇక్కడే విశ్వజిత్ మృతదేహం ఉంటుందని ఓ వ్యక్తి వీరితో చెప్పారు. దీంతో మరోసారి గుండె చెరువయ్యింది. కానీ, పట్టు మాత్రం విడువలేదు హేలరాం మాలిక్.

    శవాల మధ్యలో..

    శవాలతో హైస్కూల్ కిక్కిరిసి పోయింది. తమ వారిని గుర్తు పట్టరాకుండా ప్రమాదంలో శరీరాలు ఛిద్రమయ్యాయి. ప్రాంగణమంతా రక్తంతో కళ్లాపి చల్లినట్లయింది. నలు దిక్కుల నుంచి ఆర్తనాదాలు మిన్నంటాయి. ఇందులో తన కొడుకు ఉండొద్దంటూ మనసులో ప్రార్థిస్తూనే లోపలికి అడుగు పెట్టాడు హేలరాం. కానీ, అందరినీ చూడటానికి అనుమతి ఇవ్వలేదు అధికారులు. ఈ క్రమంలో ఎవరో వ్యక్తి చేయి కదులుతోందని కొందరు అరిచారు. అక్కడే ఉన్న హేలరాం ఆ చేయి తన కుమారుడిదేనని గుర్తించారు. శరీరం నిండా గాయాలే. స్పృహలో కూడా లేడు. కానీ, ప్రాణం ఇంకా ఉంది. దీంతో ఆశలు రెట్టింపు చేసుకుని కొడుకుని బాలాసోర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు తండ్రి. 

    బాలాసోర్‌లో ప్రాథమికంగా చికిత్స చేసి కటక్ మెడికల్ కళాశాలకు సిఫార్సు చేశారు. కానీ, హేలరాం వారించి తన కొడుకుని తీసుకెళ్తానని సంబంధిత పత్రాలపై సంతకం చేసి కోల్‌కతాకు పయనమయ్యాడు. ఆదివారమే ఓ ఆసుపత్రిలో మోకాలి సర్జరీ చేయించారు. అయినా, అప్పటికి కూడా విశ్వజిత్ స్పృహలోకి రాలేదు. సోమవారం మరో కాలికి శస్త్రచికిత్స పూర్తి చేశారు. చేయికి కూడా తీవ్ర గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విశ్వజిత్ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. షాక్‌కి గురైన సందర్భాల్లో శరీర భాగాలు పనిచేయడం మందగిస్తాయని ఓ వైద్య నిపుణుడు వెల్లడించారు. విశ్వజిత్‌కు ఎదురైన ప్రమాదం దాదాపు ఇలాంటిదేనని చెప్పారు. చికిత్స తోనే ఇలాంటి వారిని సాధారణ స్థితికి తీసుకు రాగలమని తెలిపారు.

    తండ్రి నమ్మకమే బతికించింది..

    శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి దాదాపు 24 గంటల పాటు ఆ శవాల మధ్యలోనే విశ్వజిత్ ఉండిపోయాడు. కానీ, తండ్రి మనోధైర్యం కొడుకుని కాపాడింది. అందరిలాగా కాకుండా వెంటనే చేరుకోవడంతో కొడుకు ప్రాణాలు దక్కించుకున్నాడు. చివరి వరకు పట్టు విడవకుండా విశ్వజిత్ బతికే ఉంటాడన్న నమ్మకాన్ని హేలరాం సజీవంగా ఉంచుకున్నాడు. చావు మెడలు వంచి కుమారుడికి మరో జన్మను ప్రసాదించాడు. 

    ప్రమాదం ఇలా.. 

    బహానాగ స్టేషన్‌కు సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. లూప్‌ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును సాంకేతిక సమస్య కారణంగా కోల్‌కతా- చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఇదే సమయంలో డౌన్  వెళ్తున్న బెంగుళూరు-యశ్వంత్‌పూర్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ చివరి 2 బోగీలపై కోరమాండల్ కోచ్‌లు పడటంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. రైల్వే చరిత్రలోనే చీకటి రోజుగా 2023, జూన్ 2 మిగిలిపోయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv