పూర్తి కామెడీ సినిమాల డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న మారుతి, హీరో గోపీచంద్ కాంబీనేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’ . చాలా రోజుల నుంచి గోపిచంద్ నుంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు… ఇది పక్కా ఎంటర్ టైన్మెంట్ పంచుతుందని ఆశలు పెట్టుకుని థియేటర్లకు వెళ్లారు. మరి వారి ఆశలు నెరవేరాయా అసలు సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథేంటి?
కథలో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు. సత్యరాజ్ ఒక జడ్జి. ఓ కేసులో తానిచ్చిన తీర్పు వల్ల బాధితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో ఆయన ఆ వృత్తినే వదిలేస్తాడు. ఆయన కుమారుడే గోపీచంద్. ఇతగాడు పక్కా కమర్షియల్. పైసా వస్తుందంటే చాలు ఏ కేసైనా వాదిస్తాడు. ఎలాగోలా అది గెలిచేందుకు ప్రయత్నిస్తాడు. ఇదే సమయంలో తన తండ్రి న్యాయ వృత్తినే వదిలేసేందుకు కారణమైన వ్యక్తి కేసును గోపిచంద్ టేకప్ చేస్తాడు. అప్పుడు తండ్రీ, కొడుకుల మధ్య తలెత్తే భావోద్వేగ, సైద్ధాంతిక సంఘర్షణల నడుమ, కోర్టు రూంలో జరిగే డ్రామా చుట్టూ సినిమా తిరుగుతుంది.
ఎవరెలా చేశారు?
గోపీచంద్ ఎప్పటిలాగే తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసేందుకు చాలా కష్టపడి పనిచేశాడు. స్టైలిష్ అవతార్ లో కామెడీ సన్నివేశాల్లో తన మార్క్ యాక్టింగ్ స్కిల్స్ చూపించాడు. ఇక రాశీ ఖన్నాకు ఫస్టాఫ్ లో కాస్త నిడివి ఎక్కువున్న పాత్ర దొరకడంతో అందుకు తగిన న్యాయం చేసింది. కానీ సెకండాఫ్ లో మాత్రం తన పాత్ర కనిపించకుండా పోయింది. రావు రమేశ్ తన పాత్రకు 100శాతం న్యాయం చేశాడు. ఓ నిబద్ధత, నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా సత్యరాజ్ తన పాత్రలో ఒదిగిపోయారు. ప్రవీణ్ ను సరిగా ఉపయోగించుకోలేదు. ఇతర నటులు తమ పరిధి మేరకు నటించారు.
ఇంతకీ సినిమా ఎలా ఉంది?
మారుతి కెరీర్ మొదలు పెట్టిన కాలంలో చేసినట్టుగా అంతూ పొంతూ లేని కామెడీ బాటలో సినిమాను నడిపించాడు. కానీ అది ఈసారి దాదాపుగా విఫలమైంది. సినిమా మొదలైన కాసేపటికే ప్రేక్షడికి కథేంటి? ఎటు పోతుంది అనేది పూర్తిగా అర్థమైపోతుంది. పోనీలే కొత్తదనం లేకపోయినా కామెడీ అయినా పండిందా అనుకుంటే అదీ నిరాశపర్చింది. ఫస్టాఫ్ లో కేవలం నవ్వించడానికే అన్నట్టుగా రాసుకున్న రాశీ ఖన్నా పాత్ర… అక్కడక్కడ తప్ప చాలా వరకు బోరింగ్ గా సాగింది. తండ్రీ, కొడుకుల సెంటిమెంట్ సీన్లు కన్నీళ్లు తెప్పించడం కాదు కదా కనీసం కదిలించలేకపోయాయి. సినిమా మొత్తం సాదా సీదాగా ఎలాంటి ట్విస్టులూ లేకుండా సాగింది. చివర్లో ఓ ట్విస్ట్ పెట్టినా అప్పటికే ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తి తగ్గుతుంది. ఫైనల్ గా అక్కడక్కడా కాస్త నవ్వుకుంటే చాలు అనుకుని..రొటీన్ కథైనా పర్లేదు, నేను గోపీచంద్ ఫ్యాన్ ని అనుకుంటే సినిమాకు వెళ్లొచ్చు.
సాంకేతిక పనితీరు
జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఓకే ఓకే అన్నట్టుంది. కరం చావ్లా సినిమాటోగ్రఫీ బాగుంది. ఎస్.బీ. ఉద్ధవ్ ఎడిటింగ్ కూడా అంతగా ఆకట్టుకోలేదు.
బలం
అక్కడక్కడా నవ్వించే సీన్లు
గోపీచంద్, సత్యరాజ్, రావు రమేశ్ నటన
బలహీనత
రొటీన్ కథ,కథనం
పేలని కామెడీ
సెకండాఫ్
ఒక్క మాటలో: పక్కా డిసప్పాయింట్ మెంట్
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!