ఇండియన్ మార్కెట్‌లో టాప్ సెల్లింగ్ బ్రాండ్‌లలో ఒకటిగా కొనసాగుతోంది రెడ్‌మీ. చైనీస్ కంపెనీ షావోమీ(Xiaomi) ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ మొబైల్ ప్రియులను అలరిస్తోంది. ఇటీవలే పలు మోడళ్లను రిలీజ్ చేసిన షావోమీ.. ఈ అక్టోబర్‌లో రెడ్‌మీ నోట్ 13 సిరీస్‌ని లాంఛ్ చేయనుంది. అయితే, ఈ సిరీస్‌కి సంబంధించి ఇప్పటికే కొన్ని స్పెసిఫికేషన్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫీచర్లను చూసి గ్యాడ్జెట్ లవర్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. మరి, ఆ విశేషాలు, ఫీచర్లు ఏంటో చూసేద్దాం.
మూడు వేరియంట్లు..
గతేడాది షావోమీ రెడ్‌మీ నోట్ 12 సిరీస్(Redmi Note 12 Series)ని లాంఛ్ చేసింది. ఈ సిరీస్‌లో 3 మోడళ్లను తీసుకొచ్చింది. రెడ్ మీ నోట్ 12 బేస్ వేరియంట్, రెడ్ మీ నోట్ 12 ప్రో, రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్‌లు ఈ సిరీస్‌లో వచ్చాయి. ఇదే విధంగా రెడ్‌మీ నోట్ 13 సిరీస్‌లోనూ మూడు మోడళ్లు విడుదల కానున్నాయి. రెడ్‌మీ నోట్ 13(Redmi Note 13), రెడ్‌మీ నోట్ 13 ప్రో(Redmi Note 13 Pro), రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్(Redmi Note 13 Pro Plus)లుగా మొబైల్స్ లాంఛ్ కానున్నాయి. లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో లీకైన సమాచారం ప్రకారం ఈ మోడళ్లలో కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి.
ప్రాసెసర్(Processor)
రెడ్ మీ నోట్ 13 సిరీస్ మోడళ్లలో చిప్‌సెట్ ఆకట్టుకుంటోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9020 ప్లస్ చిప్‌సెట్‌తో రెడ్ మీ నోట్ 13 రాబోతోంది. ఇదే ప్రాసెసర్ రీసెంట్‌గా విడుదలైన K60 Ultraలోనూ ఉంది. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో రెడ్‌మీ నోట్ 13లోనూ ఇదే చిప్‌సెట్‌ని కంటిన్యూ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కెమెరా(camera)
రెడ్‌మీ నోట్ 13 గ్యాడ్జెట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. 200 మెగా పిక్సెల్‌తో ప్రైమరీ కెమెరా ఉండనున్నట్లు లీకర్లు సమాచారం ఇచ్చారు. ఈ ప్రైమరీ కెమెరాకు Samsung HP3 సెన్సార్ అమర్చారట. దీంతో పాటు Sony IMX355 సెన్సార్‌తో 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉండనుంది. ఇక, Omnivision OV2B10తో కూడిన 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లేదా డీప్ కెమెరా మూడోది. 16 మెగాపిక్సెల్ క్లారిటీ కలిగిన సెల్ఫీ కెమెరా సైతం ఉండనుందట. తక్కువ వెలుతురులోనూ మెరుగ్గా ఫొటోలు తీయగలదు.
టాప్ వేరియంట్
రెడ్ మీ నోట్ 13 సిరీస్‌లో 13 ప్రో ప్లస్(13 Pro Plus) టాప్ వేరియంట్‌గా రానుంది. ఈ మోడల్‌కి సంబంధించిన ప్రత్యేకమైన ఫీచర్లను లీకుదారులు రివీల్ చేశారు. ఈ వేరియంట్ పవర్‌ఫుల్ చిప్‌సెట్‌ని కలిగి ఉండనుందట. వాస్తవానికి మీడియాటెక్ డైమెన్సిటీ 9020 ప్లస్ చిప్‌సెట్ ఈ మోడల్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 200 మెగాపిక్సెల్ క్లారిటీతో కూడిన ప్రైమరీ కెమెరా కూడా ఈ డివైజ్‌కి అమర్చారట. అయితే, ఈ వేరియంట్ కెమెరా 200 మెగా పిక్సెల్‌తో 4X ఇన్-సెన్సార్ జూమ్‌కి సపోర్ట్ చేసేలా డిజైన్ చేసినట్లు వార్తలొచ్చాయి.
ఫాస్ట్ ఛార్జింగ్
రెడ్ మీ నోట్ 13 సిరీస్ ప్రో ప్లస్ వేరియంట్‌కి సంబంధించి మరో టిప్ అందింది. ఇందులో 5,000mAh కెపాసిటీ గల బ్యాటరీ ఉండనుంది. దీంతో పాటు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేయనుంది.
తొలి ఫోన్‌గా..
రెడ్ మీ నోట్ సిరీస్‌లో తొలిసారిగా సరికొత్త డిస్‌ప్లేని తీసుకు రానున్నట్లు తెలిసింది. రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ వేరియంట్ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో రానుంది. 1.5K రిజల్యూషన్‌తో 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేటుతో వస్తోంది. రెడ్‌మీ నోట్ 13, రెడ్‌మీ నోట్ 13 ప్రో వేరియంట్లు ఫ్లాట్ డిస్‌ప్లేతో రానున్నాయి. రెడ్‌మీ నోట్ 13 సిరీస్ డివైజ్‌ల డిజైన్ కూడా లీకయ్యింది. పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో రానుంది. ఈ సిరీస్ అక్టోబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.