టాలివుడ్ ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు కామెడీ పాత్రలు, విలన్ రోల్స్‌కు మాత్రమే పరిమితమైన తెలంగాణ భాష, యాస ఇప్పుడు లీడ్ రోల్స్‌కు చేరింది. తెలంగాణ సంస్కృతి, యాస ఉంటే చిన్న సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. భారీ సినిమాలో పాత్రలకు తెలంగాణ పల్లె యాస ఉందంటే సెన్సేషనల్ అవుతోంది. స్టార్ హీరోలు సైతం సినిమాలోనే గాక వేదికలపై తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు. తెలంగాణ యాస, కట్టూ, బొట్టూ వెండితెరపై వెలుగులీనుతున్నాయి.
బలం చూపిన ‘బలగం’
వెండితెరపై తెలంగాణం చేసే అద్భుతాన్ని ఇటీవల చూపించిన సినిమా ‘బలగం’. వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తెలంగాణ పల్లెల్లో అంత్యక్రియల సంస్కృతి, పరిస్థితులు కళ్లకు కట్టినట్లు అత్యంత భావోద్వేగంగా చూపించారు. అంతర్జాతీయ వేదికపైనా సత్తా చాటింది. లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో రెండు అవార్డులు సొంతం చేసుకుంది.
గుండు గుత్తగా బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘దసరా’
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో మార్చి 30న విడుదలైన దసరా బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తోంది. నాని కెరీర్‌లోనే ఎన్నడూ లేనంతగా… తొలిరోజే రూ.38 కోట్లు వసూలు చేసి ఈ సినిమా సంచలనం సృష్టించింది. సింగరేణి బొగ్గు గనుల్లో ఒక్కప్పుడు ఉన్న పరిస్థితులను శ్రీకాంత్ ఓదెల వెండితెరపై కళ్లకు గట్టాడు. తెలంగాణ భాష పరిమళంతో బ్లాక్‌బస్టర్‌ను కొట్టాడు.
చిన్న సినిమాలతో మొదలై..
అప్పట్లో వెకిలి పాత్రలకే పరిమితమై తెలంగాణ యాసను పూర్తి స్థాయిలో సినిమాలో చూపించడం చిన్న సినిమాలతోనే మొదలైంది. విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘పెళ్లి చూపులు’ ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. అందులో తెలంగాణ యాసలోనే మాట్లాడిన విజయ్… బయట కూడా అదే తీరుతో అందరి మనసులూ ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి కూడా ఆ సినిమాలో మెప్పించాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమాలోనే ఓ నయా ట్రెండ్‌కు ‘అర్జున్ రెడ్డి’ తెరలేపింది. ఇలా తెలంగాణ యాస, సంస్కృతితో హిట్ కొట్టిన టాప్ మూవీస్ చాలానే ఉన్నాయి.
ఫిదా
లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్‌గా వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా ‘ఫిదా’. సినిమా షూటింగ్ మొదలుకుని టైటిల్ దాకా అంతా తెలంగాణమే. తెలంగాణ యాసలోనే రాసిన ‘వచ్చిండే’ పాట మొత్తం యూట్యూబ్‌నే షేక్ చేసింది. తెలంగాణ ప్రకృతి సౌందర్యాన్ని, పల్లెల అందాన్ని తెరమీద ఆవిష్కరించిన సినిమా ఇది. తొలుత ఈ సినిమాకు ‘ ముసురు’ అనే టైటిల్ అనుకున్నారట.
ఈ నగరానికి ఏమైంది?
పెళ్లి చూపులు తర్వాత తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. పక్కా హైదరాబాదీ కుర్రాళ్లు నలుగురిని తీసుకుని సింపుల్‌గా ఉండే ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది. విశ్వక్ సేన్, అభినవ్ పాత్రలు చాలా అద్భుతంగా పండాయి.
డీజే టిల్లు
2022లో వచ్చిన డీజే టిల్లు గురించి అయితే అందరికీ తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డను స్టార్‌ను చేసింది. ఇందులో ప్రతి డైలాగ్ అదిరిపోయాయి. విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండో పార్ట్ కూడా త్వరలోనే రాబోతోంది.
మల్లేశం
ఆసుయంత్రం కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాలో ప్రియదర్శి తెలంగాణ మాండలికాన్ని మనసుకు హత్తుకునేలా పలికించాడు. చేనేతల జీవన స్థితిగతులను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ఇది.
లవ్ స్టోరీ
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మరో సినిమా ‘లవ్ స్టోరీ’. తెలంగాణ పల్లెటూరి పేదోళ్ల పరిస్థితితో పాటు కొన్ని సున్నితమైన విషయాలను స్పృశిస్తూనే శేఖర్ కమ్ముల మరోసారి తెలంగాణ పరిమళాన్నివెండితెరపై వెలుగులీనేలా చేశాడు.
ఇస్మార్ట్ శంకర్
పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ పూరీకి కమ్‌బ్యాక్ మూవీ అయ్యింది. రామ్ తెలంగాణ మాండలికంలో అదరగొట్టాడు. వరంగల్ పిల్లగా హీరోయిన్ నభా నటేశ్ అమితంగా ఆకట్టుకుంది.
విరాట పర్వం
నక్సలిజం ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టిన సినిమా ‘విరాటపర్వం’. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా విమర్శకుల ప్రసంసలు అందుకుంది.
NBK108లోనూ..
నందమూరి నట సింహం బాలయ్య, అనిల్ రావుపూడి కాంబినేషన్‌లో వస్తున్న NBK108లోనూ.. తెలంగాణ సంస్కృతినే కథ నేపథ్యంగా తీసుకున్నట్లు తెలిసింది. ఈసారి తెలంగాణ యాసలో బాలయ్య అలరించనున్నారు.
ఆస్కార్ స్థాయికి
పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు కూడా తెలంగాణ యాసలో పలుకుతున్నారంటే తెలుగు సినిమా ట్రెండ్ ఎలా మారుతుందో తెలుస్తోంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన RRRలో ఎన్టీఆర్ తెలంగాణ యాసలోనే మాట్లాడతాడు. ఆస్కార్ సాధించిన ‘నాటు నాటు’ సాహిత్యం కూడా తెలంగాణమే. ‘ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు’ అంటూ చంద్రబోస్ తెలంగాణ జీవన విధానాన్ని చెప్పాడు. ఒకప్పుడు ‘తొక్కు’ అంటేనే వెక్కిరించి చూసే స్థాయి నుంచి అదే మాటతో ఉన్న పాటకు ఆస్కార్ వచ్చే స్థాయికి తెలంగాణం తెలుగు సినిమాలో చేరింది. నాటు నాటు మాత్రమే కాదు ఇటీవల తెలుగు సినిమాలో తెలంగాణ సాహిత్యానికి ప్రాధాన్యత పెరిగిందనే చెప్పాలి. ‘బలగం’లో కన్నీరు పెట్టించిన పాటలన్నీ కాసర్ల శ్యామ్ రాసినవే. కాసర్ల శ్యామ్ ఇప్పుడు టాప్ లిరిసిస్ట్‌గా ఎదుగుతున్నాడంటే మన యాసకు పెరుగుతున్న ప్రాధాన్యతే.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్