‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ఎన్టీఆర్‌కు బాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. దిగ్గజ హిందీ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి వెండితెరను పంచుకునే అవకాశం దక్కింది. హృతిక్‌తో కలిసి ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకుడు, సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఖరారు చేశారు. ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్, బాలీవుడ్ సహా పాన్ ఇండియా లెవల్లో ఆసక్తిని రేపుతోంది.
అధికారిక ప్రకటన
తరణ్ ఆదర్స్ చెప్పిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్-2’ చిత్రంలో కలిసి నటించనున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యాశ్‌రాజ్ ఫిల్మ్(YSRF) స్పై యూనివర్స్’ నిర్మించనుంది. వార్-2 చిత్రానికి బ్రహ్మాస్త్ర డైరెక్టర్ ‘అయాన్ ముఖర్జీ’ దర్శకత్వం వహిస్తారు. అయితే వార్-2 (WAR2) సినిమా డైరెక్టర్‌ను మంగళవారమే మేకర్స్ ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా భాగం అవుతాడని ఇవాళే తెలిసింది.
ముందే తెలుసా?
బ్రహ్మస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayan mukherjee) ఎన్టీఆర్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. బ్రహ్మస్త్ర సినిమా తెలుగు ప్రమోషన్లో ఎన్టీఆర్ చురుగ్గా పాల్గొన్నాడు. హీరో, హీరోయిన్లు రన్బీర్ కపూర్, అలియాభట్‌లతో కలిసి ప్రచార వేదికల్లో ఎన్టీఆర్ సందడి చేశాడు. బ్రహ్మస్త్ర డైరెక్టర్‌తోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడతారని అప్పట్లో ఎవరూ ఊపించలేదు. అయితే తాజా ప్రకటనను చూసిన ఎన్టీఆర్ అభిమానులు వార్-2 సినిమా గురించి వారికి ముందే తెలిసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ముఖర్జీ కోసం బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నాడని ఊహిస్తున్నారు.
బిజీబిజీగా జూ.NTR
ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. NTR30 పేరుతో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది. పాన్ వరల్డ్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR 31 రూపొందనుంది. ఈ నేపథ్యంలో వార్-2 సినిమా షూటింగ్‌పై ఆసక్తి నెలకొంది. NTR30 షూటింగ్ పూర్తైన వెంటనే వార్-2 సినిమాపై ఎన్టీఆర్ ఫోకస్ పెడతాడా? లేదా NTR 31 చేస్తూనే హృతిక్ సినిమాలో పాలుపంచుకుంటాడా? అన్నది ఆసక్తి కరం. ఇది తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే.
అతి పెద్ద సంస్థ
వార్-2 ను నిర్మించబోయే యాశ్‌రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ సంస్థకు భారీ బడ్జెట్ సినిమాలు తీసిన అనుభవం ఉంది. ఇప్పటివరకూ ఈ నిర్మాణ సంస్థ నుంచి నాలుగు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. కానీ ఆ సినిమాలు బాలీవుడ్‌ను షేక్ చేశాయనే చెప్పాలి. ఇటీవల విడుదలై రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన పఠాన్ చిత్రాన్ని ఈ సంస్థనే నిర్మించింది. గతంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కాంబోలో వచ్చిన ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలను కూడా యాశ్‌రాజ్ సంస్థనే నిర్మించింది. అలాగే 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి చేసిన ‘వార్’ మూవీ కూడా ఈ నిర్మాణ సంస్థ నుంచే రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ ‘టైగర్ వర్సస్ పఠాన్’ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉంది. ఇందులో షారుఖ్, సల్మాన్ నటించనున్నట్లు తెలుస్తోంది.