నటుడు మంచు మోహన్ బాబుకు (Manchu mohan babu) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మీడియా ప్రతినిధిపై దాడికి సంబంధించి పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ మోహన్‌బాబు హైకోర్టుకు వెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపో, మాపో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసే అవకాశముందను అంటున్నారు.
హైకోర్టును ఏం కోరారంటే?
పహడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న మోహన్ బాబు (Manchu mohan babu) ఫాంహౌస్‌లో డిసెంబర్ 10న తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంచు వివాదం కవరేజ్‌కు వెళ్లిన ఓ మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మోహన్‌బాబుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు నోటీసులు సైతం జారీ చేశారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని.. అరెస్టు, తదుపరి దర్యాప్తు చేయకుండా పోలీసులను ఆదేశించాలని మోహన్‌బాబు తన పిటిషన్‌లో కోరారు.
వాదనలు ఎలా జరగాయంటే?
మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌పై సోమవారం (డిసెంబర్ 23) హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మోహన్ బాబు తరపు లాయర్ వాదనలు వినిపించారు. గాయపడిన మీడియా ప్రతినిధితో మోహన్‌బాబుకు కనీసం పరిచయం కూడా లేదని, అతనెవరో కూడా తెలియనప్పుడు హత్యాయత్నం కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు సరైనవి కావని వాదనలు వినిపించారు. మోహన్‌బాబు కుటుంబ సమస్యలు, గొడవలను మీడియా ఛానళ్లు, సోషల్‌మీడియా పెద్దవిగా చేసి చూపించాయని పేర్కొన్నారు.
బెయిల్ ఎందుకు కొట్టిసిందంటే?
మంచు మనోజ్‌తో వచ్చిన బౌన్సర్లతో మోహన్ బాబుకు ప్రాణ హాని ఉండటంతో ఆ విధంగా దాడి చేశారని మోహన్‌బాబు లాయర్ వాదించారు. అనుకోకుండా జరిగిన ఘటన అని చెప్పుకొచ్చారు. మరోవైపు పోలీసుల తరపున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.. బాధితుడి వాంగ్మూలం మేరకు సెక్షన్లు నమోదు చేసినట్లు కోర్టుకు స్పష్టం చేశారు. ఈ కేసులో మోహన్‌బాబు విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల వాదన విన్న న్యాయమూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేశారు.
అరెస్టుకు రంగం సిద్ధం!
హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేసిన నేపథ్యంలోనే మోహన్‌బాబు అరెస్టు ఆలస్యమైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బెయిల్ తిరస్కరిస్తున్నట్లు కోర్టు ప్రకటించడంతో ఆయన అరెస్టుకు క్లియరెన్స్ వచ్చినట్లేనని ప్రచారం జరుగుతోంది. హత్యాయత్నం కేసుకు సంబంధించి త్వరలోనే ఆయన్ను అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉందని క్రైమ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడు మోహన్‌బాబు కూడా అరెస్టు అయితే పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఫిల్మ్ వర్గాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!