‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. అడుగడుగునా ఆధ్యాత్మికత ఫరిడవిల్లేలా సభా ప్రాంగణాన్ని నిర్వహకులు తీర్చిదిద్దారు. దాదాపు లక్షకు పైగా పాసులు మంజూరు చేయగా అంతకుమించి అభిమానులు వేడుకకు వచ్చారు. ఎటు చూసినా రాముడి స్వరూపమే. జై శ్రీరామ్ నినాదమే. అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలో ముఖ్య అతిథులతో పాటు ప్రభాస్, కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ సహా సినిమాకు పనిచేసిన నటీనటులు ఇతర టెక్నిషియన్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రభాస్, కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పెళ్లిపై ప్రకటన..
ప్రభాస్ ప్రస్తుత వయసు 43. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచ్‌లర్ ప్రభాసే. దీంతో ఎక్కడ కనిపించినా డార్లింగ్‌కు ఈ ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. కానీ, ఏనాడూ పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ‘త్వరలో.. త్వరలో’ అంటూ సమాధానాన్ని దాటవేసేవాడు. ‘ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్’ పుణ్యమా అని ప్రభాస్ పెళ్లిపై కొద్దోగొప్పో క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నా.. అది తిరుపతిలోనే జరుగుతుందని తేల్చేశాడు. అభిమానుల నుంచి వచ్చిన ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్ ఈ రిప్లై ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.
ఇక సినిమాల జాతరే..
బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ కెరీర్‌లో వేగం మందగించింది. గత ఐదేళ్లలో ప్రభాస్ చేసింది 2 సినిమాలు మాత్రమే. 2017లో బాహుబలి2 సినిమా విడుదలయ్యాక 2019లో సాహో రిలీజ్ చేశాడు. మళ్ళీ 2022లో రాధేశ్యామ్ సినిమాతో వచ్చాడు. ఇవి రెండూ పెద్దగా రాణించకపోవడంతో ఆదిపురుష్‌పైనే అంచనాలు పెట్టుకున్నారు. అయితే, సినిమాల విషయంలోనూ ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. ఇక నుంచి ఏడాదికి 2, 3 సినిమాలు చేస్తానని ఫ్యాన్స్‌కి మాటిచ్చాడు. ఎక్కువ సినిమాలు చేస్తూ తక్కువ మాట్లాడతానని చెప్పాడు.
ఆదిపురుష్ సినిమా..
ఆదిపురుష్ మూవీ తొలి ట్రైలర్ గతేడాది రిలీజ్ అయినప్పుడు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఓం రౌత్ పనితీరుపై ప్రభాస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ, అవేవీ నిజం కాదని ప్రభాస్ పరోక్షంగా కొట్టి పారేశాడు. ఆదిపురుష్ సినిమా వెనకాల ఉన్న కష్టాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. సినిమా కోసం రోజుకు 20 గంటలు పనిచేశారని గుర్తు చేశారు. దర్శకుడు ఓం రౌత్ పెద్ద యుద్ధమే చేసినట్లు వివరించాడు. తన జీవితంలోనే ఓం రౌత్ లాంటి వ్యక్తులను చూడలేదని ప్రశంసించాడు.
చిరంజీవి కామెంట్స్..
ఆదిపురుష్ సినిమా చేయడం నిజంగా తన అదృష్టమని ప్రభాస్ చెప్పాడు. గతంలో చిరంజీవితో జరిగిన సంభాషణను ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పంచుకున్నాడు. ‘రామాయణం సినిమా చేస్తున్నావా? అని చిరంజీవి సర్ అడిగారు. అవునని చెప్పా. ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు. నీకు దొరికింది అని చెప్పారు’ అంటూ ప్రభాస్ గుర్తు చేసుకున్నాడు.
కృతి సనన్..
ప్రభాస్‌కు జంటగా కృతిసనన్ ఈ సినిమాలో నటించింది. సీత పాత్ర పోషించింది. అయితే, వీరిద్దరి మధ్య ఏదో ఉందని బాలీవుడ్ వర్గాలు అప్పట్లో కోడై కూశాయి. కానీ, అలాంటిదేమీ లేదని కృతిసనన్ గతంలో ఖండించింది. అన్‌స్టాపబుల్ షోలోనూ ప్రభాస్‌ను బాలయ్య ఈ ప్రశ్న అడిగాడు. దీంతో ‘మేడం అంతా క్లారిటీ ఇచ్చేసిందిగా సర్’ అంటూ డార్లింగ్ జవాబు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఈ సినిమాలో నటించిన కృతిసనన్ ప్రభాస్ అభినందించాడు. ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో అభిమానులను ఫిదా చేసిందని కొనియాడాడు.
ప్రభాస్‌పై కృతి సనన్..
ప్రభాస్‌పై కృతిసనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్ ప్రభాస్ గురించి చెప్పింది. ‘ఆన్‌స్క్రీన్‌లో యాక్టీవ్‌గా, ఆఫ్ స్క్రీన్‌లో ప్రభాస్ కామ్‌గా ఉంటారని అనుకుంటారు. కానీ ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు. ప్రభాస్‌లోని కామ్‌నెస్ ఎవరిలోను చూడలేదు. రాముడిగా ప్రభాస్‌ను తప్ప ఎవరిని ఉహించుకోలేం. ఈ సినిమాలో జానకి పాత్ర ఎంతో ప్రత్యేకం’ అని కృతి చెప్పుకొచ్చింది.
ప్రభాస్ లేకుండా ఈ సినిమా చేసి ఉండే వాడిని కాదని డైరెక్టర్ ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఏ ఒక్కరికో సొంతం కాదని, భారత దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి చెందిన సినిమా అంటూ వెల్లడించాడు. ఇది ఇండియన్ ఫిల్మ్ అని ప్రకటించాడు. సినిమా నిర్మాణానికి సహకరించిన నిర్మాత భూషణ్‌కుమార్‌కు ఓం రౌత్ ధన్యవాదాలు చెప్పాడు.
హైలెట్స్..
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డిజైన్ చేశాడు. అయోధ్య సెట్‌ని అందంగా తీర్చిదిద్దాడు. స్టేజిపై వచ్చాక ప్రభాస్ విల్లును ఎక్కుపెట్టడం ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.
ముఖ్య అతిథులు..
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా చినజీయర్ స్వామి హాజరయ్యారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా వేడుకలో పాల్గొన్నారు. జూన్ 16న సినిమా విడుదల కానుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!