నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య
దర్శకుడు: క్లాక్స్
సంగీతం: మణిశర్మ
నిర్మాణ సంస్థ: లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ (బెన్నీ)
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్
విడుదల తేది: ఆగస్ట్ 25, 2023
కార్తికేయ (Kartikeya Gummakonda) హీరోగా నూతన దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించిన చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, ఎల్బీ శ్రీరామ్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యుగాంతం ఇతివృత్తంగా ఓ పల్లెటూరు నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాపై కార్తికేయ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలు వేరని, ఈ చిత్రం వేరని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలిపారు. సరికొత్త జానర్‌లో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ (ఆగస్టు 25) రిలీజైన ఈ చిత్రం కార్తీ నమ్మకాన్ని నిలబెట్టిందా? అతడికి మంచి హిట్ తెచ్చిపెట్టిందా? లేదా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథ
ఈ సినిమా కథంతా 2012 నాటి కాలంలో బెదురులంక గ్రామంలో జరుగుతుంది. శివ శంకర వరప్రసాద్ (కార్తికేయ) హైదరాబాద్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. తన ముక్కుసూటి తనంతో జాబ్ పోగొట్టుకుంటాడు. ప్రేమించిన అమ్మాయి (నేహాశెట్టి)కోసం బెదురులంక గ్రామానికి వస్తాడు. నేహా ఊరి ప్రెసిడెంట్ కూతురు. అప్పటికే ఈ ఊర్లో యుగాంతానికి సంబంధించి వార్త భయానికి గురి చేస్తుంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఊరి ప్రెసిడెంట్(గోపరాజు రమణ)తో కలిసి బ్రహ్మణుడైన బ్రహ్మం(శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్(రాంప్రసాద్) పెద్ద ప్లాన్ వేస్తారు. ఊర్లో అందరి వద్ద ఉన్న బంగారాన్ని కరిగించి శివలింగం, శిలువ చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని వారు గ్రామస్తులను నమ్మిస్తారు. అందుకు ఊరి ప్రజలు అంగీకరించినప్పటికీ హీరో ఒప్పుకోడు. దీంతో అతడ్ని ఊరి నుంచి వెలివేస్తారు. మరి శివ ఊరి పెద్దల ఆటలు ఎలా కట్టించాడు? తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు? ఊరి జనం మూఢనమ్మకాలు పోగొట్టేందుకు ఏం చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
యంగ్ హీరో కార్తికేయ నటన గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలో అయినా అతడు జీవించేస్తాడు. ఈ చిత్రంలో కూడా కార్తికేయ చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు . తనకు నచ్చినట్లుగా జీవించే యువకుడు శివ పాత్రకు కార్తికేయ న్యాయం చేశాడు. కామెడీతో పాటు యాక్షన్ సీన్లలో కూడా అదరగొట్టేశాడు. ఇక చిత్రగా నేహాశెట్టి పాత్ర నిడివి తక్కువే అయినా తనదైన అందచందాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఆశ ఉన్న భూషణం పాత్రలో అజయ్ ఘోష్ అదరగొట్డాడు. కొన్ని చోట్ల తన నటనతో కోటా శ్రీనివాసరావును గుర్తు చేశాడు. అటు బ్రహ్మాగా శ్రీకాంత్ అయ్యంగార్, డేనియల్‌గా రాంప్రసాద్ మెప్పించారు. రాజ్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఎలా సాగిందంటే
సినిమా యుగాంతం అనే వార్తతో ప్రారంభమవుతుంది. దీంతో బెదురులంక జనాల్లో భయాలు ప్రారంభవుతాయి. తొలి భాగం చాలా స్లోగా నడుస్తుంది. పాత్రల పరిచయం, కథని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైమ్ తీసుకోవడంతో కథలో వేగం మిస్ అయ్యింది. అది కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. ఊరి జనాలను మోసం చేసేందుకు ప్రెసిడెంట్, బ్రహ్మం, డేనియల్ కలిసి చేసే కుట్రలు నవ్వులు పూయిస్తాయి. ముల్లుని ముల్లుతోనే తీయాలని హీరో చేసే ప్రయత్నం ఆద్యంతం గిలిగింతలు పెట్టిస్తాయి. దీంతో మొదటి భాగంలోని నీరసాన్ని ఈ కామెడీ తగ్గిస్తుంది. అయితే నేహాశెట్టి, కార్తికేయల మధ్య లవ్ ట్రాక్‌ని బలంగా చూపించలేదు. దీంతో వారి లవ్ ట్రాక్‌లో ఇంట్రెస్ట్ మిస్ అవుతుంది.
డైరెక్షన్ ఎలా ఉందంటే
2012లో యుగాంతం రాబోతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు రావడంతో అసలేం జరుగుతుందో అర్థంకాక అప్పట్లో చాలా మంది ఆందోళనకు గురయ్యారు. కానీ దాన్ని ఎంటర్టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు ఈ చిత్ర దర్శకుడు క్లాక్స్. కొద్ది రోజుల్లో చనిపోతున్నామంటే జనంలో ఉండే భయం కారణంగా పుట్టే ఫన్‌పై ఫోకస్ పెట్టాడు. ప్రజల వీక్‌నెస్‌ని పెద్దలు ఎలా వాడుకుంటారో, మతాల పేరుతో వారిని ఎలా ఆడుకుంటారో కూడా ఈ చిత్రంలో చూపించారు. అదే సమయంలో మూఢవిశ్వాలపై సెటైర్లు పేల్చాడు. దేవుడి పేరుతో చేసే మోసాలను ఇందులో అంతర్లీనంగా చూపించారు. ఎవరికోసమే కాదు, మనకోసం మనం బతకాలనే సందేశాన్నిచ్చాడు. యుగాంతాన్ని యాక్షన్, థ్రిల్లర్ జోనర్‌లో కాకుండా వినోదాత్మకంగా చెప్పాలనే ఆలోచనతోనే దర్శకుడు సగం సక్సెస్ అయ్యారు. తొలి దర్శకుడైనా సినిమాని బాగా డీల్ చేశాడు.
టెక్నికల్‌గా
చిత్రంలోని సాంకేతిక అంశాల విషయానికి వస్తే మణిశర్మ సంగీతం యావరేజ్‌గా ఉంది. ఈ సినిమాకు పాటలు మైనస్ అని చెప్పవచ్చు. సాంగ్స్ అంతగా ఆకట్టుకోకపోయినా మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ పనితీరు బాగుంది. సినిమాను చాలా షార్ప్‌గా కట్ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- హీరో నటన
- కామెడీ
- సినిమాటోగ్రఫీ
- నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
- పాటలు
- హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్
- సాగదీత సీన్లు
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం