టాలీవుడ్ మాస్ చిత్రాలకు కేరాఫ్ అనగానే ముందు గుర్తుకువచ్చే హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). గత కొంతకాలంగా వరుస మాస్ ఎంటర్‌టైనర్స్ తీస్తూ వరుస హిట్స్ అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్ బాబీతో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NBK 109 అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టైటిట్‌ను ‘డాకూ మహారాజ్’గా చిత్ర బృందం అనౌన్స్ చేసింది. అంతేకాదు అదిరిపోయే టీజర్‌తో నందమూరి అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించింది. అయితే టైటిల్, టీజర్‌తోనే దర్శకుడు బాబీ సినిమా కథను చెప్పకనే చెప్పాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
టీజర్‌లో ఏముంది?
నటుడు బాలకృష్ణ – దర్శకుడు బాబీ (Bobby) కాంబోలో రాబోతున్న ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ఈ సినిమాను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీజర్‌ను సైతం రిలీజ్ చేశారు. ‘ఈ కథ వెలుగుని పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది’ అనే డైలాగ్‌తో మెుదలైంది. గుర్తుపట్టావా.. డాకు మహారాజ్’’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్, విజువల్స్ ఈలలు వేయించేలా ఉన్నాయి. ఈ టీజర్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్ సీక్వెన్స్‌తో దర్శకుడు నింపేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ మరోమారు బాలయ్య మాస్ తాండవం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు.
డాకు మాన్సింగ్ ప్రేరణతో..
బాలయ్య పోషిస్తున్న డాకు మహారాజ్ రోల్‌ను ఓ వ్యక్తి నిజ జీవితం ఆధారంగా తీసుకున్నట్లు ఫిల్మ్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎవరీ డాకు మహారాజ్? అని సినీ లవర్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి అసలు పేరు డాకు మాన్సింగ్. పంజాబ్, ఛంబల్ ప్రాంతాల్లో బందిపోటు దొంగగా ఒకప్పుడు చలామణీ అయ్యాడు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తన చిన్నతనంలో డాకు మాన్సింగ్ పేరు బాగా వినేవారట. ఆయన చేసే దోపిడీలు, తప్పించుకునే తీరు విని చిన్నప్పుడు ఎంతో భయపడినట్లు అమితాబ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. అయితే డాకు మాన్సింగ్ దోచుకున్న సొమ్మును సొంతానికి వాడుకునేవారు కాదట. పేదోళ్లకు ఆ ధనం మెుత్తాన్ని పంచేవారని చంబల్ ప్రాంత ప్రజలు చెబుతుంటారు.
స్టోరీ ఇదేనా!
ఒకప్పటి ఫేమస్ బందిపోటు డాకు మాన్సింగ్ (Daku Maharaj Story) పాత్రను ప్రేరణగా తీసుకొని దర్శకుడు బాబీ బాలయ్య చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. దీని ప్రకారం ఈ సినిమాలో బందిపోటైన బాలయ్య ప్రజలకు అండగా నిలుస్తాడని అర్థం చేసుకోవచ్చు. ప్రజలను పీడించి, వారి కష్టాన్ని దోచుకున్న వారిని ఇందులో బాలయ్య టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. వారి నుంచి ఎంతో చాకచక్యంగా దోచుకున్న ధనాన్ని తిరిగి ప్రజలకే పంచుతాడని అంచనా వేయవచ్చు. అయితే మూడు భిన్న కాలాల్ని ప్రతిబింబించేలా కథ ఉంటుందని కూడా అంటున్నారు. దీన్నిబట్టి కథలో డాకు మహారాజ్ ఒక భాగం అవుతాడా? లేదా అతడి చుట్టూనే సినిమా తిరగనుందా? అన్నది తెలియాల్సి ఉంది.
మూడు కోణాల్లో బాలయ్య..
‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) వంటి సూపర్ హిట్ తర్వాత బాలయ్య చేస్తున్న ‘డాకు మహారాజ్’. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, చాందినీ చౌదరి, శ్రద్ధాశ్రీనాథ్ నటిస్తున్నారు. బాలీవుడ్‌కు చెందిన బాబీదేవోల్ ఇందులో కీలకపాత్రలో కనిపించనున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక అగ్ర నటుడు కూడా ఇందులో నటిస్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. కథ సాగే కాలానికి తగ్గట్లుగా బాలకృష్ణ మూడు కోణాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్ కూడా మరో లెవల్లో ఉంటాయని అంటున్నారు. కాగా, ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!