గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌కు సైతం ముహోర్తం ఫిక్సయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
దీపావళి కానుకగా టీజర్?
రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా చేస్తోంది. మరో హీరోయిన్ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీపావళి కానుకగా టీజర్‌ను విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. వీకెండ్లోనే దీనిపై అధికారిక ప్రకటన సైతం ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
తెలుగు స్టేట్స్లో రికార్డు బిజినెస్?
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ.150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. ఆంధ్రా నుంచి రూ. 70 కోట్లు, సీడెడ్ నుంచి రూ.25 కోట్లు, నైజాం ఏరియా నుంచి రూ. 55 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ‘గేమ్‌ఛేంజర్’ను డిసెంబర్లో విడుదల చేయాలని భావించినప్పుడు ఇంత బిజినెస్ జరిగే అవకాశం కనిపించలేదట. అయితే ఈ మూవీ రిలీజ్ సంక్రాంతికి వాయిదా పడటంతో బిజినెస్ రేంజ్ అమాంతం పెరిగిపోయినట్లు ఫిల్మ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
చరణ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే!
సంక్రాంతి రిలీజ్ అంటే సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఈ సంక్రాంతికి బాలయ్య, వెంకటేష్ పాటు, సందీప్ కిషన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నాగచైతన్య ‘తండేల్’ కూడా పొంగల్‌కు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉంటుందని తెలిసినా డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మెుత్తంలో చెల్లించేందుకు ముందుకు వస్తున్నారట. చరణ్ కాకుండా మరే హీరో సినిమా సంక్రాంతికి రిలీజైనా ఈ స్థాయి బిజినెస్ జరుగుతుందన్న అంచనాలు ఉండేవి కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో చరణ్‌కు పూర్తిస్థాయిలో క్రెడిట్ ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు.
భారీ ధరకు ఓటీటీ హక్కులు!
గేమ్ ఛేంజర్ ఓటీటీ హక్కులు సైతం రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రూ.110 కోట్లకు గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవలం సౌత్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ కోసమే అమెజాన్ ఇంత మెుత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిటల్ రైట్స్‌ను మరో ఓటీటీ సంస్థకు అమ్మేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేకర్స్ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఒక్క పాటకు రూ.20 కోట్లు!
‘గేమ్ ఛేంజర్’ నుంచి వచ్చిన మెుదటి రెండు పాటలు ‘జరగండి.. జరగండి..’, ‘రా మచ్చా మచ్చా’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టి నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్ అయ్యింది. అయితే త్వరలో థర్డ్ సింగిల్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సాంగ్ రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి రెండు పాటలు మంచి బీట్తో వచ్చి దుమ్మురేపగా థర్డ్ సింగిల్ మాత్రం మెలోడిగా రానుంది. ఇక లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూడో పాటకు రూ.20 కోట్ల పైనే ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్ ధ్రువీకరించాల్సి ఉంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం