• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Jr.NTR vs TDP: చంద్రబాబు అరెస్టును పట్టించుకోని తారక్‌.. మౌనం వెనక అసలు కారణం అదేనా!

    తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ద్వారా ఆయన వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని సీఐడీ (CID) అభియోగాలు మోపింది. అంతేగాక ఆయన్ను అరెస్టు చేసింది. ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్‌ సైతం విధించింది. ప్రస్తుతం ఈ పరిణామాలే జూ.ఎన్టీఆర్‌కు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఎన్టీఆర్‌ మౌనంగా ఉండిపోవడంపై టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

    కష్టకాలంలో ఇలాగేనా చేసేది?

    ప్రస్తుతం ఎన్టీఆర్‌.. ‘దేవర’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అలాగనీ తారక్‌ విదేశాల్లో ఉన్నాడని భావిస్తే పొరపాటే. ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. పక్క రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ ఏపీలో కాకరేపుతున్న చంద్రబాబు ఇష్యూని తారక్‌ పట్టించుకోకపోవడం తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడనివ్వడం లేదు. టీడీపీ భవిష్యత్‌ నేతగా ఎన్టీఆర్‌ను ఆరాధిస్తుంటే ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలా మిన్నకుండిపోవడంపై టీడీపీలోని ఓ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కుటుంబ వివాదాలను పక్కకుపెట్టి పార్టీకి అండగా ఉండాలని సూచిస్తోంది. కష్ట సమయంలో పార్టీకి, తమ అధినేతకు బాసటగా నిలవాలని కోరుకుంటోంది. 

    ‘టీడీపీ భవిష్యత్‌ దబిడి దిబిడే’..

    మరోవైపు ఎన్టీఆర్‌ మౌనాన్ని చంద్రబాబు ప్రత్యర్థులు అస్త్రంగా మార్చుకుంటున్నారు. టీడీపీపై ఎదురు దాడికి దిగుతున్నారు. చంద్రబాబుపై తరచూ విమర్శలు ఎక్కుపెట్టే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టును జూ.ఎన్టీఆర్‌ కనీసం ఖండించలేదని ఎద్దేవా చేశారు. అసలు అరెస్టు గురించే పట్టించుకోలేదని ట్విటర్‌ (X)లో పోస్టు చేశాడు. ఈ పరిణామంతో చంద్రబాబు, టీడీపీ భవిష్యత్‌ దబిడి దిబిడేనని స్పష్టంగా రుజువైందని RGV వ్యాఖ్యానించారు. అటు సినీ పెద్దలు సైతం అరెస్టుపై స్పందించకపోవడంపై RGV సెటైర్లు వేశారు. ‘మీ సూపర్ క్లోజ్ ఫిలిం ఇండస్ట్రీ సూపర్ బిగ్గీలు కూడా పట్టించుకోవడం లేదు’ అని చంద్రబాబును ఉద్దేశిస్తూ ఆర్జీవీ వ్యాఖ్యానించారు. 

    తారక్‌ మౌనానికి కారణం అదేనా?

    2009 ఎలక్షన్స్‌ ముందు వరకూ తారక్‌ టీడీపీ తరపున చాలా చురుగ్గా వ్యవహరించాడు. ఎన్నికల్లో పార్టీ తరపున సుడిగాలి పర్యటన చేసి తన ప్రచారంతో శ్రేణులను హోరెత్తించారు. అయితే ఆ ఎలక్షన్స్‌లో ఓడిపోవడంతో తారక్‌ను చంద్రబాబు పక్కనే పెట్టేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా 2014 నుంచి పార్టీ వ్యవహారాలకు తారక్‌ను దూరంగా ఉంచారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటివరకూ పార్టీ అవసరాలకు వినియోగించుకొని ఒక్కసారిగా పక్కనపెట్టేయడం తారక్‌ను తీవ్రంగా బాధించిందని అతడి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

    బాలయ్య కూడా ఓ కారణమేనా?

    అప్పట్లో నందమూరి కుటుంబం తరపున ఎన్టీఆర్‌ తండ్రి, దివంగత నటుడు హరికృష్ణ టీడీపీలో చురుగ్గా వ్యవహరించేవారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ మరణానంతరం పార్టీ పగ్గాలు చంద్రబాబు చేపట్టడంలో హరికృష్ణ పూర్తిగా సహకరించారు. అటువంటి హరికృష్ణను.. బాలయ్యతో వియ్యం అందుకున్న తర్వాత చంద్రబాబు పక్కన పెట్టేశారనే అపవాదు ఉంది. లోకేష్‌ – బ్రాహ్మణీ వివాహం తర్వాత నుంచి బాలకృష్ణకు చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ వచ్చారని రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఈ పరిణామాలన్నీ తారక్‌కు, హరికృష్ణ కుటుంబ సభ్యులకు కోపం తెప్పించాయి. ఈ వ్యవహారాల నేపథ్యంలోనే చంద్రబాబుకు, పార్టీ వ్యవహారాలకు తారక్‌ దూరంగా ఉంటున్నారని సమాచారం. 

    తారక్‌ మౌనం కొత్తేమి కాదు..!

    వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీ తీవ్రస్థాయిలో దాడిని ఎదుర్కొన్నప్పుడు తారక్‌ పట్టించుకోలేదు. అసెంబ్లీ సాక్షిగా తన మేనత్త భువనేశ్వరీని వైసీపీ ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో దూషించినప్పుడు తారక్‌ తీవ్ర స్వరంతో ఖండించలేకపోయారు. ‘ఆడవారిని గౌరవించడం మన సంస్కృతి, వ్యక్తిగత దూషణలకు దిగవద్దు’ అంటూ ఎన్టీఆర్‌ సున్నితంగా తప్పుబడటం అప్పట్లో టీడీపీ శ్రేణులకు నచ్చలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలోనూ తారక్‌ స్పందించ లేదు. ఇటీవల ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలకూ ఆయన దూరంగా ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్‌ పేరిట RBI రూ.100 నాణాన్ని రిలీజ్‌ చేసే కార్యక్రమంలోనూ ఎన్టీఆర్‌ కనిపించలేదు. ఈ పరిణామాలను బట్టి ఎన్టీఆర్‌ – టీడీపీ మధ్య గ్యాప్‌ పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv