నటీనటులు: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు
రచన, దర్శకత్వం: సాహిత్ మోత్కూరి
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజు
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె
నిర్మాణ సంస్థ: నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్
విడుదల తేదీ: 25-10-2024
అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర (Yuva Chandra) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం పొట్టేల్ (Pottel Movie Review). సవారి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాహిత్ మోత్కురి ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఏ చిన్న సినిమాకు రాని పబ్లిసిటీ ‘పొట్టేల్’కు వచ్చింది. పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ ‘రంగస్థలం’తో పోలుస్తూ ప్రశంసలు కురిపించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సైతం సినిమా బాగుందంటూ ఆడియన్స్‌లో అంచనాలు పెంచేశారు. శుక్రవారం (అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకుందా? అనన్యకు మంచి విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని గుర్రంగట్టు గ్రామంలో కథ సాగుతుంది. గ్రామ దేవత బాలమ్మకు ఊరి ప్రజలు పుష్కరానికి ఒకసారి జాతర చేసి పొట్టేలును బలిస్తుంటారు. ఆ సమయంలో ఊరి పెద్ద పటేల్ (అజయ్) ఒంటిమీదకి అమ్మవారు పూనుతుందని గ్రామస్తుల నమ్మకం. అయితే పటేల్ ఊరి ప్రజలను ఎదగనివ్వడు. గ్రామస్తులు చదువుకోనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడు. మరోవైపు పెద్ద గంగాధరీ (యువ చంద్ర) అమ్మవారికి బలిచ్చే పొట్టేల్‌కు కాపరిగా ఉంటాడు. ఎవరికీ తెలియకుండా కూతుర్ని చదవిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన పటేల్, గంగాధరీ దగ్గర ఉన్న పొట్టేల్‌ను మాయం చేస్తాడు. జాతర సమయానికి పొట్టేల్ తీసుకురాకపోతే కూతుర్ని బలిస్తానని హెచ్చరిస్తాడు. కూతురి ప్రాణాల్ని దక్కించుకునేందుకు గంగాధరీ ఏం చేశాడు? తిరిగి తీసుకొచ్చాడా లేదా? ఇందులో బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) కథేంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
పటేల్‌గా అజయ్ అద్భుతంగా జీవించాడు. ‘విక్రమార్కుడు’లో టిట్ల పాత్రతో ఎంత ఇంపాక్ట్ ఇచ్చాడో ఈ సినిమాలో అంతకు మించిన ప్రభావం చూపించాడు. అటు గంగాధరీ పాత్రలో కొత్త నటుడు యువ చంద్ర అదరగొట్టాడు. బిడ్డను చదివించాలి, ఊరికి మంచి జరగాలి అని తాపత్రయ పడే వ్యక్తి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అతనికిది తొలి చిత్రమే అయినా పాత్రకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్లిపోయాడు. తెలుగమ్మాయి అనన్య నాగళ్లకు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. బుజ్జమ్మగా అలరించింది. డీగ్లామర్ పాత్రే అయినా చక్కగా నటించింది. సింగర్ నోయల్‌కు కూడా ఇందులో మంచి పాత్రే దక్కింది. శ్రీకాంత్ అయ్యంగార్, ఛత్రపతి శేఖర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు సాహిత్ మోత్కూరి 1980ల నాటి గ్రామీణ నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ ఆరంభంలోనే ప్రేక్షకుల్ని ఆ కాలంలోకి తీసుకెళ్లాడు. తొలి 20 నిమిషాల్లోనే గ్రామంలో లీనమయ్యేలా చేశాడు. పటేళ్ల కాలంలో బడుగు, బలహీన వర్గాలను ఎలా అణగదొక్కారు. ఎలాంటి దారుణానికి ఒడిగట్టేవారు అనే విషయాలను చక్కగా చూపించారు. కులం, మతం, చిన్న పెద్దా అనే అహంకారం అనే అంశాన్ని ప్రొజెక్ట్ చేసిన విధానం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ మధ్య ప్రేమకథ తదితర సన్నివేశాలతో ప్రథమార్థాన్ని చక్కగా తీర్చిదిద్దాడు. సెకండ్ పార్ట్ విషయంలోనే దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. ప్రధాన పాత్రల్ని విలన్ ఎంత హింసిస్తే అంతగా భావోద్వేగాలు పండుతాయనే భావనతో సన్నివేశాల్ని మలిచినట్టు కనిపిస్తుంది. సన్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతుంటాయి. అయితే కథ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
సాంకేతికంగా..
సాంకేతిక విషయాలకొస్తే సంగీతం, కెమెరా విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. పాటలు, నేపథ్య సంగీతం చిత్రంపై మంచి ప్రభావం చూపించాయి. ఎడిటింగ్ పరంగా లోపాలు ఉన్నాయి. ద్వితీయార్ధంలో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చక్కటి పనితీరు కనబరిచింది. తమ పనితనంతో 80ల నాటి వాతావరణాన్ని సృష్టించారు.
ప్లస్ పాయింట్స్
- కథ
- ప్రధాన తారాగణం నటన
- సంగీతం
మైనస్ పాయింట్స్
- ఆసక్తి రేకెత్తించని కథనం
- సాగదీత సన్నివేశాలు
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం