‘బాహుబాలి’ (Baahubali)లో ప్రభాస్‌కు దీటుగా నటించి హీరో దగ్గుబాటి రానా (Daggubati Rana) పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దిగ్గజ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీలోనూ పలు చిత్రాలు చేసి అక్కడా మంచి పేరు సంపాదించాడు. హిందీలో తెలుగు సినిమాలను ప్రమోట్ చేస్తూ అండగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్’ రానా ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రం అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఆడియో లాంచ్ జరగ్గా రానాపై రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘రానా భయపెట్టాడు’
రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్‘ ఫేమ్ టీజీ జ్ఞానవేల్ రూపొందించిన చిత్రం ‘వేట్టయన్’. తాజాగా జరిగిన ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌లో రజనీకాంత్ మాట్లాడారు. ఈ క్రమంలో రానా గురించి ఓ రేంజ్‌లో హైప్ ఇచ్చారు. అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. రామానాయుడి మనవడిగా రానా చిన్నప్పటి నుంచి తనకు తెలుసని రజనీ అన్నారు. అప్పట్లోనే రానా షూటింగ్‌కి వచ్చేవాడని, ఫుల్ జాలీగా ఉండేవాడని తెలిపారు. కానీ ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ సీరియస్ లుక్స్‌లో కనిపిస్తున్నట్లు చెప్పారు. రానా సీరియస్ లుక్ చూసి తాను నిజంగా భయపడేవాడినని రజనీ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ రానాని పొగడటం నిజంగా గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కథ మార్చేసిన రజనీ
వేట్టయన్ కథకు సంబంధించి ఇటీవల రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టి.జె. జ్ఞానవేల్ మొదట తీసుకువచ్చిన కథకు తాను మార్పులు సూచించినట్లు చెప్పారు. ‘వేట్టయన్ కథ వినమని సౌందర్య నాకు చెప్పడంతో విన్నాను. బాగుందనిపించింది. అయితే కథలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలని కోరాను. కథ మార్చేందుకు జ్ఞానవేల్ ఒప్పుకున్నారు. కానీ నెల్సన్ దిలీప్‌కుమార్, లోకేష్ కనగరాజ్‌ల సినిమాగా మార్చలేనని చెప్పారు. నాకూ అదే కావాలని చెప్పా. లేదంటే లోకేష్, దిలీప్‌ల దగ్గరకే వెళ్లేవాడిని కదా అని అన్నా. 10 రోజుల తర్వాత కథలో మార్పులు చేసి తీసుకొచ్చాడు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను’ అని రజనీ తెలిపారు. అదే సమయంలో సినిమాకు అనిరుధ్ మాత్రమే సంగీత దర్శకుడిగా ఉండాలని జ్ఞానవేల్‌ను పట్టుపట్టినట్లు రజనీ చెప్పారు.
రజనీపై తమిళ డైరెక్టర్ ఆరోపణలు
సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘లింగ’ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తాజాగా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పరాజయం గురించి దర్శకుడు మాట్లాడారు. ‘లింగ ఎడిటింగ్ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ జోక్యం చేసుకున్నారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్‌గా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు’ అని రవి కుమార్ కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రజనీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
రజనీకాంత్ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ వార్త బయటకొచ్చింది. స్టార్ డైరెక్టర్ మణిరత్నంలో ఆయన నటించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. 33 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబోలో 1991లో ‘దళపతి’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇద్దకూ కలిసి సినిమా చేయలేదు. తాజా ప్రాజెక్ట్ కోసం రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చని కోలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘కూలీ’ అనే చిత్రంలో రజనీ నటిస్తున్నారు. దీని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ చేయనున్నారు రజనీ.