నటీనటులు : హిమ దాసరి, పూజా రెడ్డి బోరా, ఒస్మాన్ ఘని తదితరులు
దర్శకత్వం : రుత్విక్ యాలగిరి
సంగీతం : సాయి తేజ
సినిమాటోగ్రాఫర్ : సి. హెచ్. సాయి
ఎడిటింగ్: జై సి. శ్రీకర్
ఆర్ట్ డైరెక్టర్ : అరవింద్ ములే
నిర్మాత : మానస దాసరి
ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
ఈ మధ్యకాలంలో ఓటీటీలో ఎన్నో విభిన్నమైన కథలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈటీవీ విన్ వారానికి ఒక వైవిధ్యమైన సినిమాను తీసుకొస్తూ ప్రేక్షలను అలరిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం ‘తత్వ‘ (Tatva Review In Telugu) అనే సస్పెన్స్ థ్రిల్లర్‌ను నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. ఇందులో హిమ దాసరి, పూజా రెడ్డి బోరా జంటగా నటించారు. రుత్విక్ యాలగిరి దర్శకత్వం వహించారు. కేవలం గంట నిడివితో వచ్చిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
ఆరిఫ్ (హిమ దాసరి) ఒక సాధారణ ట్యాక్సీ డ్రైవర్. అనుకోకుండా అతడికి డబ్బు అవసరం పడుతుంది. ఈ క్రమంలో బిజినెస్ మ్యాన్ థామస్ (ఒస్మాని ఘని) ఆరిఫ్ ట్యాక్సీ ఎక్కుతాడు. తనకు కావాల్సిన డబ్బు థామస్ దగ్గర ఉందని గ్రహించిన ఆరిఫ్ అతడి నుంచి ఎలాగైన డబ్బు తీసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే అనుకోని విధంగా థామస్ హత్య జరుగుతుంది. ఇందులో ఆరిఫ్ ఇరుక్కుంటాడు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు పోలీసు ఆఫీసర్ జ్యోత్స్న (పూజా రెడ్డి బోరా) రంగంలోకి దిగుతుంది. అసలు థామస్‌ను హత్య చేసింది ఎవరు? ఆరిఫ్ ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడు? థామస్ – ఆరీఫ్ మధ్య రిలేషన్ ఏంటి? ఆరీఫ్ నిర్దోషిగా బయటపడ్డాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
సినిమాకి మెయిన్ హీరో హిమ దాసరి అయినప్పటికీ నటుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్న వ్యక్తి మాత్రం ఒస్మాన్ ఘని. థామస్ పాత్రకు అతడు ప్రాణం పోశాడు. ఓ వైపు నవ్విస్తూనే తన నటనతో ఆలోచింపజేశారు. ఇక ఆరీఫ్ పాత్రలో హిమ దాసరి కూడా అలరించాడు. కష్టాల్లో ఉన్న యువకుడిగా అతడి నటన సహజంగా అనిపిస్తుంది. నటి పూజా రెడ్డికి ఇందులో మంచి పాత్రే దక్కింది. ప్రారంభంలో ఆమె రోల్ సాదా సీదాగా అనిపించిన క్లైమాక్స్ వచ్చే సరికి ఆశ్చర్యపరుస్తుంది. కథను మలుపు తిప్పడంలో ఆమె పాత్రనే కీలకం. కథ మెుత్తం ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టే తిరిగింది. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘రన్ రాజా రన్’, ‘సాహో’ చిత్రాలకు సుజీత్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన రుత్విక్ తనదైన శైలిలో థ్రిల్లింగ్‌గా ఈ సినిమాను రూపొందించారు. మనిషిలో మానవత్వం అంతరిచిపోతున్నదనే విషయాన్ని వివరించిన విధానం బాగుంది. ముఖ్యంగా మెుదటి 20 నిమిషాలు చాలా ఆసక్తికరంగా చూపించారు. తన చెప్పాలనుకున్న పాయింట్స్‌ను ఎలాంటి తికమక లేకుండా నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు. సినిమాను అనవసరంగా సాగదీయకుండా 58 నిమిషాల్లోనే ముగించడం బాగా ప్లస్ అయ్యింది. అయితే కొన్ని సీన్స్ లాజిక్‌కు దూరంగా, అసంపూర్ణంగా ఉండటం మైనస్‌గా మారింది. ఈ విషయంలో దర్శకుడు జాగ్రత్త పడి ఉండే రిజల్ట్ ఇంకా బెటర్‌గా ఉండేది. సాంగ్స్, ఫైట్స్, రొమాన్స్, లవ్‌ట్రాక్ వంటి కమర్షియల్ హంగులు కోరుకునేవారికి మాత్రం ఈ సినిమా అంతగా ఎక్కకపోవచ్చు. ఓవరాల్‌గా దర్శకుడు రుత్విక్ పనితనం మెప్పిస్తుంది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ మంచి పనితీరు కనబరిచారు. సినిమా మెుత్తం అర్ధరాత్రి సాగడంతో లో-లైట్‌లోనూ మంచి విజువల్స్ అందించారు. నేపథ్య సంగీతం కూడా సినిమాకు అదనపు బలంగా మారింది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. టెక్నికల్‌గా చూసుకుంటే ‘తత్వ’కి మంచి మార్కులే పడ్డాయి.
ప్లస్ పాయింట్స్
- ఆరిఫ్, థామస్ పాత్రలు
- కెమెరా వర్క్
- నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
- కమర్షియల్ హంగులు లేకపోవడం
- అసంపూర్ణమైన క్లైమాక్స్