నటీనటులు: ప్రృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, జిమ్మీ జీన్ లూయీస్, లీనా, సంతోష్ కీఝాత్తూర్, అకేఫ్ నజీం, శోభా మోహన్ తదితరులు
దర్శకుడు : బ్లెస్సీ
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
సినిమాటోగ్రఫీ : సునీల్ కే.ఎస్
నిర్మాతలు: బ్లెస్సీ, జిమ్మీ జీన్ లూయీస్, స్టీవెన్ ఆడమ్స్, కే.జీ అబ్రహం
విడుదల తేదీ : 28-03-2024
‘సలార్’తో (Salaar) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). అంతకుముందు అతడు చేసిన మలయాళ చిత్రాలు తెలుగులో డబ్ అయినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. సలార్‌లో ప్రభాస్ ఫ్రెండ్‌గా నటించి తాజాగా మంచి పేరు గుర్తింపు సంపాదించాడు. తాజాగా అతడు నటించిన ‘ది గోట్ లైఫ్ : ఆడు జీవితం’ (The Goat Life : Aadujeevitham) మలయాళంతో పాటు తెలుగులోనూ ఇవాళ రిలీజైంది. బెన్యామిన్ రచించిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది (The Goat Life Review In Telugu)? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
ది గోట్ లైఫ్ చిత్ర కథ విషయానికి వస్తే.. కుటుంబ అవసరాల కోసం నజీబ్ అహ్మద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) వలస కూలీగా సౌదీ అరేబియా వెళతాడు. అనుకోకుండా నజీబ్ సౌదీ అరేబియాలో తప్పిపోతాడు. గల్ఫ్‌లో పని చేసి డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న నజీబ్ కల చెదిరిపోతుంది. ఏడారిలో బానిసగా మారి గొర్రెల కాపరిగా దుర్భరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి? బానిస సంకెళ్ళ నుండి నజీబ్ ఎలా బయటపడ్డాడు? తిరిగి ఇండియాకు వచ్చి తన కుటుంబ సభ్యులను నజీబ్ కలుసుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ.
ఎవరెలా చేశారంటే?
‘ది గోట్ లైఫ్’ చిత్రాన్ని పృథ్విరాజ్ సుకుమారన్ అన్నీ తానై నడిపించాడు. ఆయన నటన, షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అబ్బురపరుస్తాయి. నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్‌ను తప్ప మరో నటుడ్ని ఊహించుకోలేము. అంతగా ఆ పాత్రలో లీనమై నటించాడు పృథ్వీ. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన జీవించేశాడు. కెరీర్ బెస్ట్ నటనతో అదరగొట్టాడు. నటి అమలా పాల్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించింది. ఆమె తన పరిధి మేరకు నటించి మెప్పించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాకు మనసులను హత్తుకునే కథను ఎంచుకున్నాడు. బానిసల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో కళ్లకు కట్టాడు. ఫస్టాఫ్‌లో పృథ్వీ సౌదీకి రావడం.. అతడి పాస్‌పోర్టును లాక్కొని బానిసగా మార్చడం వంటివి చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్ హృదయాలను బరువెక్కిస్తుంది. సౌదీలో ఎలాంటి దారుణాలు జరుగుతాయో కూడా దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు. సెకండాఫ్‌లో ఆ బానిస సంకెళ్ల నుంచి హీరో తప్పించుకోవడం, కనుచూపు మేర కనిపించే ఏడారిలో అతడు పడే కష్టాలను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఇసుక తుఫాను సీక్వెన్స్‌ను చాలా బాగా తెరకెక్కించాడు డైరెక్టర్. అయితే సినిమాలో సింహాభాగం అంతా పృథ్వీరాజ్ పడే కష్టాలే చూపించడం ఆడియన్స్‌కు బోర్ కొట్టిస్తుంది. పైగా సినిమా స్లో నేరషన్‌తో మరి నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. సుదీర్ఘమైన సినిమాను చూసినట్లు ఆడియన్స్ ఫీలవుతారు. కమర్షియల్ చిత్రాలను ఇష్టపడే వారికి ‘ది గోట్ లైఫ్’ అంతగా రుచించకపోవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే (The Goat Life Review In Telugu).. ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. అటు సినిమాట్రోగ్రాఫర్ కూడా చక్కటి ప్రతిభను కనబరిచాడు. సౌదీలోని ఎడారి పరిస్థితులను ఆ తన కెమెరా కళ్లతో అద్భుతంగా చూపించాడు. ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ అందించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- ప్రృథ్వీరాజ్ సుకుమారన్ నటన
- భావోద్వేగ సన్నివేశాలు
- సంగీతం
మైనస్ పాయింట్స్
- స్లో నారేషన్
- కమర్షియల్ హంగులు లేకపోవడం