నటీనటులు : టామ్ హార్డీ, ఆండీ సెర్కిస్, చివెటెల్ ఎజియోఫోర్, జునో టెంపుల్, పెగ్గీ, రీస్ ఇఫాన్స్, క్రిస్టో ఫెర్నాండెజ్, స్టీఫెన్ గ్రాహమ్ తదితరులు
దర్శకత్వం : కెల్లి మార్సెల్
సినిమాటోగ్రఫీ : ఫబియన్ వాగ్నర్
ఎడిటింగ్ : మార్క్ సంగర్
సంగీతం : డ్యాన్ డీకాన్
నిర్మాతలు : అవి అరద్, మ్యాట్ టాల్‌మచ్, కెల్లీ మార్సెల్, టాప్ హార్డీ
విడుదల తేదీ : అక్టోబర్ 25, 2024
హాలీవుడ్ చిత్రాల్లో ‘వెనమ్’ సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సూపర్ హీరో చిత్రాలను బాగా ఇష్టపడే వారిని ‘వెనమ్’ సిరీస్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు సినిమాలు రాగా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. తాజాగా వాటికి కొనసాగింపుగా ‘వెనమ్ 3’ థియేటర్లలోకి వచ్చింది. ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ (Venom: The Last Dance) పేరుతో అక్టోబర్ 25న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఎప్పటిలాగే ఈ చిత్రంలోనూ టామ్ హార్డీ కథానాయకుడిగా చేశాడు. కెల్లీ మార్సెల్ దర్శకుడు. మరి పార్ట్ 3 కూడా ప్రేక్షకులను మెప్పించిందా? అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో విజువల్ వండర్‌గా నిలిచిందా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
‘వెనమ్: లెట్ దేర్ బి కార్నేజ్’ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచే మూడో పార్ట్ మెుదలవుతుంది. వెనమ్‌తో విడిపోయిన తర్వాత ఎడ్డీ బ్రాక్ (టామ్ హార్డీ) మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అవుతాడు. మరోవైపు వెనమ్‌ని కూడా తన గ్రహానికి చెందిన వాసులు వెంటాడుతూ ఉంటాయి. ఇంతలో వీరిద్దరికీ ఒక కొత్త ప్రమాదం ఎదురవుతుంది. వేరే లోకంలో బంధించి ఉన్న నల్ (ఆండీ సెర్కిస్) అనే సూపర్ విలన్ విడుదలకు అవసరమైన ఒక ఎలిమెంట్ వీరి దగ్గర మాత్రమే ఉంటుంది. దీంతో నల్ సైన్యం కూడా వీరి వెంట పడుతుంది. నల్ సైన్యం నుంచి తప్పించుకోవాలంటే ఎడ్డీ, వెనమ్‌ల్లో ఒకరు మరణించాలి. లేదంటే జీవితాంతం పరిగెడుతూనే ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎడ్డీ, వెనమ్ ఏం చేశారు? నల్‌ను వారు ఎలా ఎదుర్కొన్నారు? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
వెనమ్ 3 మూవీలో టామ్ హార్డీ వన్ మ్యాన్ షో చేశాడు. ఎడ్డీ బ్రాక్ పాత్రలో మరోమారు చక్కగా ఒదిగిపోయాడు. లేని వెనమ్‌ని ఊహించుకుని దాంతో కెమిస్ట్రీని పండించడం మామూలు విషయం కాదు. గత చిత్రాలలో లాగానే ఇందులోనూ తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ దుమ్మురేపాడు. ఎంతో సాహసోపేతంగా ఫైట్స్ చేసి ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. నల్ పాత్రలో ఆండీ సెర్కిస్ కూడా ఆకట్టుకున్నాడు. చివెటెల్ ఎజియోఫోర్, జునో టెంపుల్, పెగ్గీ, రీస్ ఇఫాన్స్, క్రిస్టో ఫెర్నాండెజ్, స్టీఫెన్ గ్రాహమ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కెల్లి మార్సెల్ తొలి రెండు భాగాలు తరహాలోనే ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ చిత్రాన్ని కూడా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందించారు. ప్రారంభంలో ఫ్లైట్ యాక్షన్ సీన్‌తో సినిమాను మెుదలపెట్టిన దర్శకుడు ఆ జోరు చివరకూ కొనసాగించాడు. మూడు సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. 20 నిమిషాల పాటు సాగే ఈ సీక్వెన్స్‌ను ప్రేక్షకులు కళ్లార్పకుండా చూస్తారు. ఒక పెద్ద శత్రువు కోసం వెనమ్, ఇతర సింబియోట్లు, మిలటరీ అందరూ కలిసి చేసే పోరాటం అలరిస్తుంది. అయితే వెనమ్ సిరీస్‌లో ఈ మూవీనే లాస్ట్ అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఎడ్డీ, వెనమ్ బాండింగ్‌ను హైలెట్ చేస్తూ ఎమోషనల్ ఫినిషింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ప్రీ క్లైమ్యాక్స్‌కు ముందు వచ్చే ఒక్క సీన్ మాత్రం ఎమోషనల్‌గా ఆకట్టుకుంది. ఓవరాల్‌గా యాక్షన్ ప్రియులను ఈ సినిమా తప్పక అలరిస్తుంది.
టెక్నికల్‌గా
సాంకేతిక విషయాలకు వస్తే వీఎఫ్‌ఎక్స్ టీమ్ అద్భుత పనితీరు కనబరిచిది. విజువల్ వండర్‌లా సినిమాను తీర్చిదిద్దింది. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- టామ్ హార్డీ నటన
- యాక్షన్ సీక్వెన్స్
- వీఎఫ్‌ఎక్స్ వర్క్
మైనస్ పాయింట్స్
- కొరవడిన ఎడ్డీ, వెనమ్ బాండింగ్
- కథలో డ్రామా లేకపోవడం
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం