లవ్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. అందుకే ఈ జానర్లో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే, చాలా సినిమా కథల్లో ప్రేమకు శుభం కార్డు పడుతుంది. కానీ, కొన్ని కథలు విషాదాంతం అవుతాయి. ప్రేమికుడు చనిపోవడమో, ప్రేయసి చనిపోవడమో లేదా ప్రేమను త్యాగం చేయడమో వంటివి జరుగుతుంటాయి. వాస్తవానికి కాస్త దగ్గరగా ఉండే సినిమా ప్రేమ కథలు తెలుగులో చాలా తక్కువగానే వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘బేబీ’ మూవీ సైతం విషాదాంతం అవుతుంది. మరి, గుండెల్ని పిండేసిన ప్రేమ కథా చిత్రాలేంటో తెలుసుకుందామా.
7/G బృందావన కాలనీ
లవ్ స్టోరీ అంటే ప్రధానంగా గుర్తుకొచ్చేది ఈ సినిమానే. ఎన్ని ప్రేమ కథా చిత్రాలు వచ్చినా ఈ మూవీకి ఉండే ప్రాధాన్యత వేరు. ఒక అమ్మాయిని అబ్బాయి ఇంత గాఢంగా ప్రేమించగలడా? అనే ఆశ్చర్యం కలగక మానదు. 2004లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల మన్ననను పొందుతోంది.
ప్రేయసి రావే
ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ప్రేమ కోసం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చంటారు. మరి, ప్రేమనే త్యాగం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించారు. శ్రీకాంత్, రాశి జంటగా నటించిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. నాడు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.
మహర్షి
ఈ సినిమా గురించి నేటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. 1987లో వచ్చిందీ సినిమా. ఇది కూడా ఓ అమర ప్రేమికుడి కథే. ప్రేమించిన అమ్మాయికి వేరొక అబ్బాయితో పెళ్లయితే ఉండే బాధ వేరు. అనుక్షణం తననే తలుచుకుంటూ, తనను ఒక్కసారైనా చూడాలనే తపన కంటతడి పెట్టిస్తుంది. ప్రియురాలి మెప్పు పొందేందుకు చివరికి తన ప్రాణాలనే అర్పించే త్యాగధనుడు ప్రేమికుడు. నేటి యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది.
అభినందన
లవ్ ఫెయిల్యూర్ సినిమాల్లో ముందు వరుసలో ఉంటుందీ ‘అభినందన’. ప్రతి భగ్న ప్రేమికుడు ఇందులోని పాటలు పాడుకుంటాడు. ప్రతి విరహ ప్రేమికుడు తనను తాను హీరో పాత్రలో ఊహించుకుంటాడు. ఇప్పటికీ ఈ సినిమాల్లోని పాటలను ఎంతోమంది వింటారు. 1987లో సినిమా విడుదలైంది. ‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు ఎంత కఠినం’ అనే పాట ఈ సినిమాలోనిదే.
ఓయ్
మనసు ఇచ్చిన అమ్మాయి దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ఊహకు తెలియని ఒంటరితనం దరిచేరుతుంది. అలాంటి ఓ సినిమానే ఇది. మంచి ఫీల్‌ని ఇస్తుంది. ప్రేమించిన అమ్మాయి గురించి ఓ యువకుడు పడే తపన ఇందులో కనిపిస్తుంది. తనకే ఇలా ఎందుకు అవ్వాలన్న జాలి కలుగుతుంది. 2009లో ఈ మూవీ రిలీజ్ అయింది.
సుస్వాగతం
జీవితంపై దృష్టి పెట్టాల్సిన వయసులో ప్రేమ పేరుతో జగాన్ని మర్చిపోతే మిగిలేది శూన్యం. ఈ విషయాన్ని సుస్వాగతం మూవీ ప్రస్ఫుటిస్తుంది. ఇల్లు, కుటుంబం, భవిష్యత్‌ని లెక్క చేయకుండా ఓ అమ్మాయి వెంట తిరగడం సరికాదనే సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో ప్రేమ ఒక భాగమే. కానీ, ప్రేమే జీవితం కాదనే విషయం సినిమా చూశాక బోధపడుతుంది. నేటి తరం యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది.
ప్రేమిస్తే
ప్రేమించడం ఈజీ. కానీ, ఎదుటి వ్యక్తి ప్రేమను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ సినిమా గుర్తుండిపోవడానికి కూడా ఇదే కారణం. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను కన్నవారే నమ్మించి మోసం చేస్తే పిచ్చోడైపోయే అబ్బాయి కథ ఇది. ప్రేమికుడి దుస్థితికి తనే కారణమని విలపించే ప్రియురాలి స్వచ్ఛమైన ప్రేమకు చప్పట్లు కొట్టాల్సిందే. ఈ కథ కల్పించింది కాదు. నిజంగా జరిగింది. ఎన్నో భాషల్లో రీమేక్ అయింది.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?