మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజై ఆశించిన స్థాయిలో హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించినప్పటికీ అప్పట్లో ఈ మూవీపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఇదిలా ఉంటే ఈ చిత్ర నిర్మాత నాగవంశీ ‘గుంటూరు కారం’పై తాజాగా మాట్లాడారు. ఈ చిత్రాన్ని మాస్ సినిమాగా ప్రమోట్ చేసి తప్పు చేశామని క్లాస్ మూవీగా ప్రమోట్ చేసి ఉంటే మంచి రిజల్ట్ వచ్చేదని అభిప్రాయ పడ్డారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో ‘గుంటూరు కారం’ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘అతడు’, ‘ఖలేజా’ తరహాలోనే ఈ మూవీకి అన్యాయం జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
నాగవంశీ ఏమన్నారంటే?
త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం చిత్రంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన ఆయనకు ‘గుంటూరు కారం’ మూవీకి సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ మూవీ కమర్షియల్‌గా లాభాలు తెచ్చిపెట్టిందా అంటూ ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. దీనిపై నాగవంశీ మాట్లాడుతూ ‘గుంటూరు కారం కమర్షియల్‌గా సూపర్ హిట్. ఒక్క నైజాంలో డ్యామేజ్ జరిగింది తప్పితే అందరూ సేఫే కదా. అది సంక్రాంతి మూలానా జనం సొంతూర్లకు వెళ్తారు కాబట్టి ఎక్కువ వసూళ్లు రాలేదు. మేము అనుకున్నట్లు సినిమాను మీరు అనుకోలేదు. అందులో మా తప్పు కూడా ఉండొచ్చు. గుంటూరు కారం టైటిల్ పెట్టడం తప్పు అయ్యుండొచ్చు. ఫ్యామిలీ సినిమాకు మాస్ టైటిల్ పెట్టడం రాంగ్ ఏమో. ఇంకోటి ఫ్యామిలీ సినిమాకు ఒంటి గంట షో వేయడం ఇంకో తప్పేమో’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కల్ట్ క్లాసిక్‌ను ఫ్లాప్ చేశారని ఫైర్!
గుంటూరు కారం చిత్రాన్ని రీసెంట్గా ఓటీటీ, టీవీలో చూసినవారంతా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ను థియేటర్లో తప్ప మళ్లీ చూడలేదని, కానీ గుంటూరు కారంను థియేటర్‌తో పాటు ఓటీటీ, టెలివిజన్ ప్రీమియర్‌లోనూ రెండుసార్లు చూశానని చెప్పుకొచ్చారు. ఇది తెలుగు ఇండస్ట్రీ ఫెయిల్యూర్ అని పోస్టు పెట్టాడు. మహేష్ వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్నాడని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ఇలా గుంటూరు కారం మూవీని ఆకాశానికెత్తుతూ #GunturKaaram హ్యాష్‌ట్యాగ్‌ను ఒక్కసారిగా ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ మూవీలోని హైలెట్ సీన్స్‌ను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
‘కుర్చి మడతపెట్టి’ మరో రికార్డు!
గుంటూరు కారం చిత్రంలోని ‘కుర్చి మడత పెట్టి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సాంగ్ మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా మహేష్, శ్రీలీల స్టెప్పులు ఫ్యాన్స్‌ను ఎంతగానో అలరించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఈ సాంగ్ మారుమోగేది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్‌లో మరో రికార్డు సొంతం చేసుకుంది. 450 మిలియన్ల వ్యూస్ మార్క్‌ను అందుకొని సత్తా చాటింది. దీంతో #KurchiMadathapetti హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ సంబంధించిన వీడియోలను నెటిజన్లు పోస్టు చేస్తున్నారు.
మహేష్-త్రివిక్రమ్ మూవీలే ఎందుకు?
మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటివరకూ మూడు చిత్రాలు రూపొందాయి. గతంలో వచ్చిన ‘అతడు’ (Athadu), ‘ఖలేజా’ (Khaleja) చిత్రాలు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. కమర్షియల్గానూ పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే బుల్లితెర ఆడియన్స్‌ను మాత్రం ఈ రెండు చిత్రాలు విశేషంగా ఆకర్షించాయి. అత్యధిక టీఆర్పీ సాధించి టెలివిజన్ ప్రీమియర్స్‌లో రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ సినిమాను ఎలా ఫ్లాప్ చేశారన్న ఫీలింగ్‌ను అందరిలోనూ కలిగించాయి. ఇప్పుడు ‘గుంటూరు కారం’ విషయంలోనూ సరిగ్గా ఇదే జరుగుతోందని నెటిజన్లు అంటున్నారు. థియేటర్లలో పెద్దగా పట్టించుకోని ఆడియన్స్ ఓటీటీ, టెలివిజన్‌లో చూసి ప్రశంసలు కురిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మహేష్-త్రివిక్రమ్ చిత్రాలకే ఇలా ఎందుకు జరుగుతోందంటూ ఫిల్మ్ వర్గాలు సైతం నివ్వేరపోతున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!