• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rewind 2024: టాలీవుడ్ సెలెబ్రిటీలకి తలనొప్పిగా మారిన కేసులు… జైలుకు వెళ్లిన నటులు వీళ్లే

    2024 సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ సంవత్సరంలో తెలుగు సినీ పరిశ్రమ ఎన్నో ప్రత్యేక సంఘటనలకు వేదికైంది. ఈ ఏడాది కొందరు  ప్రముఖ సెలెబ్రిటీల జీవితాల్లో పెను మార్పులను తీసుకొచ్చింది. పేరుతో పాటు వివాదాలు కూడా వారిని వదలలేదు. కొందరు సెలెబ్రిటీలు క్రిమినల్ కేసుల్లో చిక్కుకుని కోర్టు మెట్లెక్కడం, జైలు జీవితం గడపడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది.

    వీరిలో ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహర నుంచి టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరకు పలువురు సెలెబ్రిటీలు కేసుల్లో చిక్కుకున్నారు. వారు ఎదుర్కొన్న ఆరోపణలు, దానికి సంబంధించిన పరిణామాలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకిత్తించాయి.

    ఈ ఆర్టికల్‌లో 2024లో వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖ తెలుగు సెలెబ్రిటీల వివరాలు, వారి మీద నమోదైన కేసుల కారణాలు, ఈ కేసులు ఎలా సాగాయి అనే అంశాలను తెలుసుకుందాం.

    ప్రసాద్ బెహర

    తెలుగు వెబ్ సిరీస్‌ల ద్వారా ఫేమస్ అయిన ప్రసాద్ బెహర, లైంగిక వేధింపుల కేసులో బుధవారం(డిసెంబర్ 18) అరెస్టయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. షూటింగ్ సమయంలో తన ప్రైవేట్ భాగాలను తాకారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు 75(2), 79, 351(2)BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు.  ప్రసాద్ బెహరకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. “పెళ్లివారమండి”, “మావిడాకులు”, “మెకానిక్”, “దిల్ పసంద్” వంటి వెబ్ సిరీస్‌లతో పాటు, రీసెంట్‌గా వచ్చిన “కమిటీ కుర్రాళ్లు” సినిమాలోనూ నటించారు.

    అల్లు అర్జున్

    ‘పుష్ప 2’ (Pushpa 2) సక్సెస్‌ను ఎంజాయ్‌ చేయకుండా ఈ ఏడాది అల్లు అర్జున్‌కు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. పుష్ప 2 ప్రీమియర్స్‌ సందర్భంగా హైదరాబాద్‌ సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందటంతో బన్నీపై కేసు నమోదైంది. దీంతో ఆయన్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే హైకోర్టులో మధ్యంతర బెయిల్ లభించడంతో అల్లు అర్జున్‌కు ఉపశమనం లభించింది. బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోరుతూ సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

    రాజ్ తరుణ్

    టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌పై లావణ్య అనే యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఈ కేసు ప్రాధాన్యత సాధించింది. లావణ్య తనను పదకొండు సంవత్సరాల పాటు ప్రేమలో ఉంచి, చివరికి వదిలేసి వేరే నటితో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. దీంతో రాజ్ తరుణ్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది.

    జానీ మాస్టర్

    ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఈ సంవత్సరం లైంగిక దాడి ఆరోపణలు ఎదురయ్యాయి. తన దగ్గర పని చేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. జైలు జీవితం గడిపిన జానీ మాస్టర్, ఇటీవలే విడుదల అయ్యారు. ఈ కేసు టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

    Jani master
    Jani master

    షణ్ముక్ జస్వంత్‌

    యూట్యూబ్ సిరీస్‌లతో ఫేమస్ అయిన షణ్ముక్ జస్వంత్‌ కూడా వివాదాల్లో చిక్కుకున్నాడు. తన అన్న సంపత్ వినయ్‌తో కలిసి గంజాయి సేవించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. షణ్ముఖ్ ఇంటి నుంచి 18 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధినం చేసుకున్నారు.

    హర్ష సాయి

    మూడు నెలల క్రితం సెప్టెంబర్‌లో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఇతడిపై అత్యాచారం కేసు నమోదైంది. యువతి ఫిర్యాదుతో  పోలీసులు.. హర్షసాయిపై 328, 376 (2) 354 , 376ఎన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

    రామ్ గోపాల్ వర్మ

    వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సంవత్సరం రాజకీయాలకు సంబంధించిన కేసుల్లో చిక్కుకున్నారు. టీడీపీ నాయకులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు, వివాదాస్పద సినిమాలు తీసినందుకు పలువురు ఫిర్యాదు చేశారు. పోలీసులు వర్మను విచారణకు పిలిపించారు.

    మంచు కుటుంబం

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు ఉన్న మంచు కుటుంబం మధ్య ఈ ఏడాది గొడవలు చోటుచేసుకున్నాయి. మోహన్ బాబు, మనోజ్ మధ్య తలెత్తిన విభేదాలు పోలీస్ కేసుల వరకు వెళ్లాయి. మోహన్ బాబుపై మనోజ్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వార్తల్లో నిలిచింది.

    Manchu Manoj
    Manchu Manoj

    పుష్ప యాక్టర్ జగదీశ్

    “పుష్ప” సినిమాలో కేశవ పాత్రతో గుర్తింపు పొందిన జగదీశ్, ఓ జూనియర్ ఆర్టిస్టుపై బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ జూనియర్ ఆర్టిస్టు ఆత్మహత్య చేసుకోవడం ఈ కేసును మరింత సీరియస్‌గా మార్చింది. పోలీసులు జగదీశ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు.

    ఈ సంఘటనలన్నీ 2024ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకమైన, విస్మరించలేని సంవత్సరంగా మార్చేశాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv