‘పుష్ప 2‘ (Pushpa 2) ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్‌లో తీవ్ర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి థియేటర్ యజమానులతో సహా అల్లు అర్జున్‌ను సైతం పోలీసులు అరెస్టు (sandhya theatre stampede case) చేశారు. ఆ మర్నాడు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌పై విడుదల కూడా అయ్యారు. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం ఓ వీడియో రిలీజ్ చేసిన బన్నీ.. శ్రీతేజ్ వైద్య ఖర్చులు తాము భరిస్తారమని భరోసా కల్పించారు. ఈ క్రమంలో తాజాగా శ్రీతేజ్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బన్నీపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి.
సీపీ ఏమన్నారంటే
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ (9) ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగినప్పటి నుంచి అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వైద్యులు అతడికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం (డిసెంబర్ 17) హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, హెల్త్ సెక్రటరీ డా. క్రిస్టీనాతో ఆస్పత్రిని సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ బ్రెయిన్‌కు డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక ఐపాక్సియా అనే బ్రెయిన్ డ్యామేజ్ స్జేజ్‌కి వెళ్లారు. రికవరీ కావడానికి టైమ్ పడుతుందని డాక్టర్లు చెప్పారు. వెంటిలేటర్ సపోర్ట్‌తో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఈ చికిత్స సుదీర్ఘంగా సాగే అవకాశముంది’ అని చెప్పారు. అల్లు అర్జున్ టీమ్ చికిత్స ఖర్చు భరిస్తుందా? అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా ‘ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తోంది’ అంటూ సీపీ సమాధానం ఇచ్చారు.
బన్నీపై నెటిజన్ల విమర్శలు..
వైద్య ఖర్చులు తామే భరిస్తామని బన్నీ ప్రకటించి కూడా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఘటనకు కారణమైనందున శ్రీతేజ్ వైద్య ఖర్చులు పెట్టుకోవాల్సిన బాధ్యత బన్నీకి ఉందని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం వైద్య ఖర్చులు ఎందుకు భరించాలని నిలదీస్తున్నారు. ఆ డబ్బు ప్రజలదని, తప్పు మీరు చేసి ఆ భారం తమపై మోపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు కాంగ్రెస్ వర్గాలు సైతం బన్నీ వీడియోను, సీపీ కామెంట్స్‌ను పక్క పక్కన పెట్టి వీడియోలను ట్రెండింగ్ చేస్తున్నాయి. అయితే అల్లు అర్జున్‌ను కావాలని బదనామ్ చేస్తున్నారని బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వైద్య ఖర్చులు భరిస్తానని బన్నీ చెప్పాడని ఆస్పత్రి బిల్స్ చూపిస్తే గాని తాము నమ్మమని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
బాధితుల వెర్షన్ ఏంటంటే
సీపీ ఆనంద్ చేసిన కామెంట్స్‌ను ఖండిస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరో వీడియోను వైరల్ చేస్తున్నారు. మృతురాలు రేవతి భర్త, శ్రేతేజ్ తండ్రి భాస్కర్ ఓ మీడియాకు ఇచ్చిన బైట్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. అందులో మూవీ టీమ్ తమను సంప్రదించినట్లు భాస్కర్ స్పష్టం చేశారు. ‘మైత్రీ మూవీ ప్రొడ్యూసర్స్ రవి సార్, బన్నీ వాసు సార్ వచ్చారు. ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడారు. ఏ సమస్య ఉన్నా తాము కేర్ తీసుకుంటామని హాస్పిటల్ ఇన్‌ఛార్జ్‌తో చెప్పారు. బాబు గురించి ఆందోళన వద్దని, తాము చూసుకుంటామని నాకు భరోసా ఇచ్చారు. మా తరపున బాబుకి సపోర్ట్ ఉంటుందని, శ్రీతేజ్ కోలుకోవాలని ప్రార్థించమని అన్నారు’ అని భాస్కర్ స్పష్టం చేశారు. అయితే ఈ బైట్ తొక్కిసలాట జరిగిన ఒక రోజు గ్యాప్‌తో (డిసెంబర్ 6) రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే బన్నీ టీమ్ రంగంలోకి దిగిందని ఫ్యాన్స్ అంటున్నారు.
Celebrities Featured Articles Movie News
Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్