Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్‌ పెట్టకుంటే ముప్పు తప్పదా! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్‌ పెట్టకుంటే ముప్పు తప్పదా! 

    Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్‌ పెట్టకుంటే ముప్పు తప్పదా! 

    October 17, 2024

    ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ అనగానే బాలీవుడ్‌ మాత్రమే గుర్తుకువచ్చేది. హిందీ స్టార్లను మాత్రమే పాన్‌ ఇండియా సెలబ్రిటీలుగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సౌత్‌ ఇండస్ట్రీ కూడా ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతూ జాతీయ స్థాయిలో అలరిస్తోంది. ముఖ్యంగా సౌత్‌ నుంచి టాలీవుడ్‌ (Tollywood), కోలివుడ్‌ (Kollywood) ఇండస్ట్రీల నుంచి మంచి కంటెంట్‌ ఉన్న పాన్‌ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అవి బాలీవుడ్ ఆదిపత్యానికి చెక్‌ పెడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏకత్రాటిపై ఉండాల్సిన సౌత్‌ ఇండస్ట్రీస్‌ అభిమానులు చేస్తోన్న ఫ్యాన్‌ వార్స్‌ కారణంగా బలహీన పడుతోంది. దీనిని కట్టడి చేయకపోతే మున్ముందు రోజుల్లో సౌత్‌ ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

    టాలీవుడ్‌ vs కోలీవుడ్‌

    గతంలో ఫ్యాన్‌ వార్‌ అంటే ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై ఉండేది. హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు పోస్టుల రూపంలో విమర్శలు చేసుకునేవారు. ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రాల హవా కారణంగా ఇది పక్క ఇండస్ట్రీలపైకి కూడా పాకింది. తమ హీరో తీసిన సినిమా కంటే పక్క ఇండస్ట్రీ స్టార్‌ చేసిన చిత్రం ఎక్కువ కలెక్షన్స్‌ సాధించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ పోకడ సౌత్‌లో టాలీవుడ్‌, కోలివుడ్‌ ఇండస్ట్రీలో ప్రధానంగా కనిపిస్తోంది. తమిళ హీరో విజయ్‌ చేసిన చిత్రాలు రిలీజ్‌ అయితే తెలుగు ఆడియన్స్‌ పెద్ద ఎత్తున ట్రోల్స్‌ చేస్తున్నారు. అదే సమయంలో మన హీరోల సినిమాలు వచ్చినప్పుడు అంతే స్థాయిలో తమిళులు సైతం నెట్టింట యాంటీ ప్రచారం చేస్తున్నారు.

    నష్టం ఏంటంటే?

    కొద్దిమంది మాత్రమే చేసే ఈ ఫ్యాన్ వార్ వల్ల హీరోలకు, సినిమా ఇండస్ట్రీలకు వచ్చే నష్టం ఏముందిలే అని చాలా మంది భావించవచ్చు. కానీ అది పొరపాటు. కొద్ది మంది ఫ్యాన్స్‌ చేస్తున్న ఈ ట్రోల్స్‌ చూసి ఆయా ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది ఆడియన్స్‌ ప్రభావితమవుతున్నారు. దాని వల్ల సహజంగానే పక్క ఇండస్ట్రీకి చెందిన హీరోపై వారిలోనూ తెలియకుండానే ద్వేషం ఏర్పడుతోంది. ఫలితంగా పక్క ఇండస్ట్రీ నుంచి ఏదైనా సినిమా రిలీజైనప్పుడు దానిని చూడకుండా రిజెక్ట్‌ చేస్తున్నారు. సినిమా బాగున్నప్పటికీ నెగిటివ్‌ టాక్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల నార్త్‌లో బాగా రాణించిన సినిమాలు ఎంతో కీలకమైన సౌత్‌లో దెబ్బతింటున్నాయి. అది మూవీ ఓవరాల్‌ కలెక్షన్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. సినిమా ఎంత బాగున్నప్పటికీ మనం చేసుకుంటున్న నెగిటివ్‌ ట్రోల్స్‌ కారణంగా ఆ సినిమా హిందీ మూవీస్‌ కంటే కలెక్షన్స్‌ పరంగా వెనకబడిపోతున్నాయి. 

    ఆ సినిమాలకు దెబ్బ!

    త్వరలో రిలీజ్‌ అయ్యేందుకు సౌత్‌ నుంచి పలు పాన్ ఇండియా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్‌ నుంచి ‘పుష్ప 2’, ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకోగా కోలీవుడ్‌ నుంచి సూర్య నటించిన ‘కంగువా’, శివకార్తికేయన్‌ నటించిన ‘అమరన్‌’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలు భారీ ఖర్చుతో పాన్‌ ఇండియా స్క్రిప్ట్‌తో రూపొందినవే. గతంలో లాగే ఈ సినిమాల విషయంలోనూ ఫ్యాన్స్ ఇండస్ట్రీల పరంగా విడిపోయి ట్రోల్స్‌ దిగితే గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సినిమా బాగుంటే ఇండస్ట్రీలకు అతీతంగా వాటిని ఆదరించాలని కోరుతున్నాయి. అప్పుడు మాత్రమే ఆయా చిత్రాలు మంచి వసూళ్లు సాధించి పాన్‌ ఇండియా స్థాయిలో ఘనమైన కలెక్షన్స్‌ సాధించగలుగుతాయని పేర్కొంటున్నాయి. అలా కాకుండా మళ్లీ ఫ్యాన్‌ వార్‌కు దిగితే పరోక్షంగా లాభపడేది బాలీవుడ్‌యే అని స్పష్టం చేస్తున్నాయి. 

    టైటిల్స్‌ రచ్చకు చెక్‌ పెట్టాల్సిందే!

    సౌత్‌లో బిగ్‌ ఇండస్ట్రీలుగా ఉన్న టాలీవుడ్‌, కోలీవుడ్‌కి చెందిన దర్శక, నిర్మాతలు తమ వైఖరితో ఫ్యాన్‌ వార్‌కు ఆజ్యం పోయకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇటీవల కాలంలో కోలీవుడ్‌ చిత్రాలు నేరుగా తమిళ టైటిల్స్‌తో తెలుగులోనూ రిలీజ్‌ కావడం ఎక్కువగా చూస్తున్నాం. కంగువా, వేట్టయన్‌తో పాటు అంతకుముందు వచ్చిన ‘తంగలాన్‌’, ‘రాయన్‌’, ‘వెలిమై’ తమిళ పేర్లను పెట్టడం వల్ల ఇది తెలుగు ఆడియన్స్‌లో ఆగ్రహానికి కారణమైంది. కొందరు చేసిన తప్పిదాలు కారణంగా మెుత్తం తమిళ ఇండస్ట్రీపైనే ద్వేషం వచ్చే ప్రమాదం తలెత్తుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమిళ ఇండస్ట్రీ జాగ్రత్తపడాలి. 

    పొలిటికల్‌ టర్న్‌

    ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపనలు సృష్టించాయి. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశిస్తూ పవన్‌ చేసిన పరోక్ష కామెంట్స్‌ తీవ్ర చర్చకు దారితీశాయి. పవన్‌ తరహాలోనే ఉదయనిధి స్టాలిన్‌ తమిళ నటుడు కావడంతో ఈ వివాదం తెలుగు, తమిళ ఇండస్ట్రీల మధ్య వార్‌గా కూడా మారిపోయింది. ఇరువురు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పరస్పరం మాటల దాడి చేసుకున్నారు. పవన్‌ కల్యాణ్ సినీ కెరీర్‌తో ఉదయనిధిని పోలుస్తూ దారుణంగా ట్రోల్‌ చేశారు. అటు ఉదయనిధి విద్యార్హతను తెరపైకి తీసుకొచ్చి పవన్‌పై తమిళ నెటిజన్లు విమర్శలు చేశారు. 

    పవన్‌ కల్యాణ్‌ vs అల్లు అర్జున్‌

    టాలీవుడ్‌లోని అతిపెద్ద సినీ నేపథ్యమున్న కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఆ ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా నటులు ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు. అయితే ఆ కుటుంబానికి చెందిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌కు అసలు పడటం లేదని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో(Pawan Kalyan vs Allu Arjun) పవన్‌ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్‌ మద్దతు తెలపడంతో ఈ వివాదం ఆజ్యం పోసుకుంది. అప్పటి నుంచి బన్నీని మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. అటు అల్లు ఆర్మీ సైతం వారికి దీటుగా బదులిస్తూ తమ హీరోకు అండగా నిలుస్తోంది. అయితే ఇటీవల ఓ ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ టాలీవుడ్‌కు చెందిన హీరోలతో పాటు అల్లు అర్జున్‌ పేరును ప్రస్తావించారు. ఆ హీరోలంటే తనకు ఎంతో గౌరవమని వ్యాఖ్యానించారు. ఈ వివాదానికి చెక్‌ పెట్టే ఉద్దేశ్యంతోనే బన్నీ పేరును పవన్‌ తీసుకొచ్చినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప 2 చిత్రాన్ని ప్రమోట్ చేయమని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version