తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. గత రెండు పర్యాయాలుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయం సాధిస్తూ వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పనితీరు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం కాగా, బలమైన క్యాడర్ ఉన్న సీపీఐ ప్రధాన పోటీదారుగా నిలుస్తోంది.
2009లో ఏర్పాటు..
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో హుస్నాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. తొలిసారి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరింది. తెలంగాణ రాష్ట్రం అవతరణ ఊపులో 2014లో బీఆర్ఎస్(నాటి టీఆర్ఎస్) ఈ స్థానంలో విజయ దుంధుభి మోగించింది. గత రెండు పర్యాయాలుగా బీఆర్ఎస్ నేత వొడితెల సతీష్ కుమార్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక్కడ ప్రతిపక్షం చేతులు మారుతూ ఉంటుంది. సీపీఐ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు అధికారం కోసం పోటీ పడుతున్నారు.
కమ్యూనిస్టులకు కేరాఫ్..
స్వాతంత్య్రం అనంతరం కమ్యూనిస్టులకు హుస్నాబాద్ ప్రాంతం పెట్టని కోటగా మారింది. ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో సీపీఐకి మెరుగైన క్యాడర్ ఉంది. ఆ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వొడితెల సతీష్ కుమార్‌కి ప్రధాన పోటీదారుగా నిలుస్తున్నారు. కానీ, మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిలకు బీఆర్ఎస్ పార్టీతో సీపీఐ చేయి కలపడంతో సమీకరణాలు తారుమారయ్యాయి. దీంతో విస్తృత రాజకీయ నేపథ్యం కలిగి ఉన్న వొడితెల సతీష్ కుమార్ వైపు మరోసారి ప్రజలు మొగ్గు చూపుతారా? లేదా మార్పుని కోరుకుంటారా? అన్న ఆసక్తి నెలకొంది.
భౌగోళిక చరిత్ర..
హుస్నాబాద్ భౌగోళికంగా 3 జిల్లాల్లో విస్తరించి ఉంది. వరంగల్, సిద్దిపేట, కరీంనగర్. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సొంత నియోజకవర్గం ఇదే. కమ్యూనిస్టుల ప్రభావం అనాదిగా కొనసాగుతూ వస్తోంది. పూర్తిగా వ్యవసాయంపైనే ప్రజలు ఆధారపడి జీవిస్తారు. పాడి పరిశ్రమ సమృద్ధిగా ఉంటుంది. పారిశ్రామికంగా కాస్త వెనుకబడి ఉంది. ప్రముఖ ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంక్, ముల్కనూరు సహకార డెయిరీ ఈ నియోజకవర్గానికి చెందినవే. నియోజకవర్గంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి.
సానుకూలాలు..
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందుతున్నాయి. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోంది. విడతల వారీగా రోడ్డు రవాణా, పారిశుద్ధ్యం మెరుగు పడుతోందని స్థానికులు చెబుతున్నారు. సాగునీరు లేమొ ఇక్కడ దీర్ఘకాలిక సమస్య. దీనిని నివారించడానికి ప్రభుత్వం గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు పనుల్లో వేగం పెంచింది. గౌరవెల్లి ట్రయల్ రన్ సక్సెస్ అయింది. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామని చేస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇవ్వడంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి.
ప్రతికూలతలు..
గౌరవెల్లి ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టడంతో ఇక్కడ భూ నిర్వాసితుల ఆందోళనలు పెద్దఎత్తున చెలరేగాయి. ఒక దశలో బీఆర్ఎస్ నాయకులు, భూ నిర్వాసితుల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది. గౌరవెల్లి ముంపు గ్రామమైన గుడాటిపల్లి భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసుకోవడం కూడా సంచలనం రేపింది. దీంతో ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత ఏర్పడింది. గౌరవెల్లి ప్రాజెక్టు ప్రభుత్వానికి కలిసివస్తుందా? లేక ప్రభావితం చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
పొత్తుతో కన్ఫ్యూజన్..
మరోసారి ప్రస్తుత ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్‌నే టికెట్ వరించే అవకాశం ఉంది. మొన్నటివరకూ ప్రధాన పోటీదారుగా ఉన్న చాడ వెంకటరెడ్డి బీఆర్ఎస్‌తో చేతులు కలిపారు. అయితే, హుస్నాబాద్ నియోజకవర్గం ఎన్నికల బరిలో పోటీ చేస్తామని చాడ వెంకటరెడ్డి ఖరాకండీగా చెప్పేశారు. రాష్ట్ర స్థాయిలో పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, నియోజకవర్గ స్థాయిలో సమస్యలపై పోరాటం ఆగదని చాడ వెంకటరెడ్డి గతంలో స్పష్టం చేశారు.
పొత్తు కొనసాగితే..?
ఎన్నికల సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. పొత్తును నియోజకవర్గాలకు వర్తింపజేస్తే, హుస్నాబాద్ నుంచి సీపీఐకి సీటు దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి 2019న అధికార పార్టీలో చేరాడు. ప్రస్తుతం సహకార బ్యాంకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఈయన పేరు కూడా వినిపిస్తోంది. కిందటిసారి బీజేపీ తరఫున పోటీ చేసిన చాడా శ్రీనివాస్ రెడ్డి ఈ సారి కూడా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.
వీరి ప్రాబల్యం..
2011 జనాభా లెక్కల ప్రకారం హుస్నాబాద్ నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాాల వాటా 21.07శాతంగా ఉంది. షెడ్యూల్డ్ తెగలు 5.04 శాతం కాగా. వెనుకబడిన తరగతుల సామాజిక వర్గం ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఈ వర్గాల ప్రజలు విజేతను నిర్ణయించగలరు.