తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి నయనతార (Nayanthara) లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇటీవల ఆమె జీవితంపై ఓ డాక్యుమెంటరీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలను నయన్ పంచుకుంది.
నాగార్జున, రానా ప్రశంసలు
నయన్ వృత్తి, వ్యక్తిగత జీవితంపై ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairy Tale) పేరుతో డాక్యుమెంటరీని రూపొందిస్తోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దీనిని రూపొందిస్తున్నారు. నవంబర్ 18 నుంచి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ (Nayanthara Documentary Trailer) ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇందులో ఇండస్ట్రీలోని నటీనటులు నయనతార గురించి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. నయనతార తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొందని నాగార్జున చెప్పారు. నయన్ లేడీ సూపర్ స్టార్ అని రానా పేర్కొన్నాడు. కన్నడ నటుడు ఉపేంద్ర, తమిళ నటి రాధిక, దర్శకుడు అట్లీ నయనతారను ప్రశంసిస్తూ ఆమెతో తమకున్న అనుబంధాన్ని ట్రైలర్‌లో పంచుకున్నారు. మీరు చూసేయండి.
కన్నీరు పెట్టిన లేడీ సూపర్‌స్టార్
నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ లేడీ సూపర్‌స్టార్ (Nayanthara Documentary Trailer)తో ప్రేమ ఎప్పుడు మెుదలైందో ట్రైలర్‌లో పంచుకున్నారు. అలాగే నయనతార మాట్లాడుతూ తన లైఫ్‌లోని క్రిటికల్ ఫేజ్ గురించి చెప్పుకొచ్చింది. తాను మనుషుల్ని త్వరగా నమ్మేస్తానని చెప్పింది. తెలుగులో వచ్చిన ‘శ్రీరామరాజ్యం’ ఆమె లాస్ట్‌ఫిల్మ్ అంటూ వచ్చిన వార్తలపై కూడా నయనతార మాట్లాడింది. అలాగే తను మరీ లావు అయ్యానంటూ ఓ వార్త సంస్థ రాసిన కథనంపై కూడా రియాక్ట్ అయ్యారు. తన గురించి పేపర్‌లో వచ్చేవన్ని చూసి అమ్మ చాలా భయపడేదంటూ నయనతార కంటతడి పెట్టారు. మరోవైపు నయనతార తల్లి మాట్లాడుతూ తన కూతురిపై పూర్తి నమ్మకం ఉందంటూ వ్యాఖ్యానించారు.
శింభు, ప్రభుదేవాకు చురకలు!
దర్శకుడు విఘ్నేశ్‌తో వివాహానికి ముందు నయనతార శింభు, ప్రభుదేవాలతో ప్రేమయాణం నడిపింది. ముఖ్యంగా వల్లభ సినిమా టైమ్‌లో శింబుతో ఈ అమ్మడు పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయినట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. ఏమైందో ఏమోకానీ వారు విడిపోయారు. ఆ తర్వాత అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవతో సైతం కొంత కాలం ప్రేమవ్యవహారం నడిచింది. అప్పట్లో ఎక్కడకైనా వీరిద్దరే జంటగా వెళ్లేవారు. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే బంధం కూడా ఎంతో కాలం నిలబడింది. ఆ తర్వాత ‘నేనూ రౌడీనే’ షూటింగ్ సమయంలో విఘ్నేశ్‌తో పరిచయం ఏర్పడటం ఆ తర్వాత ప్రేమలో పడటం, ఆపై పెళ్లి చకచకా జరిగిపోయింది. అయితే లేటెస్ట్ డాక్యుమెంటరీ ట్రైలర్‌లో ‘తాను మనుషుల్ని త్వరగా నమ్మేస్తా’ అని నయనతార వ్యాఖ్యానించడం వెనక శింభు, ప్రభుదేవ ఉన్నారని నెటిజన్లు భావిస్తున్నారు. పూర్తి డాక్యుమెంటరీలో ఈ వ్యవహారం గురించి ఏమైనా ప్రస్తావన ఉంటుందో లేదో చూడాలి.
ఫుల్ స్వింగ్‌లో నయనతార
ప్రస్తుతం ఫిల్మ్ కెరీర్ పరంగా నయనతార (Nayanthara Documentary Trailer) దూసుకుపోతోంది. గతేడాది షారుక్ ఖాన్‌తో ‘జవాన్’ చిత్రం చేసి తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈ అమ్మడు అడుగుపెట్టింది. అదే ఏడాది ‘అన్నపూర్ణి’గా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ ఈ లేడీ సూపర్‌స్టార్ బిజీ బిజీగా ఉంది. తమిళంలో ‘టెస్ట్’, ‘మన్నన్‌గట్టి సిన్స్ 1960’, ‘తని ఓరువన్ 2’, ‘ముకుతి అమ్మన్ 2’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే మలయాళంలో ‘డియర్ స్టూడెంట్స్’ అనే చిత్రం చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివర, వచ్చే సంవత్సరంలో అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే 2022లో డైరెక్టర్ విఘ్నేశ్‌ను పెద్దల సమక్షంలో నయన్ వివాహం చేసుకుంది. వీరికి సరోగసి విధానంలో పుట్టిన ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ