పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్ పరంగా ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్ రీసెంట్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. అటు డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన ‘యానిమల్’ భారతీయ చిత్ర పరిశ్రమను ఎంతగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా చేసిన తాజా కామెంట్స్ ఈ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘నా బెస్ట్ ఏంటో చూపిస్తా’
డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. హీరోగా ప్రభాస్ ఒక్కరే ఫిక్స్ కాగా ఇతర నటీనటులను ఫైనల్ చేసే పనిలో సందీప్ ఉన్నారు. అయితే స్పిరిట్ ఎలా ఉండబోతుందోనన్న దానికి సందీప్ తాజాగా ఒక హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నారు. ‘కొందరు యానిమల్ నా బెస్ట్ వర్క్ అంటున్నారు. నా బెస్ట్ వర్క్ ఏంటో స్పిరిట్‌లో చూస్తారు’ అని సందీప్ రెడ్డి వంగా అన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సందీప్ తీసిన ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలకంటే ‘స్పిరిట్’ అత్యుత్తమంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఇంకో రూ.1000 కోట్లు లోడింగ్ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
విలన్‌గా కొరియన్ సూపర్ స్టార్?
‘స్పిరిట్’లో ప్రభాస్‌ను ఢీకొట్టే విలన్ పాత్రలో ప్రముఖ కొరియన్ నటుడు డాంగ్ సూక్ (డాన్ లీ) కనిపించబోతున్నారని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ‘ద ఔట్ లాస్’, ‘ద రౌండప్’ వంటి సూపర్ హిట్స్‌తో డాంగ్ సూ (Ma Dong-seok) వరల్డ్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు. కొరియాలో అతడు చేసిన పలు చిత్రాలు ప్రస్తుతం ఓటీటీ వేదికగా భారతీయ భాషల్లో డబ్ కూడా అవుతున్నాయి. దీంతో భారత్‌లోనూ అతడికి మంచి క్రేజ్ ఏర్పడింది. కాబట్టి ప్రభాస్ విలన్‌గా డాంగ్ సూ గనుక నటిస్తే స్పిరిట్ ప్రాజెక్ట్ గ్లోబల్ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించే ఛాన్స్ ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పవర్‌ఫుల్ పోలీసుగా ప్రభాస్
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ‘స్పిరిట్’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి (Arjun Reddy), యానిమల్ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని రూపొందిస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే స్పిరిట్‌లో ప్రభాస్ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్ చెప్పారు. అతడి క్యారెక్టరైజేషన్, లుక్‌తో పాటు మేనరిజమ్స్ కొత్తగా ఉండబోతున్నట్లు సందీప్ వంగా తెలిపాడు. ఇక ‘స్పిరిట్’ స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. అక్టోబర్ లేదా నవంబర్ నుంచి స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.