పెళ్లి అనేది ఒక పాతకాలం కట్టుబాటు, కాలం చెల్లిన ఆచారం… చాలా మంది నేటికాలం యువత ఇలా భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయిన వైవాహిక బంధాన్ని కొట్టిపారేస్తున్నారు. అదే సహజీవనం అనే పాశ్చాత్య సంస్కృతికి ఊపిరిపోసింది. పెళ్లి అనే బంధం లేకుండా ఇద్దరు భాగస్వాములుగా కలిసి జీవించడమే సహజీవనం. భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాల్లో ఇది అంతగా ఇమడని విషయమైనా ఈ మధ్య ఈ సంస్కృతి బాగా పెరుగుతోంది. ముఖ్యంగా బెంగళూరు, దిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాల్లో సహజీవనం చేస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే లివ్ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండే సానుకూలతలు ఏంటి? ఇబ్బందులేంటి? భారత్‌లో దీనికి చట్టబద్ధత ఉందా? ఈ విషయాలన్నీ సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
లివ్ఇన్ రిలేషన్‌షిప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వే ప్రకారం దాదాపు 80శాతం మంది యువత లివ్‌ఇన్ రిలేషన్‌షిప్‌కు ప్రాధాన్యమిచ్చారు. అయితే ఇందులో కేవలం 26 శాతం మంది మాత్రమే ఆ బంధాన్ని జీవితాంతం కొనసాగించాలనే ఆలోచనతో ఉన్నారు. దీనికి అనేక కారణాలున్నాయి.
కెరీర్:
గతంతో పోలిస్తే ఈతరం యువతలో కెరీర్, జీవితం పట్ల దృష్టి కోణం మారింది. ఒకప్పుడు పెళ్లంటే లైఫ్‌లో సెటిల్ అవ్వడం లేదా స్థిరత్వం పొందడం అనే ఆలోచన ఉండేది కానీ ఇప్పుడలా కాదు. వివాహం తమ ఎదుగుదలకు అడ్డుగా భావిస్తున్నారు.
ముందు చూపు:
యువతలో ముందుచూపు ఎక్కువైంది. విడిపోవడం గురించి ముందే ఆలోచిస్తున్నారు. పెళ్లి చేసుకుంటే విడిపోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ లివ్‌ఇన్‌లో ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని చెరో దారి చూసుకోవచ్చు.
పెళ‌్లి అనేది కేవలం సమాజం కోసమే అనే భావన:
చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఇదే మాట చెబుతున్నారు. పెళ్లి అయినా, లివ్ ఇన్ అయినా ఇద్దరు కలిసి జీవించడం కోసమే. అలాంటప్పుడు కేవలం సమాజం కోసం పెళ్లి చేసుకుంటే మా అస్తిత్వం ఎక్కడుంటుంది అని ప్రశ్నిస్తున్నారు.
బాధ్యతలు, సర్దుకుపోవడం:
పెళ్లిలో బాధ్యతలు ఎక్కువ, అలాగే అనేక విషయాల్లో సర్దుకుపోవాల్సి వస్తుంది. స్వేచ్ఛగా బతకాలనుకునే యువతక ఇది నచ్చట్లేదు.
సామాజిక ఒత్తిళ్లు:
వైవాహిక బంధంలో సామాజిక ఒత్తిళ్లు చాలా ఎక్కువ. పెళ్లి, పెళ్లయిన ఏడాది నుంచి పిల్లలు. పిల్లలు పుట్టాక వారిని చదివించే పాఠశాల దగ్గరనుంచి సొసైటీ మీద ఆధారపడే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతం 30-35 ఏళ్ల వయసు వరకూ యువత వారి కెరీర్‌ను బలంగా నిర్మించుకోవడంపైనే దృష్టి పెడుతున్నారు.
అమ్మాయిల్లో ఆర్థిక స్వావలంబన పెరగడం:
గతంతో పోలిస్తే తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే అమ్మాయిలు పెరిగారు. వైవాహిక బంధంలో పురుషాధిక్యత ఉంటుంది. అదే లివ్ ఇన్‌లో ఇద్దరూ సమానమనే భావన ఉంటుంది. ఇది అమ్మాయిలను లివ్ ఇన్ వైపు ఎక్కువగా తీసుకెళ్తోంది.
ఆర్థిక స్వేచ్ఛ:
వైవాహిక బంధంలో చాలావరకు పురుషులే అన్ని ఆర్థిక బాధ్యతలు చూస్తారు. మహిళలు ఇంటిపని, వంట పని అన్న ధోరణి ఉంటుంది. కానీ లివ్ ఇన్ రిలేషన్ రూమ్‌మేట్స్‌తో ఉండటం లాంటిది. ఇద్దరూ సమానంగా బాధ్యతలు పంచుకుంటారు. దీనివల్ల పురుషులు ఆర్థికంగా సేఫ్‌గా ఫీలయితే, మహిళలు సమానత్వం పొందిన భావన పొందుతున్నారు.
సామాజిక అంతరం:
కేవలం ఆధునిక పోకడలు అభ్యున్నత భావాలే కాదు. మన సమాజంలోని అసమానతలు కూడా లివ్‌ఇన్‌ల పెరుగుదలకు కారణమవుతున్నాయి. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు ప్రేమించుకున్నపుడు, కులం,మతం కారణంగా పెద్దలు పెళ్లికి ఒప్పుకోవడం లేదు. అలాంటి సమాజంతో మాకేంటి? అని యువత లివ్‌ఇన్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
ఇవేగాక మెట్రో సిటీస్‌లో ఉద్యోగం చేసేవారు ఆర్థికంగా కలిసి వస్తుందని షార్ట్ టర్మ్ రిలేషన్‌షిప్‌ను ఎంచుకుంటున్నారు.
పైవన్నీ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో యువత చూస్తున్న సానుకూలతలు, వైవాహిక బంధం వేసే సంకెళ‌్ల కన్నా లివ్‌ఇన్ బెటర్ అని వారి అభిప్రాయం.
లివ్‌ఇన్ రిలేషన్‌షిప్‌లో సమస్యలు
పెళ్లిలో సానుకూలతలు సమస్యలు ఉన్నట్లే లివ్‌ఇన్‌లోనూ సమస్యలు ఉంటాయి. సామాజిక, న్యాయపర సమస్యల కంటే ముందు లివ్‌ఇన్‌లో ఉండే ఇద్దరు సహచరుల మధ్య వచ్చే సమస్యలు చూద్దాం.
షేరింగ్:
ప్రస్తుతం చాలావరకు లివ్‌ఇన్ రిలేషన్‌షిప్స్‌కు కారణం షేరింగ్. ఇంటిపని, వంటపని పంచుకోవచ్చనే కారణంతో కలిసి ఉంటున్నారు. మెట్రో నగరాల్లో ఈ సంస్కృతి పెరగడానికి ఇదే కారణం. ఇద్దరు కలిసి ఉన్న రూం ఒకరికి నచ్చవచ్చు మరొకరికి నచ్చకపోవచ్చు. ఇద్దరి అభిరుచులు వేరు అయినపుడు ఎక్కడ ఏ వస్తువు ఉండాలో అన్నదానిపై ఇద్దరికీ గొడవ తలెత్తవచ్చు. ఇద్దరి ఉద్యోగాల పనివేళల కారణంగా వంట పని, ఇంటిపని దగ్గర కూడా వివాదాలు మొదలవ్వొచ్చు. ఇవి వినడానికి చాలా చిన్నగా అనిపించొచ్చు కానీ చాలా వరకు జంటలు బ్రేకప్ అవ్వడానికి ఈ చిన్న చిన్న అంశాలే కారణమని తెలుసా!
డబ్బు:
చాలా సర్వేల ప్రకారం బంధం ఎలాంటిదైనా అవి బ్రేకప్ కావడంలో డబ్బుది ప్రధాన పాత్ర. లివ్‌ఇన్‌లో ఉండేవారు మనీ మేనేజింగ్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ బంధాన్ని ఎంచుకుంటున్నారు. అలాంటప్పుడు ఇద్దరూ సమానంగా షేర్ చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే అందులో ఎవరో ఒకరికి తమ డబ్బు ఎక్కువ ఖర్చవుతోందని ఆలోచన వస్తుందో అప్పుడు సమస్య మొదలవుతుంది. ఉదాహరణకు బయటకు వెళ్లిన ప్రతిసారీ అబ్బాయి ఖర్చు పెట్టాల్సి రావొచ్చు. నెల తిరిగాక చూసుకుంటే అమ్మాయి కంటే అబ్బాయి ఖర్చులు ఎక్కువవుతాయి. కొంతకాలం ఇది కొనసాగితే ఇద్దరి మధ్య ఎడబాటుకు ఇదే కారణమవుతుంది.
ఎవరు గొప్ప?:
పెళ్లి అంటేనే సర్దుకుపోవడం ఇది నచ్చకనే అమ్మాయిలు, అబ్బాయిలు లివ్‌ఇన్‌లోకి వస్తారు. అప్పుడు ఇద్దరూ తాము సమానమనే భావన ఉంటే సరే, కానీ వారిలో ఏ ఒక్కరూ నేను గొప్ప అని భావించినా సమస్య మొదలవుతుంది. జస్ట్ రూం మేట్స్ అయితే ఈ ఓకే గానీ ఎప్పుడైతే ఒక రిలేషన్‌షిప్‌లో ఉంటారో అప్పుడు ఎవరు గొప్ప అనే ఆలోచన తీవ్రమైన గొడవలకు దారి తీస్తుంది.
అభద్రత:
పెళ్లి అనేది కేవలం ఇద్దరి మధ్య జరిగేది కాదు రెండు కుటుంబాల మధ్య జరిగేది. దాని నుంచి బయటపడటం అంత సులభం కాదు. కానీ లివ్‌ఇన్‌లో చాలా ఈజీ. దీనివల్ల ఎమోషనల్ ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. మీ పార్ట్‌నర్ మిమ్మల్ని ఎప్పుడైనా వదులుకోవాలనుకోవచ్చు. కానీ అప్పుడు మీరు అతడిని లేదా ఆమెను వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవచ్చు. ఎప్పుడైతే ఈ వైరుద్యం తలెత్తుతుందో అప్పుడు మానసికంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఎమోషనల్‌గా ఆధారపడటం:
రిలేషన్‌షిప్ అనేది మనసుకు సంబంధించిన విషయం. కొన్నిసార్లు కేవలం ఆర్థికంగా కలిసి వస్తుందనో మొదట లివ్‌ఇన్‌లోకి వెళ్లినా అందులో ఎవరో ఒకరు ఎమోషనల్‌గా మరొకరిపై ఆధారపడటం ప్రారంభవుతుంది.అప్పుడు విడిపోవాల్సి వస్తుందనే ఆలోచన కూడా వారిని క్రుంగదీస్తుంది. ఆలోచనలు సరిగా రాక కెరీర్‌పై కూడా ఫోకస్ చేయలేకపోవచ్చు.
సెక్సువల్:
ఇద్దరి మధ్య రొమాన్స్ ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఇద్దరిలో ఎవరో ఒకరు పని ఒత్తిడి కారణంగానో మరే ఇతర కారణాల వల్లనో మరొకరిని పక్కనబెట్టొచ్చు. ఇది ఇంకొకరిలో తమపై ఆసక్తి తగ్గిపోతోందని, తనను తేలికగా తీసుకుంటున్నాడనే ఆలోచన పెంచుతుంది.
వేర్వేరు లక్ష్యాలతో రిలేషన్‌షిప్
లివ్‌ఇన్‌లో కొంతకాలమే ఉండాలనుకుంటున్నారా? లాంగ్ రిలేషన్ కోసమా? లేదా కొంతకాలం లివ్‌ఇన్‌లో ఉండి పెళ్లి చేసుకుందామనుకుంటున్నారా? ఈ క్లారిటీ చాలా మందిలో ఉండదు. కొన్నిసార్లు కొంతకాలమే ఉందామనుకుని రిలేషన్ స్టార్ట్ చేసినా, తర్వాతి కాలంలో అందులో ఎవరో ఒకరు జీవితాంతం కలిసుండాలని ఆశపడవచ్చు. అప్పుడు సమస్య వస్తుంది. ఇలాంటి వారికి న్యాయం దొరకడం కూడా కష్టమే.
పైవన్నీ వారిద్దరి మధ్య మాత్రమే తలెత్తే సమస్యలు . షార్ట్ టర్మ్ రిలేషన్‌షిప్ అని ముందే నిర్ణయించుకుని ఉంటే ఇలాంటివి పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు. కానీ లివ్‌ఇన్‌లోనే లాంగ్‌టర్మ్ రిలేషన్‌షిప్‌లో ఉండాలనుకుంటే వీటితో పాటు ఇంకా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సామాజిక సమస్యలు
ఇండియాలో సహజీవన సంస్కృతి పెరుగుతున్నా, ఇప్పటికీ సమాజం దీనిని పూర్తిగా అంగీకరించలేదు. లివ్‌ఇన్ బంధాన్ని ఓ అనైతిక బంధంగానే చూస్తోంది. దీనివల్ల మీ చిన్న చిన్న అవసరాలకు కూడా కనీస సహకారం లభించకపోవచ్చు. కేవలం పార్ట్‌నర్‌తోనో లేదా మీలాంటి అభ్యుదయ భావాలున్నవారితోనే నిరంతరం ఉండటం సాధ్యం కాదు. ఇరుగుపొరుగు వారు ఏదో ఒక సమయంలో అవసరమవుతారు. కానీ లివ్‌ఇన్‌లో ఉన్నవారికి తగిన మద్దతు లభించదు. అంతెందుకు తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు కూడా మీకు మద్దతుగా నిలవకపోవచ్చు. ఎమోషనల్‌గానో, ఆర్థికంగానో మీ వాళ్ల అవసరం వచ్చినపుడు లివ్‌ఇన్‌లో ఇబ్బందులు తప్పవు. ఒకవేళ లివ్‌ఇన్ బ్రేకప్ అయితే మీరు ఒంటరి అయిపోవచ్చు.
న్యాయపర సమస్యలు:
మన దేశంలో సహజీవనంకు చట్టబద్ధత లేదు. అలాగని లివ్‌ఇన్ చట్టవ్యతిరేకం కూడా కాదు. ఆర్టికల్ 19(a) అందించే వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆర్టికల్ 21 అందించే జీవించే హక్కు ద్వారా సహజీవనంకు రక్షణ లభిస్తోంది. సుప్రీంకోర్టు సైతం ఎక్కువకాలం కలిసి ఉన్న లివ్‌ఇన్‌ను పెళ్లిగానే పరిగణిస్తామని చెప్పింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ,1872 సెక్షన్ 114 ప్రకారం లివ్‌ఇన్‌ను పెళ్లిగా చూస్తామని చెప్పింది. కానీ సహజీవనంపై నిర్ధిష్టమైన చట్టాలు లేనందున అనేక సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. వివిధ దశల్లో కోర్టులు ఏం చెప్పాయో చూద్దాం
అనైతికం కావొచ్చు కానీ చట్టవ్యతిరేకం కాదు
2001లో పాయల్ శర్మ Vs నారి నికేతన్ కేసులో సహజీవనం చట్ట వ్యతిరేకం కాదని అలహాబాద్ కోర్టు తేల్చిచెప్పింది. “అమ్మాయి మేజర్. తాను ఎక్కడైనా, ఎవరితోనైనా జీవించే హక్కు ఉంది. పెళ్లి చేసుకోకపోయినా వారు కలిసి ఉండాలనుకుంటే ఉండొచ్చు. దీనిని సమాజం అనైతికంగా భావించొచ్చు కానీ చట్ట వ్యతిరేకం మాత్రం కాదు” అని వ్యాఖ్యానించింది. 2006లో లతాసింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, 2010లో ఖుష్బూ వర్సెస్ కన్నియమ్మల్ కేసుల్లో సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది.
గృహహింస నుంచి రక్షణ
వైవాహిక బంధంలోనే కాదు లివ్‌ఇన్‌లోనూ గృహహింస బాధితులు ఉంటున్నారు. ఇటీవల సహచరుడి చేతిలో హత్యకు గురైన శ్రద్ధా వాకర్ కూడా గృహహింసను ఎదుర్కొంది. 2013లో ఇంద్రాశర్మ వర్సెస్ VKV శర్మ కేసులో లివ్‌ఇన్ రిలేషన్‌లోనూ మహిళలకు గృహ హింస నుంచి రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. మహిళలకు గృహహింస నుంచి రక్షణ చట్టం-2005 లివ్‌ఇన్‌లోనూ వర్తిస్తుందని పేర్కొంది.
భరణం
ఎక్కువ కాలం కలిసున్న లివ్ఇన్ జంటలను పెళ్లైనవారిగానే పరిగణిస్తామని సుప్రీంకోర్టు చెప్పిన వేళ.. పెళ్లి మాదిరిగానే లివ్‌ఇన్‌లోనూ మహిళలు భరణం డిమాండ్ చేయవచ్చు. 2016లో అజయ్ భరద్వాజ్ వర్సెస్ జ్యోత్స కేసులో పంజాబ్ హైకోర్టు భరణం ఇప్పించింది. గతంలో సెక్షన్ 125 ప్రకారం భార్యకు మాత్రమే భరణం దక్కేది. అయితే లివ్‌ఇన్‌లో ఉండే మహిళను కూడా ‘భార్య’గానే భావిస్తామని కోర్టు చెప్పింది.
ప్రమోద్ సూర్యభాన్ పవార్ వర్సెస్ మహారాష్ట్ర
2019లో ఈ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు లివ్‌ఇన్‌లో మరో కోణాన్ని చూపెడుతుంది. ఈ కేసులో అమ్మాయి,అబ్బాయి చాలా కాలం లివ్‌ఇన్‌లో ఉన్నారు. ఇందులో అబ్బాయి, అమ్మాయిని తొలుత పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత సామాజికవర్గ కారణాలు చెప్పి పెళ్లి కుదరకపోవచ్చని చెప్పాడు. అబ్బాయి అలా చెప్పిన తర్వాత కూడా అమ్మాయి అతడితో ఉంది. వారు శారీరకంగా కూడా కలిశారు. కానీ అతడు పెళ్లి కుదరదని తేల్చి చెప్పడంతో అమ్మాయి కోర్టుకు వెళ్లింది. పెళ్లి పేరిట మోసగించాడని ఫిర్యాదు చేసింది. కానీ కోర్టు దీనిని కొట్టివేసింది. పెళ్లికి ఇబ్బందులు ఉన్నాయని తెలిసే ఆ అమ్మాయి అతడితో రిలేషన్‌లో ఉంది కాబట్టి దీనిని రేప్‌గా చూడలేమంది.
లివ్‌ఇన్‌లో పుట్టిన పిల్లల పరిస్థితి
జీవితాంతం కలిసుందామనేే ఆలోచనలో సహాజీవనం చేయవచ్చు కానీ అలాంటి సమయంలో వారికి పుట్టే పిల్లల పరిస్థితి ఏంటి? జూన్ 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పులో లివ్‌ఇన్ రిలేషన్‌షిప్‌లో పుట్టిన పిల్లలు చట్టబద్ధమే అని చెప్పింది. అయితే ఆ జంట జీవితాంతం కలిసుండాలనే ఆలోచనలో ఉండాలని, కొంతకాలానికి కలిసుందాం అనుకుంటే ఇది వర్తించదని చెప్పింది. పిల్లలకు వారసత్వంగా దక్కే ఆస్తులపై పెళ్లి ద్వారా పుట్టే పిల్లలకు ఉన్నట్లే అన్ని హక్కులూ ఉంటాయని తేల్చిచెప్పింది.
లివ్‌ఇన్ పార్ట్‌నర్స్‌కు వీసా ఇస్తారా?
చదువు కోసమో ఇతర కారణాలతోనో విదేశాల నుంచి వచ్చి ఇక్కడి అబ్బాయిలతో లివ్‌ఇన్‌లో ఉండేవారికి వీసా ఇస్తారా?. 2015లో స్వేత్లానా కజాంకినా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ.. వీసా పొడిగింపునకు పెళ్లి, లివ్‌ఇన్‌ను వేర్వేరుగా చూడొద్దు, ఇప్పుడు అది స్వీకరించాల్సిన సత్యం అని పేర్కొంది.
పైన పేర్కొన్నవన్నీ చట్టప్రకారం అమ్మాయి, అబ్బాయి రిలేషన్‌లో ఉన్నపుడు మాత్రమే వర్తిస్తాయి. స్వలింగ సంబంధాలకు వర్తించవు. అలాగే చట్టపరంగా లివ్‌ఇన్ జంటలకు మద్దతు దొరుకున్నట్లే కనిపిస్తున్నా…కోర్టులో వాటిని నిరూపించడం చాలా కష్టం. ఎందుకంటే.. సదరు జంట చాలా కాలంగా రిలేషన్‌లో ఉన్నారని చెప్పేందుకు ఆధారాలు సంపాదించడం కష్టం.
లివ్ ఇన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 2018లో నిర్వహించిన ఓ సర్వేలో దేశంలో 18-25 ఏళ్ల యువతో 26 శాతం మంది లాంగ్ రిలేషన్‌లోనే ఉండాలనుకుంటున్నారట. మిగతా వారంతా లివ్‌ఇన్‌కే ప్రాధాన్యత ఇచ్చారు.
- మరో సర్వే ప్రకారం బెంగళూరు, ముంబయిలో లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్‌లో 70-80 శాతం జంటలు బ్రేకప్ అవుతున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!