నటీనటులు : సత్య దేవ్, అథిరా రాజ్, ఆర్చన అయ్యర్, రఘు కుంచె
డైరెక్టర్ : వి. వి. గోపాల కృష్ణ
సంగీతం: కాల భైరవ
సినిమాటోగ్రాఫర్ : సన్నీ కుర్రపాటి
ఎడిటర్ : తిమ్మరాజు
నిర్మాత : కృష్ణ కొమ్మలపాటి
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). వి.వి గోపాల కృష్ణ దర్శకుడు. అథిరా రాజ్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, మే 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? సత్య దేవ్‌కు మరో హిట్‌ను అందించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
విజయవాడ వించిపేటలో జీవించే భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్), శివ (కృష్ణ తేజ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ముగ్గురు అనాథలు కావడంతో ఒకరికొకరు తోడుగా జీవిస్తుంటారు. గతంలో నేరాలకు పాల్పడిన ఈ ముగ్గురు కొన్ని కారణాలతో మంచిగా మారతారు. భద్ర ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటాడు. అయితే అనుకోకుండా వీరికి రూ. 3 లక్షలు అవసరం పడతాయి. చివరిసారిగా ఒక నేరం చేసి అవసరం తీర్చుకోవాలని భావిస్తారు. ఈ క్రమంలో ముగ్గురు చిక్కుల్లో పడతారు. జైలుకు కూడా వెళ్తారు. ఈ క్రమంలో వీరిలో ఒకరు అనూహ్యంగా చనిపోతారు? స్నేహితుల్లో ఒకరు చనిపోవడానికి కారణం ఎవరు? వారు జైలుకెళ్లేలా కుట్ర చేసిందెవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
విలక్షణ నటుడు సత్యదేవ్ ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తనదైన నటనతో అదరగొట్టాడు. పగతో రగిలిపోయే భద్ర పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ఎమోషనల్ సన్నివేశాల్లో సత్యదేవ్ నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. హీరోయిన్‌గా అతిర పాత్ర పరిమితమే. నటన పరంగా ఆమె పాత్రకు పెద్ద స్కోప్ లేదు. స్నేహితులుగా చేసిన మీసాల లక్ష్మణ్, కృష్ణ తేజా రెడ్డి తమ నటనతో ఆకట్టుకున్నారు. పోలీసు ఆఫీసర్‌గా చేసిన నందగోపాల్ పర్వాలేదనిపించాడు. రఘు కుంచే పాత్ర కూడా సినిమాలో బాగుంది. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వి.వి గోపాలకృష్ణ.. రివేంజ్ డ్రామాగా ఈ సినిమాకు తెరకెక్కించాడు. అయితే కథ పరంగా చూస్తే కొత్త దనం ఏమి లేదని చెప్పాలి. ఈ తరహా రివేంజ్ డ్రామాలు చాలానే వచ్చాయి. అయితే స్క్రీన్‌ప్లే మాత్రం ఆకట్టుకుంటుంది. ఆడియన్స్‌ను కథలోకి తీసుకెళ్లిన విధానం ప్రశంసనీయం. ఫస్టాఫ్ మెుత్తం ఓ దారుణ హత్య.. స్నేహితుల పాత్రలు, వారి మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్‌ను పరిచయం చేయడంతోనే సరిపోయింది. దీంతో ఆడియన్స్‌కు కథ ల్యాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. సెకండాఫ్‌కు వచ్చాక దర్శకుడు కథలో వేగం పెంచాడు. తమ ఫ్రెండ్‌ను చంపిన వారిని హీరో టార్గెట్ చేసే సీన్లను దర్శకుడు ఆసక్తికరంగా చూపించాడు. అయితే క్లైమాక్స్ ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. చిన్న చిన్న లోపాలున్నా దర్శకుడిగా వి.వి. గోపాల కృష్ణ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సన్నీ కుర్రపాటి తన కెమెరా పనితనంతో తెరపై ప్లెజెంట్ వాతావరణాన్ని తీసుకొచ్చారు. అటు కాల భైరవ అందించిన పాటలు సో సోగా ఉన్నాయి. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- సత్యదేవ్ నటన
- స్క్రీన్‌ప్లే
- సెకండాఫ్
మైనస్ పాయింట్స్
- రొటిన్ రీవెంజ్ డ్రామా
- బోరింగ్ సీన్స్
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!