టాలీవుడ్ నటుడు రాజ్‌తరుణ్ (Raj Tarun), అతడి మాజీ ప్రేయసి లావణ్య (Lavanya) కేసు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని లావణ్య ఇటీవల నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా ఆమె మరోమారు పోలీసులను ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు, మెడికల్ రిపోర్ట్స్‌ను సైతం ఆమె పోలీసులకు అందజేశారు. దీంతో నార్సింగి పోలీసులు రాజ్‌తరుణ్‌తో పాటు హీరోయిన్ మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజా ఫిర్యాదులో ఏముందంటే?
లావణ్య ఇచ్చిన లేటెస్ట్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులో ఏ1గా రాజ్‌తరుణ్, ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ3గా మయాంక్ మల్హోత్రాను పోలీసులు చేర్చారు. అంతకుముందు లావణ్య తన ఫిర్యాదులో వారిపై మరిన్ని అభియోగాలు మోపారు. 2008 నుంచి రాజ్‌తరుణ్‌తో పరిచయం ఉందని, 2010లో ప్రపోజ్ చేసి 2014లో తనను పెళ్లి చేసుకున్నట్లు ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. రాజ్‌తరుణ్ కుటుంబానికి తన ఫ్యామిలీ రూ.70 లక్షలు ఇచ్చిందని లావణ్య తెలిపారు. 2016లో తాను గర్భం దాల్చానని రెండో నెలలోనే అతడు అబార్షన్ చేయించినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. సర్జరీకి సంబంధించిన ఆసుపత్రి బిల్లులు రాజ్ చెల్లించినట్లు చెప్పారు. నటి మాల్వీ పరిచయం అయ్యాకే రాజ్ తన నుంచి దూరమయ్యాడని పోలీసులకు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే నటి మాల్వీతో పాటు ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించారని తెలిపారు. లావణ్య ఫిర్యాదు మేరకు సెక్షన్ 420, 493, 506 కింద రాజ్ తరుణ్‌తో పాటు మాల్వీ, మయాంక్‌లపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.
కీలక ఆధారాలు అందజేత!
రాజ్‌తరుణ్‌ను హెచ్చరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్స్‌పై లావణ్య స్పందించారు. తనను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వంగా ఆడియో రికార్డ్ చేశారని పేర్కొంది. మాల్వీ మల్హోత్రా, రాజ్‌తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. తమ బెదిరింపు, చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్, టెక్నికీల్ ఎవిడెన్స్‌ను నార్సింగి పోలీసులకు అందజేసినట్లు లావణ్య చెప్పారు. పోలీసు వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
లావణ్యనే బెదిరించింది : మాల్వీ
నటుడు రాజ్‌తరుణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని 6 నెలలుగా తాము మాట్లాడుకుందే లేదని ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాల్వీ మల్హోత్రా స్పష్టం చేశారు. తాను లావణ్యను బెదిరించలేదని, కనీసం ఆమె ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. మరోవైపు లావణ్యనే తనకు కాల్ చేసి వేధించిందని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని లావణ్య మెంటల్‌గా హేరాస్ చేసిందని చెప్పారు. తన నెంబర్ బ్లాక్ చేస్తే ఆమె నేరుగా తన తల్లిదండ్రులకు కాల్ చేసి వాళ్లని ఇబ్బంది పెట్టిందని అన్నారు. తన పేరెంట్స్ నెంబర్ ఎవరితోనూ షేర్ చేసుకోలేదని అయినా ఆమె వద్దకు ఎలా వచ్చిందని మాల్వీ ప్రశ్నించారు. లావణ్య తన మీద అసత్య ప్రచారాలు చేస్తోందని పేర్కొన్నారు. రాజ్ కేవలం తనకు సహచర నటుడు మాత్రమేనని మేము కలిస్తే సినిమాల గురించే మాట్లాడుకుంటామని మాల్వీ స్పష్టం చేశారు. అంతకుమించి అతడిలో ఎలాంటి సంబంధం లేదని ఇంటర్యూలో వెల్లడించారు. తన సోదరుడు గురించి చేసినవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టిపారేశారు.
లావణ్యపై ఫిర్యాదు
మరోవైపు నటి మాల్వీ మల్హోత్రా లావణ్యపై ఫిల్మ్‌నగర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మాల్వీ మల్హోత్ర ఫిల్మ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని టోలిచౌకి అజీజ్‌బాగ్‌కాలనీలోని విక్టోరియం ఆదిత్య ఎంప్రెస్ టవర్‌లో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా తన సోదరుడికి లావణ్య వాట్సాప్, ఇన్‌స్టాలో అనుచిత సందేశాలు పంపుతుందని మాల్వీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై లావణ్య తప్పుడు ఆరోపణలు చేస్తోందని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఫిల్మ్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.