ప్రస్తుత ఓటీటీ యుగంలో ప్రతీ వారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్ కూడా పెద్ద ఎత్తున తెలుగు చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. అలాగే ఆసక్తికరమైన సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తున్నాయి. ఇంతకీ ఈ వారం స్ట్రీమింగ్‌లోకి రానున్న ఓటీటీ చిత్రాలు, సిరీస్‌లు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్ ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
కలి (Kali)
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ‘కలి‘ (Kali Movie OTT Release) చిత్రం ఈ వారం ఓటీటీలోకి వచ్చింది. అక్టోబర్ 17నుంచి ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రిన్స్, నరేశ్ అగస్త్య ముఖ్య పాత్రలు పోషించారు. నేహా కృష్ణన్ హీరోయిన్గా చేసింది. శివ శేషు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 4న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్లాట్ ఏంటంటే ‘శివరామ్ (ప్రిన్స్) యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఎవరు ఏం సహాయం అడిగినా కాదనకుండా చేస్తుంటాడు. అయితే శివరామ్ మంచి తనాన్ని క్యాష్ చేసుకొని సొంతవారే అతడి ఆస్తిని కొట్టేస్తారు. దీంతో ఆత్మహత్యకు యత్నిస్తున్న శివరామ్‌ను కలియుగాన్ని పాలించే కలి పురుషుడు (నరేశ్ అగస్త్య) అడ్డుకుంటాడు. అతడి రాకతో శివరామ్ జీవితంలో చోటుచేసుకున్న మార్పులేంటి?’ అన్నది స్టోరీ.
1000 బేబీస్ (1000 Babies)
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ‘1000 బేబీస్ (1000 Babies). అక్టోబర్ 18న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. ఇందులో రెహమాన్, నీనా గుప్తా ముఖ్యపాత్రలు పోషించారు. నజీమ్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ను సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ పోలీసు టీమ్ అడవిలో దేనికోసమో సెర్చ్ చేస్తుంటుంది. మరోవైపు అడవి మధ్యలో ఉన్న ఓ ఇంట్లో ముసలావిడ ఉండటాన్ని ట్రైలర్ చూపించారు. కథను పెద్దగా రివీల్ చేయనప్పటికీ సిరీస్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తోంది.
స్నేక్ అండ్ ల్యాడర్స్ (Snake And Ladders)
అమెజాన్ ప్రైమ్‌లో మరో థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ ఈ వారం రాబోతోంది. ‘స్నేక్ అండ్ ల్యాడర్స్’ అనే సిరీస్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 18వ తేదీ నుంచి తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. నవీన్ చంద్ర, ముత్తుకుమార్, నందా, మనోజ్ భారతీరాజా ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. భరత్, మురళీధరన్, అశోక్ వీరప్పన్, కమలా ఆల్కెమిస్ ఎపిసోడ్స్ వారిగా దర్శకత్వం వహించారు. నలుగురు డేరింగ్ పిల్లల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ప్లాట్ ఏంటంటే ‘ఓ ప్రమాదాన్ని దాచి పెట్టడానికి నలుగురు పిల్లలు చేసిన ప్రయత్నం మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుంది. పోలీసులు, దొంగలు వారి వెంట పడతారు. వాళ్ల నుంచి ఈ నలుగురు పిల్లలు ఎలా తప్పించుకుంటారు? చివరికి వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అన్నది స్టోరీ.
కరెన్సీ నగర్ (Currency Nagar)
గతేడాది డిసెంబర్లో రిలీజైన ‘కరెన్సీ నగర్‘ చిత్రం ఈ వారం ఓటీటీలోకి వచ్చింది. అక్టోబర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. వెన్నెల కుమార్ పోతేపల్లి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందినీ, సుదర్శన్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్లాట్ ఏంటంటే ‘సత్యకు రూ.5 లక్షలు అవసరమవుతాయి. దొంగతనం చేసైనా ఆ డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. మాట్లాడే పెట్టెలో బంగారం ఉందని తెలుసుకొని దానిని ఎత్తుకెళ్తాడు. అయితే ఆ పెట్టె సత్యతో మూడు కథలు చెబుతుంది. ఆ కథలు విని సత్య ఏం చేశాడు?’ అన్నది స్టోరీ.
క్రైమ్ రీల్ (Crime Reel)
బిగ్‌బాస్ సీజన్ 2 బ్యూటీ సంజన అన్నే హీరోయిన్గా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘క్రైమ్ రీల్‘. భరత్, సిరి చౌదరితోపాటు జబర్ధస్థ్ అభి కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది జూలైలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 13 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ఒక అమాయకురాలైన అమ్మాయి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం మెుదలుపెడుతుంది. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో వచ్చే ట్రెండ్స్ ఫాలో అవ్వడం, వాటిలో పాల్గొనడం చేస్తుంది. దీంతో హీరోయిన్ కావాలన్న కల ఆమెలో మెుదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సోషల్ మీడియా రీల్స్ వల్ల ఆమెకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?’ అన్నది స్టోరీ.
మిల్లర్స్ గర్ల్ (Millers Girl)
హాలీవుడ్ చిత్రాలను ఇష్టపడేవారి కోసం ఈ వారం ఓ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా అక్టోబర్ 17 నుంచి ‘మిల్లర్స్ గర్ల్’ ప్రసారం అవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో ఈ మూవీని వీక్షించవచ్చు. ఇందులో మార్టిన్ ఫ్రెమన్, జెన్నా ఒర్టెగా, బషీర్ సలాహుద్దీన్, గిడియన్ అడ్లోన్, డగ్మారా డొమిన్జిక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జేడ్ హాలీ బార్లెట్ దర్శకత్వం వహించారు. ధనవంతురాలైన ఓ టీనేజ్ అమ్మాయి చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. క్రియేటివ్ రైటింగ్ నేర్పించేందుకు వచ్చిన వ్యక్తితో ఆమె పరిచయం, ఈ క్రమంలో ఎదురయ్యే పరిస్థితులతో ఈ మూవీ ఉంటుంది.
మత్తు వదలరా 2 (Mathu vadalara 2)
గతవారం కూడా పలు ఆసక్తికర సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిని ఇప్పటికీ చూడకుంటే ఈ వీకెండ్లో ప్లాన్ చేయండి. ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘మత్తు వదలరా 2’ అక్టోబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్ ఏంటంటే ‘డెలీవరీ బాయ్ ఏజెంట్స్ బాబు (శ్రీ సింహా), యేసుబాబు (సత్య) డబ్బులు సరిపోకా స్పెషల్ ఏజెంట్స్‌గా మారతారు. ఓ కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఏంటా కేసు? వారు చేసిన పొరపాటు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అండర్ కవర్ ఏజెంట్ నిధి (ఫరియా అబ్దుల్లా) వారికి ఎలా సాయపడింది?’ అన్నది స్టోరీ.
గొర్రె పురాణం (Gorre Puranam)
సుహాస్ నటించిన రీసెంట్ చిత్రం ‘గొర్రె పురాణం’ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. సెప్టెంబర్ 20న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంది. కాగా, ఆక్టోబర్ 10 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. థియేటర్లలో మిస్సయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను కుంటుంబంతో కలిసి చూసేయచ్చు. ప్లాట్ ఏంటంటే ‘బిర్యానీ చేసుకుందామని ఒక ముస్లిం వ్యక్తి కొనుగోలు చేసిన గొర్రె తప్పించుకొని గ్రామ దేవత గుడిలో దూరుతుంది. అక్కడ కల్లు తాగి జట్కా ఇవ్వడంతో దాన్ని తామే బలిస్తామని హిందువులు పట్టుబడతారు. ఈ వ్యవహారం రెండు మతాల మధ్య చిచ్చుపెట్టడంతో పోలీసులు గొర్రెను అరెస్టు చేస్తారు. రవి (సుహాస్) ఉన్న సెల్లో బంధిస్తారు. ఇంతకీ రవి ఎవరు? అతడు చేసిన హత్యకు గొర్రెకు సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ.
పైలం పిలగా (Pailam Pilaga)
సాయితేజ, పావని కరణం జంటగా నటించిన చిత్రం ‘పైలం పిలగా‘. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈటీవీ విన్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘శివ దుబాయ్ వెళ్లి బాగా సెటిల్ కావాలని నిర్ణయించుకుంటాడు. పాస్‌పోర్టు, ఉద్యోగం కోసం అతడికి రూ.2 లక్షలు అవసరం అవుతాయి. దీంతో గుట్టపై ఉన్న స్థలాన్ని అమ్మేందుకు యత్నించగా ఎవరు ముందుకు రారు. కానీ మరుసటి రోజు పోటీపడి మరి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. పనికిరాని గుట్టను కొనేందుకు వారు ఎందుకు పోటీ పడ్డారు? శివ కోరిక నెరవేరిందా? లేదా?’ అన్నది స్టోరీ.
శబరి (Sabari)
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అక్టోబర్ 11 నుంచి సన్‌నెక్ట్స్ ఓటీటీలో ఐదు భాషల్లో స్ట్రీమింగ్కు వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘సంజనా (వరలక్ష్మీ) భర్తను వదిలేసి కూతురితో ముంబయి నుంచి వైజాగ్ వస్తుంది. అక్కడ ఓ కార్పొరేట్ కంపెనీ జుంబా డ్యాన్సర్‌గా చేరుతుంది. అయితే సంజనాను చంపేందుకు సూర్య (మైమ్ గోపి) ప్రయత్నిస్తాడు. ఇంతకీ సూర్య ఎవరు? భర్త అరవింద్‌తో సంజనా ఎందుకు విడిపోయింది? కిడ్నాపైన కూతుర్ని సంజనా ఎలా కాపాడుకుంది?’ అన్నది కథ.