నటీనటులు : సుహాస్, సంకీర్తన విపిన్, మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, ఆచార్య శ్రీకాంత్ తదితరులు
రచన, దర్శకత్వం : సందీప్ రెడ్డి బండ్ల
సంగీతం : విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్
నిర్మాతలు : దిల్ రాజు, హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి
విడుదల తేదీ: అక్టోబర్ 12, 2024
యంగ్ హీరో సుహాస్ వరుసగా చిత్రాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన లేటెస్ట్ చిత్రం ‘జనక అయితే గనక’. ఇందులో సంకీర్తన హీరోయిన్‌గా చేసింది. దిల్‌రాజు ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. సందీప్ బండ్ల దర్శకత్వం వహించారు. అక్టోబరు 12న ఈ మూవీ రిలీజ్ కానుండగా రెండ్రోజుల ముందే ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? సుహాస్‌కు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
ప్రసాద్ (సుహాస్) మధ్య తరగతి వ్యక్తి. తండ్రి తనకు బెస్ట్ ఇవ్వలేకపోవడంతో తాను మాత్రం తన పిల్లలకి అన్నీ విషయాల్లో ది బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాడు. రూ.30 వేల జీతానికి పని చేసే ప్రసాద్ ది బెస్ట్ ఇచ్చే స్థోమత లేకపోవడంతో పెళ్లై రెండేళ్లు అవుతున్నా పిల్లలు వద్దనుకుంటాడు. ప్రసాద్ భార్య (సంగీత విపిన్) కూాడా ఇందుకు అంగీకరిస్తుంది. ప్రసాద్ తండ్రి (గోపరాజు రమణ) కూడా ఈ విషయంలో సైలెంట్ అయిపోతాడు. అయితే అనూహ్యంగా ప్రసాద్ భార్యకి ప్రెగ్నెన్సీ వస్తుంది. దీంతో కండోమ్ సరిగ్గా పని చేయలేదని భావించిన ప్రసాద్ సదరు కంపెనీపై కేసు వేస్తాడు. తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంది? ప్రసాద్ లైఫ్‌లో వచ్చిన మార్పులు ఏంటి? ఈ కేసు ప్రసాద్ గెలిచాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
మధ్యతరగతి హీరో పాత్రలో మరోమారు సుహాస్ అదరగొట్టాడు. తన నటనతో ప్రేక్షకులను మరోసారి మెప్పించేశాడు. పిల్లలు వద్దు అని మంకు పట్టు పట్టిన వాడు తండ్రైతే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రసాద్ భార్య పాత్రలో సంకీర్తన అద్భుత నటన కనబరిచింది. భర్త చెప్పిన మాటను జవదాటని ఇల్లాలిగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ పాత్రలు సైతం మెప్పిస్తాయి. నటీనటులు అందరూ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
కథ విషయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల వంద మార్కులు కొట్టేశాడు. రొటిన్ సినిమాలకు భిన్నంగా కొత్తగా మూవీని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. సాధారణ మధ్యతరగతి వాడి బతుకు ఎలా ఉంటుంది? పెళ్లైన తరువాత వాడు పడే తిప్పల్ని, ఖర్చుల్ని లెక్కలతో సహా కళ్లకి కట్టారు. అయితే బిడ్డ కడుపులో పడ్డాక వచ్చే కొన్ని సన్నివేశాలను హృదయానికి హత్తుకునేలా చూపించారు. పిల్లలు వద్దనుకునే జంటకు ఈ కథ బాగా కనెక్ట్ అయ్యేలా తీశారు. అటు కోర్టు సన్నివేశాలను సైతం ఎంతో సరదాగా తెరకెక్కించి ఆడియన్స్‌కు గిలిగింతలు పెట్టారు దర్శకుడు. కొన్ని కోర్టు సీన్లు, పిల్లల ఖర్చుల విషయంలో లాజిక్‌లు మిస్ అయినా కామెడీతో వాటిని నెట్టుకొచ్చేశారు. ఊహాకందేలా కథనం సాగడం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్యం సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్
- కథలో కొత్తదనం
- సుహాస్ నటన
- కామెడీ
- సంగీతం
మైనస్ పాయింట్స్
- మెరుపులు లేకపోవడం
- ఊహాజనితంగా స్టోరీ సాగడం