ఒకప్పుడు టాలీవుడ్ అనగానే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌స్టార్ కృష్ణ గుర్తుకువచ్చేవారు. కానీ చిరంజీవి (Chiranjeevi) రాకతో తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్‌కు ఎన్నో సూపర్ హిట్స్ అందించిన చిరు.. ఇండస్ట్రీలో అగ్రహీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తద్వారా తన ఫ్యామిలీలోని యువతరానికి ఇండస్ట్రీ తలుపులు తెరిచాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగా హీరోల హవా నడుస్తోంది. ప్రతీ ఏడాది మెగా హీరోల నుంచి కనీసం ఒక సినిమా అయినా రావాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌ను శాసిస్తున్న మెగా హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
పవన్ కల్యాణ్
చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరిగా క్రేజ్ సంపాదించాడు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (1996) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్.. సుస్వాగతం, తొలి ప్రేమ, ఖుషీ మూవీలతో అగ్రహీరోల సరసన చేరిపోయాడు. రీసెంట్‌గా పవన్ తీసిన వకీల్ సాబ్ (Vakeel saab), భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహర వీర మల్లు సినిమా షూటింగ్‌లలో పవన్ బిజీగా ఉన్నాడు.
రామ్‌చరణ్
చిరు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్‌చరణ్ (Ram Charan).. ఆర్‌ఆర్‌ఆర్ (RRR) చిత్రంతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. మెుదట చిరుత సినిమా ద్వారా చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మగధీర సినిమాతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రంగస్థలం (Rangasthalam) సినిమాతో చెర్రీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దానిని ఆర్‌ఆర్‌ఆర్ మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ నటిస్తున్నాడు. దాని తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్ సినిమా ఉండనుంది.
అల్లుఅర్జున్
చిరు మేనల్లుడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా అల్లుఅర్జున్ (Allu Arjun) సినిమాల్లోకి వచ్చారు. తొలి సినిమా ‘గంగోత్రి’తో బన్ని మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత వచ్చిన ఆర్య, బన్నీ, దేశముదురు చిత్రాలతో హీరోగా అల్లుఅర్జున్ స్థిరపడ్డారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమాతో బన్నీ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తెలుగు హీరోల్లో బన్నీ తొలిస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) షూటింగ్‌లో బన్నీ బిజీబిజీగా గడుపుతున్నాడు.
సాయిధరమ్ తేజ్
చిరంజీవి సోదరి కుమారుడైన సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా మెగా మేనల్లుడుగానే ఇండస్ట్రీ తలుపు తట్టాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ (2014) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, చిత్ర లహారి సినిమాల ద్వారా సూపర్ హిట్స్ అందుకున్నారు. సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వరణ్ తేజ్
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడిగా వరణ్ తేజ్(Varun Tej) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం ‘ముకుంద’తో తేజ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తేజ్ హీరోగా చేసిన కంచె, అంతరిక్షం, తొలిప్రేమ, ఫిదా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం తేజ్ VT13, గాంధీవదారి అర్జున సినిమాల్లో నటిస్తున్నాడు.
పంజా వైష్ణవ్ తేజ్
పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej) కూడా చిరు సోదరి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమా ఉప్పెనతోనే ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొండపొలం మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే రీసెంట్‌గా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా వైష్ణవ్‌కు షాక్ ఇచ్చింది. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అల్లు శిరీష్
చిరు మేనల్లుడిగా, బన్నీ తమ్ముడిగా అల్లు శిరీష్ (Allu Sirish) సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తొలి చిత్రం గౌరవంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్… ఒక క్షణం, ABCD, కొత్త జంట సినిమాలతో ఆకట్టుకున్నాడు. శిరీష్ చేసిన శ్రీరస్తూ శుభమస్తూ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. అయితే శిరీష్ లేటెస్ మూవీ ఊర్వశివో రాక్షసివో చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
కళ్యాణ్ దేవ్
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. విజేత సినిమా ద్వారా తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణ్ దేవ్ పర్వాలేదనిపించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సూపర్ మచ్చి, కిన్నెర సాని చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం