తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)కు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయన్ను అభిమానులు ప్రేమిస్తుంటారు. టాలీవుడ్లో రజనీకి మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. అటువంటి రజనీకాంత్‌పై ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ (K.S. Ravi Kumar) సంచలన ఆరోపణలు చేశారు. తన సినిమా ఫ్లాప్ కావడానికి కారణం రజనీ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కోలివుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘రజనీ.. గందరగోళం చేసేశారు’
సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘లింగ‘ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తాజాగా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పరాజయం గురించి దర్శకుడు మాట్లాడారు. ‘లింగ ఎడిటింగ్ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ జోక్యం చేసుకున్నారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్‌గా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు’ అని రవి కుమార్ కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మూడు చిత్రాలకు వర్క్!
దర్శకుడు కె.ఎస్. రవి కుమార్‌కు కోలీవుడ్‌లో మంచి గుర్తింపే ఉంది. అటు రజనీకాంత్‌తో కూడా ఆయన మంచి సంబంధాలే కలిగి ఉన్నారు. ‘లింగ’కు ముందు కూడా ఆయన రజనీతో పనిచేసారు. ‘ముత్తు’, ‘నరసింహా’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. అనంతరం వీరి కాంబోలో 2014లో ‘లింగ’ సినిమా వచ్చింది. సందేశాత్మక కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీలో రజనీ ద్విపాత్రాభినయం చేశారు. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.120-130 కోట్లు వసూలు చేసింది.
33 ఏళ్ల తర్వాత మణిరత్నంతో..!
రజనీకాంత్ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ వార్త బయటకొచ్చింది. స్టార్ డైరెక్టర్ మణిరత్నంలో ఆయన నటించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. 33 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబోలో 1991లో ‘దళపతి’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇద్దకూ కలిసి సినిమా చేయలేదు. తాజా ప్రాజెక్ట్ కోసం రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చని కోలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
అస్వస్థతకు గురై కోలుకున్న రజనీ!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అస్వస్థకు గురై కోలుకున్నారు. సెప్టెంబర్ 30న ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని అక్టోబర్ 3 రాత్రి డిశ్చార్జ్ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని రజనీకి సూచించారు. దీంతో ప్రస్తుతం కుటుంబ సమక్షంలో రజని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని షూటింగ్లో పాల్గొనాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
దసరా బరిలో రజనీ చిత్రం
రజనీ కాంత్ నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’ ఈ వారంలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ‘జై భీమ్’ వంటి సోషల్ మెసేజ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల (Vettaiyan Release Date) కానుంది. జైలర్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రజనీ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో వేట్టయాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
‘కూలీ’లో స్టార్ క్యాస్ట్!
ప్రస్తుతం రజనీకాంత్ చేతిలో ‘కూలీ’ అనే మరో బిగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. 171 చిత్రంగా ‘కూలీ’ (Coolie Movie) రూపుదిద్దుకుంటోంది. ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి వరుస హిట్స్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సహజంగానే ‘కూలి’పై అంచనాలు ఏర్పడ్డాయి. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘కూలీ నెంబర్ 1421’ దేవాగా రజనీకాంత్ కనిపించనున్నారు. ఇందులో టాలీవుడ్ దిగ్గజ నటుడు నాగార్జున ఓ స్పెషల్ పాత్ర చేస్తున్నాడు. సైమన్ అనే క్రూయల్ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూాడా ఇందులో నటిస్తున్నాడు. అలాగే సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, సత్యరాజ్ వంటి పాపులర్ నటులు ఈ బిగ్ ప్రాజెక్టులో భాగమయ్యారు.