భారతీయ చిత్ర పరిశ్రమలో మరో బిగ్ ఫైట్ లాక్ అయ్యింది. ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారు. సాధారణంగా ఏ రెండు చిన్న హీరోల సినిమాలు రిలీజైనా అందరి దృష్టి వాటిపైనే ఉంటుంది. ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు ఫ్లాప్ టాక్‌తో సరిపెట్టుకుంటారు? అని ప్రతీ ఒక్కరు ఆసక్తిగా గమనిస్తుంటారు. అలాంటిది ఇద్దరు అగ్ర కథానాయకులు తలపడితే చిత్ర సీమలో ఇక ఏ స్థాయి అటెన్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? అవి బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు ఢీకొట్టబోతున్నాయి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
రజనీకాంత్ vs సూర్య
తమిళ పరిశ్రమలో దసరాకు పెద్ద యుద్ధమే జరగబోతోంది. రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’ (Vettaiyan), సూర్య (Suriya) నటిస్తున్న ‘కంగువా’ (Kanguva) చిత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టబోతున్నాయి. సూర్య చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. మరోవైపు అంతకుముందే ఆ డేట్‌కు రజనీకాంత్ ఫిల్మ్ వేట్టయాన్‌ను మేకర్స్ లాక్ చేశారు. దీంతో ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య భీకర పోరు తప్పదని ఇప్పటి నుంచే ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ బిగ్‌ఫైట్‌లో విజయం తమదంటే తమదని ఫ్యాన్స్ నెట్టింట సవాలు విసురుకుంటున్నారు.
భారీ తారాగణం
సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘కంగువా’ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. అజిత్‌తో ‘వేదాలం’, ‘వివేగం’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన శివ.. తొలిసారి సూర్యతో కలిసి పనిచేస్తుండటంతో తమిళనాట ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. పైగా ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియల్ ప్రతీనాయకుడి పాత్రను పోషించాడు. హీరోయిన్‌గా గ్లామర్ డాల్ దిశా పటానీ చేసింది. అలాగే ప్రకాష్ రాజ్, జగపతిబాబు, డైరెక్టర్ కే.ఎస్. రవికుమార్ కీలకమైన రోల్స్‌లో కనిపించనున్నారు. ప్రముఖ కమెడియన్ యోగిబాబు సైతం ఓ ముఖ్యమైన పాత్రతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో రజనీకాంత్‌కు గట్టి సవాలు తప్పదని సూర్య ఫ్యాన్స్ అంటున్నారు.
గిరిజన యోధుడిగా ‘సూర్య’
కోలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా కంగువా నిలిచింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.350 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్. అయితే ఈ మూవీ పవర్ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య గిరిజన యోధుడిలా కనిపిస్తాడట. 1678 నాటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నటుడుస్తుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. అయితే కథకు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను కూడా జోడించినట్లు కోలివుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మూవీ విడుదల తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
రజనీకాంత్- అమితాబ్
ఇక రజనీకాంత్ హీరోగా చేసిన ‘వేట్టయాన్’ సినిమాకి ‘జై భీమ్’ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. 32 ఏళ్ల తర్వాత రజనితో కలిసి ఆయన యాక్ట్ చేస్తున్నారు. దగ్గుబాటి రానా, ఫహాద్ ఫాజిల్, రానా, రితికా సింగ్, రావు రమేష్ ఇతర ముఖ్య తారాగణంగా ఉన్నారు. ఒక రిటైర్ అయిన పోలీసు ఆఫీసర్.. సమాజంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. రజనీ మార్క్ యాక్షన్ ఈ మూవీలో ఉంటుందని ప్రచార చిత్రాలను బట్టే తెలుస్తోంది. దీంతో ‘వేట్టయాన్’ చిత్రంపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి మరి అక్టోబర్ 10న జరగబోయే ఈ సంగ్రామంలో విజయం ఎవరిదన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
అటు టాలీవుడ్‌లోనూ..
టాలీవుడ్‌లోనూ ఇద్దరు స్టార్ హీరోలు తలపబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ vs రామ్‌చరణ్ బాక్సాఫీస్ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బన్నీ హీరోగా చేస్తున్న ‘ పుష్ప 2’ రిలీజ్ డేట్ ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కు మారింది. మరోవైపు రామ్‌చరణ్-శంకర్ కాంబోలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్’ మూవీ కూడా డిసెంబర్‌లో విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత దిల్‌రాజు కూడా డిసెంబర్ మెుదటి వారంలోనే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ చేయాలని భావిస్తే బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదు.