సూర్య కుమార్ యాదవ్ ఆట అద్భుతం. ఆ షాట్స్ చూడాలంటే రెండు కళ్లు చాలవు. మైదానానికి అన్ని వైపులా షాట్స్ కొట్టగలిగే Mr 360. ఇవన్నీ రెండు నెలల క్రితం వరకు ముచ్చట్లు. ఇప్పుడు అంతా మారిపోయింది. సూర్య వన్డేల్లో నిరాశ పరుస్తుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. అంతేనా, ఏకంగా అతడిని జట్టులో నుంచి తీసేయ్యాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
నంబర్ కాదు స్కోరు
9,8,4,34,4,31,14,0,0 ఇది ఫోన్ నంబర్ కాదు. సూర్య కుమార్ యాదవ్ ఆడిన వరుస వన్డేల్లో స్కోరు. ఏ ఒక్క మ్యాచ్‌లోనూ తన స్థాయికి తగిన ఆటతీరు కనబర్చలేదు. అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. దాదాపు 10 వన్డేల్లో చెప్పుకోదగిన స్కోరు చేయలేదు స్కై. వరుసగా విఫలమవుతూ టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు.
వరుసగా డకౌట్లు
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సిరీస్‌లో సూర్య కుమార్‌కు అవకాశం వచ్చింది. శ్రేయస్ అయ్యర్ గాయంతో దూరమైన కారణంగా రెండు వన్డేల్లోనూ ఛాన్స్ ఇచ్చారు. కానీ, సూర్య సద్వినియోగం చేసుకోలేదు. రెండు మ్యాచుల్లోనూ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. రెండుసార్లు వికెట్ల ముందు దొరికిపోయాడు స్కై.
నెటిజన్ల ఫైర్
క్రీజులోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్న స్కైపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రెండో వన్డేలో ఔట్ అయిన వెంటనే ట్విటర్‌లో #suryakumaryadav పేరుతో ట్రెండింగ్ చేశారు. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
“ సూర్య కుమార్‌కు ఏమయ్యింది? ఎందుకు సరిగా ఆడలేకపోతున్నాడు. కేవలం రెండు ఇన్నింగ్స్‌లు ఆడినంత మాత్రాన మిస్టర్ 360 అయిపోరు. అతడిని వన్డే జట్టులో నుంచి తొలగించండి” అనే కామెంట్లు వస్తున్నాయి.
సంజూతో పోలిక
భారత జట్టులో ఏ మిడిలార్డర్ ఆడకపోయినా గుర్తొచ్చేది ఒకే ఒక్క పేరు సంజూ శాంసన్. వన్డేల్లో సంజూ నిలకడగా రాణిస్తున్నాడు. కచ్చితంగా రెండంకెల స్కోరు సాధించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించేవాడు. దీంతో మళ్లీ సంజూకి అవకాశాలు కల్పించాలనే వాదన తెరమీదకు వచ్చింది.
టీ20ల్లోనేనా ప్రతాపం
సూర్య కుమార్ యాదవ్‌కు టీ20లో తిరుగులేని రికార్డులు ఉన్నాయి. పొట్టి క్రికెట్‌లో చెలరేగిన సందర్భాలు చాలా ఎక్కువే. అయితే, దాన్ని వన్డేలకు కొనసాగించడం లేదు. ఫలితంగా అభిమానులు అక్కడేనా ప్రతాపం వన్డేల్లో ఆడలేవా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
6వ స్థానంలో బ్యాటింగ్
స్కై ప్రస్తుతం 4వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నాడు. హార్దిక్ పాండ్యాను 4వ ప్లేస్‌కు పంపించి 6లో సూర్యని ఆడిస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే 6వ వికెట్ పడే సరికి కేవలం 15-20 ఓవర్లు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల సూర్య మెరుపులు మెరిపించవచ్చు అనే భావన ఉంది.