‘RRR’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఈ క్రేజీ కాంబో చిత్రం ఎప్పుడు మెుదలవుతుందా అని యావత్ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే వచ్చిన అప్‌డేట్స్ సైతం ఫ్యాన్స్‌ను తెగ ఖుషి చేశాయి. మహేష్ లుక్ ఇదేనంటూ బయటకొచ్చిన ఫొటోలు సైతం అందర్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో జక్కన్న బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
లొకేషన్‌లో వేటలో జక్కన్న
మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రబృందం దృష్టంతా #SSMB29కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులపైనే ఉంది. ఈ నేపథ్యంలో రాజమౌళి తాజాగా పంచుకున్న ఓ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎడారి ప్రాంతంలో తిరుగుతున్న ఓ ఫొటోను రాజమౌళి షేర్ చేశారు. ‘కనుగొనడం కోసం తిరుగుతున్నా’ అంటూ దానికి క్యాప్షన్ పెట్టారు. దీంతో ఆయన మహేష్ సినిమా కోసం లొకేషన్స్ సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అప్‌డేట్ షేర్ చేయాలని అభిమానులు కోరుతున్నారు.
ఆ ప్లేస్ కన్ఫార్మ్ అయినట్లేనా!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నాడు. కెన్యాలోని నేషనల్ పార్కులో రాజమౌళి, కార్తికేయలు చక్కర్లు కొడుతున్నారు. అక్కడి అటవీ ప్రాంతాన్ని, జంతువులు ఎక్కువగా ఉండే ప్రదేశాలను సెర్చ్ చేస్తున్నారు. తాజాగా రాజమౌళి షేర్ చేసిన ఫొటో సైతం అక్కడ తీసిందే. దానితో పాటు మరో వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. దర్శకధీరుడు రాజమౌళి ఓ సవారి వెహికల్‌లో ప్రయాణిస్తూ కనిపించాడు. నేషనల్ పార్కులో ప్రయాణిస్తూ అక్కడి లొకేషన్స్‌ను రాజమౌళి పరిశీలించడం గమనించవచ్చు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథ కావడంతో కెన్యాలోని నేషనల్ పార్కులోనే కొంత భాగం షూట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఏఐ టెక్నాలజీ వినియోగం!
గ్లోబల్ స్థాయిలో రూపొందున్న ‘SSMB 29’ ప్రాజెక్ట్ కోసం జక్కన్న ఏఐ టెక్నాలజీని వినియోగించబోతున్నట్లు సమాచారం. దీనికోసం ప్రత్యేక శిక్షణ సైతం తీసుకున్నట్లు టాక్. సినిమాలోని కొన్ని పాత్రలు, జంతువుల కోసం ఆయన ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారట. మాములుగానే రాజమౌళి సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్‌లు భారీస్థాయిలో ఉంటాయి. ఏఐ కలయిక నేపథ్యంలో ఈ సినిమాలో అవి రెట్టింపుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది.
‘కాపీ కొట్టడం తప్పుకాదు’
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. అటువంటి జక్కన్నపై సినిమా రిలీజైన ప్రతీసారి కొన్ని విమర్శలు వస్తుంటాయి. హాలీవుడ్ చిత్రాల్లోని సీన్స్‌ను రాజమౌళి కాపీ కొట్టారని నెట్టింట ప్రచారం జరుగుతుంటుంది. ఇదిగో ప్రూఫ్స్‌ను అంటూ కొన్ని వీడియోలను సైతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తుంటారు. దీనిపై స్పందించిన రాజమౌళి తాను హాలీవుడ్ సినిమాలను కాపీ చేస్తానన్న విషయాన్ని అంగీకరించారు. ‘చిన్నతనం నుంచీ మనపై హాలీవుడ్ సినిమాల ప్రభావం ఉంటూనే ఉంటుంది. నా వరకు నేను మన సినిమాలు ఆ స్థాయిలో ఎందుకు ఉండవు అని ఆలోచిస్తూ ఉండేవాడిని. కాపీ చేసామంటున్న ప్రతి సారి మేం ఒరిజినల్ కంటే బాగా తీసాం. దీని వల్ల ఎవరికి నష్టం ఉండదు. అదే నేను ఓ తమిళ్ సినిమా నుంచో, మలయాళ సినిమా నుంచో కాపీ చేస్తే అది ఆ రైటర్‌కి, డైరెక్టర్‌కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి హాలీవుడ్ సినిమాల నుంచి ప్రేరణ పొందడం తప్పు అని నేను భావించడం లేదు’ అని సమర్థించుకున్నారు.
కథ.. ఆ నవలల ఆధారమేనా?
రాజమౌళి తండ్రి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ‘SSMB29’ సినిమాకు కథను అందిస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి & టీమ్ రెండు ఆఫ్రికా నవలల హక్కులను కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. విల్బర్ స్మిత్ రాసిన రెండు నవలలను వారు కొనుగోలు చేసినట్లు జోరుగా టాక్ వినిపించింది. ఇప్పటికే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ‘SSMB29’ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ ఉంది. దీంతో ఆ నవలల ఆధారంగానే రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారా? అన్న సందేహాం కలుగుతోంది. ఇందులో నిజానిజాలు ఎంతో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Celebrities Featured Articles Movie News
Prabhas: ప్రభాస్ పెళ్లిపై మనసులో మాట చెప్పిన తమన్నా!