సాధారణంగా సినిమా అంటే ముందుగా హీరో, హీరోయిన్, దర్శకుడే గుర్తుకు వస్తారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఇతర తారాగణం, టెక్నికల్ టీమ్‌పై అందరి దృష్టి పోతుంది. చివర్లో ఆ సినిమా నిర్మాత ఎవరు అని సినీ లవర్స్ తెలుసుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఒక సినిమా నిర్మాణంలో ఎక్కువగా కష్టపడేది నిర్మాతే. సినిమా బాగా రావడం కోసం ఖర్చులో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు హీరోను డైరెక్టర్‌ను ముందుకు తీసుకెళ్లేదే నిర్మాతలే. హీరోలు, డైరెక్టర్లకు ఈ సినిమా పోతే ఇంకోటి అనే ఆప్షన్ ఉంటుంది. కానీ నిర్మాతల పరిస్థితి అలా కాదు. ఎక్కడెక్కడి నుంచే డబ్బు కూడగట్టి తీసిన ఫిల్మ్ ఫ్లాప్ అయితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. అంతటి రిస్క్ కలిగిన నిర్మాణ రంగంలోకి స్టార్ల కుమార్తెలు వచ్చేస్తున్నారు. కుమారులు హీరోగా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో తాము ఏమాత్రం తక్కువ కాదని నిర్మాణ రంగంవైపు అడుగులు వేస్తున్నారు. యంగ్ ప్రొడ్యుసర్స్‌గా సత్తా చాటేందుకు సై అంటున్నారు. వారెవరో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
తేజస్విని నందమూరి
టాలీవుడ్‌లో నటుడిగా బాలకృష్ణ (Bala Krishna) చెరగని ముద్రవేశారు. యంగ్ హీరోలతో సమానంగా వరుస చిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన నట వారసత్వాన్ని మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) తీసుకొని టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాతోనే బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని (Tejaswini Nandamuri) నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. మోక్షజ్ఞ తొలి సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరించనున్నారు. లెజెండ్ ప్రొడక్షన్స్‌పై ఆమె దీనిని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది.
నిహారిక కొణిదెల
మెగా కుటుంబం నుంచి ఎందరో హీరోలు వచ్చి అలరిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని భారతీయ సినిమా ఖ్యాతిని పెంచుతున్నారు. ఇప్పుడు నిర్మాణ రంగంలోనూ సత్తా చాటేందుకు మెగా ఫ్యామిలీ వారసురాళ్లు రెడీ అయ్యారు. నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల (Niharika Konidela) ఇటీవల నిర్మాతగా మారింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించింది. దాని ద్వారా తొలిసారి ‘కమిటీ కుర్రోళ్లు’ అనే చిత్రాన్ని నిర్మించింది. వైవిధ్యభరితమైన కథతో, కొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మించి ప్రశంసలు దక్కించుకుంది. రూ.6 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కమిటీ కుర్రోళ్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.18 కోట్లకుపైగా వసూలు చేసింది.
సుస్మితా కొణిదెల
మెగా కుటుంబం నుంచి మరో నిర్మాత కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతోంది. చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల (Sushmita Konidela) ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ అంటూ కొత్త నిర్మాణ సంస్థను స్థాపించారు. దీనిపై తొలి చిత్రమే తన తండ్రితో తీయనున్నట్లు ఆమె ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా సుస్మిత కొణిదెలకు మంచి పేరుంది. చిరంజీవి హీరోగా నటించిన పలు చిత్రాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు నిర్మాణ రంగంలోనూ ఆమె ప్రతిభ చూపడం ఖాయమని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
అశ్వనీదత్ వారసురాళ్లు
టాలీవుడ్‌లో ‘వైజయంతీ మూవీస్’కు ప్రత్యేక స్థానం ఉంది. 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థ ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించింది. అశ్వనీదత్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం ఆయన కుమార్తెలు స్వప్న దత్ (Swapna Dutt), ప్రియాంక దత్ (Priyanka Dutt)లు సిద్ధమయ్యారు. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో ప్రపంచస్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. త్వరలోనే మరిన్ని సినిమాలు తీయనున్నట్లు తెలిపారు. అంతకముందు ‘స్వప్న సినిమా’, ‘త్రీ ఏంజెల్స్ స్టూడియో’, ‘ఎర్లీ మన్‌సూన్ టేల్స్’ వంటి సబ్ బ్యానర్లను ఏర్పాటు చేసి ‘మహానటి’, ‘సీతారామం’, ‘బాణం, ‘సారొచ్చారు’ వంటి హిట్ చిత్రాలను అశ్వని దత్ కుమార్తెలు నిర్మించారు.
ప్రసీద ఉప్పలపాటి
దిగ్గజ నటుడు కృష్ణం రాజు కుమార్తె, రెబల్ స్టార్ ప్రభాస్ సోదరి ప్రసీద ఉప్పలపాటి (Praseedha Uppalapati) సైతం నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ‘గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి దానితో ప్రభాస్ హీరోగా ‘రాధేశ్యామ్’ (Radheshyam)ను నిర్మించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
మంజులా ఘట్టమనేని
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి కూడా ఓ మహిళ నిర్మాత టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. కృష్ణ కుమార్తె, మహేష్ బాబు (Mahesh Babu) సోదరి అయిన మంజుల ఘట్టమనేని (Manjula Ghattamaneni) నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘షో’, ‘నాని’, ‘పోకిరి’, ‘ఏమాయ చేసావె’ వంటి చిత్రాలకు ప్రొడ్యూసర్‌గా వర్క్ చేశారు. ఆ తర్వాత నటిగాను మారి పలు చిత్రాల్లో పాత్రలు పోషించారు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?