హృదయకాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాలతో కడుపుబ్బ నవ్వించిన సంపుర్ణేష్ బాబు.. లీడ్ రోల్‌లో మార్టిన్ లూథర్ కింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్‌లో కమెడియన్ యోగి బాబు నటించిన సూపర్ హిట్ మూవీ ‘మండేలా’ సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా పూజ కొల్లూరు డైరెక్టర్‌గా పరిచయం అయింది. సంపూర్ణేష్ బాబు చాల రోజుల గ్యాప్ తర్వాత సినిమా చేయడంతో మార్టిన్ లూథర్ కింగ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అవుట్ అండ్ అవుడ్ కామెడీ సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా మండేలా చిత్రాన్ని మించి ఉందా? ఆ టైప్ కామెడీని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయిందా? వంటి అంశాలను ఇప్పుడు YouSay సమీక్షలో చూద్దాం.
కథ
ఉత్తరం, దక్షిణ వర్గాలుగా చీలిన పడమరపాడు గ్రామంలో ఆనాథగా స్మైల్( సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తుంటాడు. చెప్పులు కుట్టగా వచ్చిన చిల్లరను కూడబెట్టి చిన్న చెప్పుల షాపు పెట్టుకోవాలన్నది అతని కల. అయితే అతను కూడబెట్టిన డబ్బుల్ని ఎవరో దోచుకుంటారు. దీంతో తన కష్టార్జితాన్ని పోస్టాఫీసులో దాచుకోవలనుకుంటాడు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేని స్మైల్.. పోస్టాఫీస్‌లో పనిచేసే వసంత( శరణ్య ప్రదీప్) దగ్గరికి వెళ్లి సాయం చేయాలని కోరుతాడు. దీంతో స్మైల్‌కు మార్టిన్ లూథర్ కింగ్ అని ఓ కొత్త పేరు పెట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ వచ్చేలా చేస్తుంది. ఈక్రమంలో పడమరపాడులో ఎన్నికలు వస్తాయి. ఉత్తరం దిక్కు నాయకుడిగా జగ్గు( నరేష్), దక్షిణం దిక్కు నేతగా ‘లోకి'(వెంకటేష్ మహా) పోటీలో దిగుతారు. వీరిద్దరికీ సమాన ఓట్లు రానున్నట్లు సర్వేలో ముందే తెలుస్తుంది. ఈ క్రమంలో మార్టిన్ లూథర్ కింగ్‌కు ఓటు హక్కు వచ్చిందని తెలిసి.. అతన్ని ప్రసన్నం చేసుకునే పనిని ఇద్దరు మొదలు పెడుతారు. ఓటు హక్కు రావడంతో మార్టిన్ జీవితం ఎలా మారింది. జగ్గు, లోకిల వల్ల ఎలాంటి ఇబ్బుందులు ఎదుర్కొన్నాడు. ఊరికోసం తన ఓటు హక్కును ఎలా ఉపయోగించుకున్నాడు వంటి ఆసక్తికరమైన అంశాలను థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే?
సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే.. మరుగుదొడ్డి ఓపెనింగ్ సీన్, అక్కడ ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు ప్రజలు తలపడే సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి. పడమరపాడు గ్రామంలోని విభిన్నమైన ప్రజల వ్యక్తిత్వాల్ని పరిచయం చేసిన సన్నివేశాలు బాగున్నాయి. అక్కడి నుంచి స్మైల్ ప్రపంచంలోకి మెల్లగా కథ వెళ్తుంది. గ్రామ ప్రజలు అతనితో మెలిగే తీరు, ఎంతో కష్టపడి అతను సంపాదించిన డబ్బును ఎవరో దొంగిలించడం, పోస్టాఫీస్‌లో వసంత పరిచయం వంటి సీన్లు ఫన్నీగా ఉంటాయి. మార్టిన్ లూథర్ కింగ్ పాత్ర ద్వారా సమాజంలో ఉన్న అనేక అంశాలపై పంచ్‌లు వేసిన తీరు బాగుంది. ఊర్లో రాజకీయ నాయకుల మధ్య విభేదాల వల్ల ప్రజలు ఎలా బలి అవుతున్నారో సినిమాలో చూపించారు.
ఇక సెకండాఫ్ సీరియస్‌గా సాగుతుంది. కొంతవరకు ఎమోషనల్‌గా సాగుతుంది. తమిళ్‌లో మండేలా చిత్రం పూర్తి కామిక్ మార్గంలో వెళ్లి చివర్లో ఎమోషనల్ టచ్ ఇస్తుంది. అక్కడ బాగా కుదిరింది. అయితే మార్టిన్ లూథర్ కింగ్‌లో మాత్రం ఆ కన్‌క్లూజన్ కాస్త మిస్ అయింది. కింగ్‌కు ఓటు హక్కు రావడంతో అతని ఓటు కోసం సెకండాఫ్‌లో లోకి, జగ్గు పడే తంటాలు కొంతవరకు కామెడీ అనిపిస్తాయి. అయితే కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఎంతసేపు సినిమా ఇద్దరి నాయకుల మధ్యే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు దర్శకుడు సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నాడు ఓటు ప్రాధాన్యతనా? లేక రాజకీయ నాయకులను సైటైర్ చేయలనుకున్నారా? అనేది అర్థం కాదు. క్లైమాక్స్‌పై డైరెక్టర్ ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేది అనిపించింది.
ఎవరెలా చేశారంటే?
మార్టిన్ లూథర్ కింగ్ పాత్రలో సంపూర్ణేష్ బాబు ఒదిగిపోయాడు. పాత్రకు కావాల్సిన అమాయకపు నటనతో మెప్పించాడు. క్లీన్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. తనలో మంచి నటుడు ఉన్నాడని మరోసారి ఫ్రూవ్ చేశాడు. ఇక సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డ వెంకటేష్ మహా, నరేష్ తమ పర్ఫామెన్స్‌తో మెప్పించారు. నిజంగా ఊర్లోని పరిస్థితులను ప్రతిబింబింపజేశారు. ఇక సంపూర్ణేష్ బాబుకు మద్దతుగా నిలిచిన పోస్టాఫీస్ ఉద్యోగినిగా శరణ్య బాగా చేసింది. ఆ పాత్రకు న్యాయం చేసింది. పెద్దాయన పాత్ర చేసిన రాఘవన్ కూడా మెప్పించాడు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
పూజ కొల్లూరు డైరెక్టర్‌గా తనకు తొలి చిత్రమైనా… అనుభవం ఉన్న దర్శకురాలిగా సినిమాను బాగా తీసింది. గ్రౌండ్ లెవల్లో రాజకీయాలు, అక్కడ ఉండే పరిస్థితులను గమనించి తెరకెక్కించిన తీరు బాగుంది. కామెడీ, ఎమోషనల్ సీన్లు, క్లైమాక్స్ కన్‌క్లూజన్‌పై ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండు అనిపించింది.
టెక్నికల్‌గా..
నిర్మాణ విలువల పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. స్మరణ్ సాయి మ్యూజిక్ బాగుంది. అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. సినిమా ఎలివేషన్‌కు సాయపడింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్‌గాను వర్క్ చేసిన పూజ కోల్లూరు ఇంకాస్త ట్రిమ్ చేయాల్సి ఉంది. సాగదీత సీన్లపై కసరత్తు చేస్తే బాగుండేది. దీపక్ యరగెర సినిమాటోగ్రఫి.. సినిమా చూస్తున్నంత సేపూ ఊర్లో ఉన్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది.
బలాలు
సంపూర్ణేష్ బాబు నటన
ఫస్టాఫ్ కామెడీ
బలహీనతలు
సెకండాఫ్ సాగదీత సన్నివేశాలు
క్లైమాక్స్ కన్‌క్లూజన్
చివరగా: లాజిక్‌లు మనసులో పెట్టుకోకుండా వెళ్తే… మార్టిన్ లూథర్ కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు.