పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బాస్టర్ చిత్రం సలార్ పార్ట్ -1; సీజ్ ఫైర్’ (Salaar: Part 1 Ceasefire). గతేడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నిర్మాతలపై కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సలార్ 2: శౌర్యంగ పర్వం’ (Salaar 2- Shouryanga Parvam) కూడా రానుందని తొలి పార్ట్ క్రైమాక్స్‌లోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు. దీంతో రెండో భాగంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మెుదలవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సలార్ 2’కి సంబంధించి ఒకేసారి రెండు అప్డేట్స్ బయటకు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వరదరాజ మన్నార్ స్పెషల్ ఎపిసోడ్
‘సలార్ 2’ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుందని నటుడు బాబీ సింహా ఇటీవల ఓ ఇంటర్యూలో ప్రకటించాడు. తాజాగా కేరళ నటుడు పృథ్వీరాజ్ సుకుమాన్ (Prithviraj Sukumaran) కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘటించాడు. సలార్‌లో ప్రభాస్ స్నేహితుడిగా వరద రాజమన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ అదరగొట్టాడు. తాజాగా ‘ది గోట్ లైఫ్’ (The Goat Life) మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న పృథ్వీరాజ్ త్వరలోనే ‘సలార్ 2’ షూట్ మెుదలవుతుందని చెప్పాడు. ముందుగా వరదరాజమన్నార్ పాత్రకు సంబంధించి యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తారని స్పష్టం చేశాడు. అయితే ఈ స్పెషల్ ఎపిసోడ్‌లోనే వరదరాజ మన్నార్ గ్రాఫ్ చూపిస్తారని అంటున్నారు.
సెట్లోకి ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడంటే!
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)తో వరదరాజ మన్నార్ ఎపిసోడ్ పూర్తయ్యాక.. నటుడు బాబీ సింహా (Bobby Simha), శ్రియా రెడ్డి (Sriya Reddy), జగపతిబాబు (Jagapathi Babu)లపై కీలక సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ రెండు షెడ్యూల్స్ పూర్తైన తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సెట్లోకి అడుగుపెడతారని సమాచారం. ఈ మూవీ మూడో షెడ్యూల్ నుంచి ప్రభాస్ రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ స్క్రిప్ట్‌పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లా ‘సలార్ 2’..!
తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ‘సలార్ 2’ నిర్మాత విజయ్ కిరగందూర్ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ తర్వాత నుంచి ఈ సినిమా పార్ట్-2 షూటింగ్ ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 2025లో సినిమా రిలీజ్ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రముఖ హాలీవుడ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లా సలార్ పార్ట్ 2 ఉండనుందని ఆయన తెలిపారు. నిర్మాత వ్యాఖ్యలతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ‘సలార్ 2’.. తొలి భాగానికి మించి విజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు.
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్ బిజీ బిజీ..
ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి’ (Kalki 2898 AD), ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రాల షూటింగ్‌తో తీరిక లేకుండా గడుపుతున్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్’ (Spirit)ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇంత బిజీలో ప్రభాస్ ‘సలార్-2’కు ఎలా డేట్లు కేటాయించి వచ్చే ఏడాది సినిమా రిలీజయ్యేలా చూస్తాడో చూడాలి మరి.