ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘పుష్ప’ (Pushpa). పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా బన్నీని జాతీయ స్థాయి నటుడిగా తీర్చిదిద్దింది. ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని సైతం అల్లు అర్జున్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ రూపొందుతోంది. ‘పుష్ప 2’లోని టైటిల్ సాంగ్‌ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. అందులోని హుక్ స్టెప్ బాగా వైరల్ అవుతోంది. చాలా మంది ఈ స్టెప్‌పై రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నైజిరియన్ చేసిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
పుష్ప 2 మేనియా!
నోయల్ రాబిన్‌సన్ (Noel Robinson) అనే నైజీరియన్.. జర్మన్‌లో ఉంటూ డ్యాన్స్ రీల్స్ చేస్తూ ఉంటాడు. తద్వార మిలియన్లలో ఫాలోవర్లను సంపాదించాడు. రీసెంట్‌గా భారత్ పర్యటనకు వచ్చిన నోయల్.. ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణించాడు. ఈ సందర్భంగా ‘పుష్ప2‘ టైటిల్ సాంగ్‌లోని సింగిల్ లెగ్ స్టెప్ వేసి తోటి ప్రయాణికులను ఉర్రూతలూగించాడు. అటు స్థానికులు కూడా నోయల్‌ను ప్రోత్సహిస్తూ మూమెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను నోయల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఇది చూసి బన్నీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అల్లు అర్జున్ క్రేజ్ దేశ సరిహద్దులు దాటి ఎక్కడికో వెళ్లిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మెలోడి సాంగ్ వచ్చేస్తోంది!
‘పుష్ప 2’ టైటిల్ సాంగ్ ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఈ సారి సెకండ్ సాంగ్ కింద మెలోడీ పాటను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. గతంలో పుష్ప మూవీలో చేసిన ‘శ్రీవల్లీ’ సాంగ్.. ఎంతటి ఆదరణ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు సీక్వెల్‌లోనూ అలాంటి మ్యాజిక్‌నే రిపీట్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నారట. ఈ మెలోడీ పాటను త్వరలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో సాంగ్ కోసం ఇప్పటి నుంచే బన్నీ ఫ్యాన్స్ ఎదురు చూడటం మెుదలుపెట్టారు. కాగా, ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
రిలీజ్ ఎప్పుడంటే?
పుష్ప 2: ది రూల్ సినిమా.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. నార్త్ ఇండియా హిందీ హక్కుల్లోనూ ఇప్పటికే ఈ మూవీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ చిత్రాలను వెనక్కి తోసింది. కాగా, ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.