నటీనటులు: భరత్, వాణి భోజన్, కేఎస్ రవికుమార్, మీరా కృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు
దర్శకత్వం: ఎం. శక్తివేల్
మ్యూజిక్ డైరెక్టర్: ప్రసాద్ ఎస్ఎన్
సినిమాటోగ్రాఫర్: సురేష్ బాలా
ఎడిటర్: కలైవనన్.ఆర్
నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్
విడుదల తేదీ: 17-05-2024
ప్రేమిస్తే ఫేమ్ భరత్ హీరోగా నటించిన చిత్రం ‘మిరల్’. రెండేళ్ల క్రితం తమిళనాట విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఎం. శక్తివేల్ దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
హరి (భరత్), రమ (వాణీ భోజన్) ప్రేమ వివాహం చేసుకొని కొడుకుతో సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు రమకు పీడ కల రావడంతో ఊరులో ఉన్న కుల దైవానికి పూజా చేయించమని ఆమె తల్లి చెబుతుంది. దీంతో ఊరికి వెళ్లి పూజలు చేయిస్తారు. ఈ క్రమంలో హరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఓకే కావడంతో అర్ధరాత్రి ఫ్యామిలీతో కలిసి బయలుదేరతాడు. మెయిన్ రోడ్డులో వెళ్లాల్సిన వారి కారు ఓ కారణం చేత మరో రూట్‌లోకి వెళ్తుంది. అయితే ఆ రూట్‌లో ఆత్మ తిరుగుతుందని ఊరి ప్రజల నమ్మకం. అందుకని రాత్రి వేళ్లలో ఆ దారిలో ఎవరూ ప్రయాణించరు. అటువంటి మార్గంలో వెళ్లిన హరి ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? నిజంగానే ఆ మార్గంలో అతీత శక్తి ఉందా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
హీరో భరత్ ఎప్పటి లాగే తన నటనతో అదరగొట్టాడు. హరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. అటు నటి వాణి భోజన్.. భరత్‌తో పాటు సినిమాను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరు తమ నటనతో అదరగొట్టారు. తమ హావ భావాలతో ఎమోషనల్ సన్నివేశాలను చక్కగా పండించారు. KS రవికుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించి అలరించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిలో పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు ఎం. శక్తివేల్.. ఓ కుటుంబం చుట్టూ సాగే హార్రర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ ముందు వరకూ ఏదో జరుగుతోందన్న సస్పెన్స్‌ను మెయిన్‌టెన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కథ పరంగా చూస్తే రొటిన్ స్టోరీ అయినప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం చక్కటి పనితీరును కనబరిచాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్‌లో ఏదో జరిగిపోతుందని భావించిన ప్రేక్షకులకు చివర్లో వచ్చే ట్విస్ట్ ఊసూరుమనిపిస్తుంది. అప్పటివరకూ మెయిన్‌టెన్ చేసిన ఆసక్తి మెుత్తం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. క్లైమాక్స్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్లు మరీ సాగదీతగా అనిపిస్తాయి.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. చాలా సన్నివేశాల్లో నేపథ్యం సంగీతం భయపెడుతుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- భరత్, వాణీ భోజన్ నటన
- ఆసక్తికరంగా సాగే కథనం
- నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
- కథలో కొత్తదనం లేకపోవడం
- పేలవమైన క్లైమాక్స్
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!