ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ‘పుష్ప’ (Pushpa) మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాలో అద్భుత నటన కనబరిచి జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం సైతం అందుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా పుష్పరాజ్ ఖాతాలో మరో ఘనత వచ్చి చేరింది. ప్రస్తుతం దుబాయిలో పర్యటిస్తున్న బన్నీకి ప్రఖ్యాత టుస్సాడ్స్ మ్యూజియం (Madame Tussauds) వారు అపూర్వమైన ఘనతను అందించారు. బన్నీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘ఇదొక మైల్‌స్టోన్’
దుబాయ్‌లో మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds Dubai) మ్యూజియంలో నిర్వహించిన తన మైనపు (Wax statue) విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అల్లు అర్జున్ (Allu Arjun) తన ఫ్యామిలీతో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన తన సోషల్ మీడియాలో తన ప్రతిమతో దిగిన ఫొటోను పోస్టు చేశాడు. ‘ఇలాంటి ప్రముఖ (Madame Tussauds) మ్యూజియంలో విగ్రహం ఏర్పాటు చేయడం ప్రతి నటుడి జీవితంలో మైల్‌స్టోన్’ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు మ్యూజియం నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపాడు.
అల్లు అర్హ సందడి
ఈ కార్యక్రమానికి బన్నీ కూతురు అల్లు అర్హా (Allu Arha) కూడా హాజరై సందడి చేసింది. ఆ విగ్రహం పక్కన కూర్చొని ‘తగ్గేదేలే’ అంటూ పోజు ఇచ్చింది. ఇక బన్నీ కూడా ఈ మైనపు విగ్రహంతో ‘తగ్గేదేలే’ అంటూ సెల్ఫీ తీసుకున్నాడు. ప్రస్తుతం మైనపు విగ్రహంతో అల్లు అర్జున్ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పలువురు సెలబ్రెటీలు బన్నీకి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. అటు ఫ్యాన్స్ కూడా బన్నీని ఆకాశానికి ఎత్తుతూ పోస్టులు పెడుతున్నారు.
ఏకైక స్టార్ బన్నీనే!
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఇప్పటికే మన తెలుగు హీరోలు ప్రభాస్ (Prabhas), మహేష్ బాబు (Mahesh Babu) మైనపు విగ్రహాలు ఉన్నాయి. అయితే ఆ రెండు విగ్రహాలు లండన్‌లోని మ్యూజియంలో ఉన్నాయి. కానీ బన్నీది మాత్రం దుబాయ్‌లో ఏర్పాటు చేశారు. ఆ లెక్కన దుబాయి మ్యూజియంలో ఉన్న ఏకైక తెలుగు స్టార్ మైనపు విగ్రహం అల్లుఅర్జున్‌దే కావడం విశేషం.